ఇదేం వింత బాబా...?!
ABN , First Publish Date - 2022-12-03T23:39:36+05:30 IST
రజనీకాంత్‌కి హిట్లు, ఫ్లాపులూ కొత్తేం కాదు. తన కెరీర్‌లో రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలూ ఉన్నాయు. నిర్మాతల్ని రోడ్డుమీదకు తెచ్చిన ఫ్లాపులూ ఉన్నాయి. ‘
రజనీకాంత్‌కి హిట్లు, ఫ్లాపులూ కొత్తేం కాదు. తన కెరీర్‌లో రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలూ ఉన్నాయు. నిర్మాతల్ని రోడ్డుమీదకు తెచ్చిన ఫ్లాపులూ ఉన్నాయి. ‘బాబా’ అలాంటి ఫ్లాపే. ‘బాషా’ దర్శకుడు సురేశ్ కృష్ణతో రజనీ చేసిన సినిమా ఇది. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్ ప్లే రజనీకాంత్ అందించడం విశేషం. నిర్మాత కూడా రజనీనే. ఇరవై ఏళ్ల క్రితం అంటే... 2002 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. అభిమానుల్ని తీవ్ర నిరాశలో ముంచింది. ‘బాషా’ అంచనాలతో ఈ సినిమాని బయ్యర్లు భారీ రేట్లు వెచ్చించి కొన్నారు. రూపాయికి పావలా కూడా వెనక్కి రాకపోవడంతో బయ్యర్లు రజనీ ఇంటి ముందు భైటాయించారు. తమని ఆదుకోవాలని ధర్నాలు చేశారు. కానీ.. రజనీ అప్పట్లో వాళ్లకు ఏ విధమైన నష్టపరిహారం చెల్లించకపోవడం చర్చనీయాంశమైంది. అలా.. ‘బాబా’ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మరోసారి రీ రిలీజ్ చేయాలన్న నిర్ణయం తీసుకొంది చిత్రబృందం. అప్పట్లో ఎడిటింగ్ రూమ్‌లో తీసి, పక్కన పెట్టిన కొన్ని సన్నివేశాల్ని మళ్లీ జోడించారు. ఆయా సన్నివేశాలకు రజనీ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. ఏ.ఆర్.రెహమాన్ నేపథ్య సంగీతాన్ని జోడించారు. విడుదల ముందు భారీ ఎత్తున ప్రమోషన్లు చేయాలని భావిస్తున్నారు. డిసెంబరు 12న రజనీ పుట్టిన రోజు సందర్భంగా ‘బాబా’ని రీ రీలీజ్ చేస్తారు. రజనీకాంత్ సినిమాల్లో ఇన్ని సూపర్ హిట్లు ఉండగా, ఏరికోరి ‘బాబా’నే ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారన్న సంగతి ఎవ్వరికీ అర్థం కావడం లేదు. బహుశా.. ఈ చిత్రానికి రజనీ నిర్మాత కావడమే అందుకు బలమైన కారణం కావొచ్చు.