NRI: మూడేళ్ల క్రితం రోడ్డు పక్కన దొరికిన ఈ పిల్లాడు.. ఇప్పుడు అమెరికన్ కాబోతున్నాడు..!

ABN , First Publish Date - 2022-12-02T19:22:17+05:30 IST

తల్లిదండ్రులకు దూరమైన ఓ బాలుడికి తాజాగా కొత్త జీవితం లభించింది. ఆ బిడ్డకు తాము అమ్మానాన్న అవుతామంటూ అమెరికా దంపతులు ఆ చిన్నారిని తాజాగా దత్తత తీసుకున్నారు.

NRI: మూడేళ్ల క్రితం రోడ్డు పక్కన దొరికిన ఈ పిల్లాడు.. ఇప్పుడు అమెరికన్ కాబోతున్నాడు..!

ఎన్నారై డెస్క్: తల్లిదండ్రులకు దూరమైన ఓ బాలుడికి తాజాగా కొత్త జీవితం లభించింది. ఆ బిడ్డకు తాము అమ్మానాన్న అవుతామంటూ అమెరికా దంపతులు(America Couple) ఆ చిన్నారిని తాజాగా దత్తత(Adoption) తీసుకున్నారు. తమతో పాటూ అమెరికా తీసుకువెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనసుకు హత్తుకునే ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో(Bihar) చోటుచేసుకుంది. సుమారు మూడేళ్ల క్రితం నెలల వయసున్న ఆ చిన్నారిని నలందా జిల్లాలోని(Nalanda District) ఓ గ్రామంలో ఎవరో వదిలేసి వెళ్లారు. దానాపూర్‌కు చెందిన ఓ స్వచ్ఛంధ సంస్థ సిబ్బంది ఆ బిడ్డను గుర్తించి తమ సంస్థకు తీసుకొచ్చారు. అప్పటి నుంచీ వారి ఆలనాపాలనాలోనే ఆ చిన్నారి పెరుగుతున్నాడు. అతడికి వారు అర్జిత్ కుమార్ అని పేరు పెట్టారు. బిడ్డ తల్లిదండ్రుల కోసం ఎంత వెతికినా ఉపయోగం లేకపోయింది.

1.jpg

ఇదిలా ఉంటే.. అమెరికాకు చెందిన డా. కల్నల్ రే మిల్లర్(Dr. Colnel Ray Miller), ఆయన భార్య ఆ చిన్నారిని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. దీంతో.. దానాపూర్ స్వచ్ఛంధ సంస్థ ఈ విషయమై సబ్‌డివిజనల్ కార్యాలయానికి సమాచారం అందించింది. ఈ క్రమంలో.. సబ్‌డివిజనల్ ఆఫీసర్ ప్రదీప్ సింగ్ గురువారం నాడు ఇందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో..ఆ బిడ్డ జీవితం గొప్ప మలుపు తిరిగింది. ఆ చిన్నారికి పాస్‌పోర్టు కోసం డా. మిల్లర్ దంపతులు ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఒకటి రెండు రోజుల్లో పాస్‌పోర్ట్ జారీ అయ్యే అవకాశం ఉంది. బిడ్డను అమెరికాలోనే పెంచి పెద్ద చేస్తామని ఆ దంపతులు పేర్కొన్నారు.

Updated Date - 2022-12-02T19:28:58+05:30 IST