USA: షాకింగ్.. తనను మగాడిగా పెంచలేదంటూ కన్న తల్లిని..
ABN , First Publish Date - 2022-12-02T21:40:19+05:30 IST
తల్లిపెంపకంలో తాను అసలైన మగాడిగా ఎదగలేదంటూ ఈ యువకుడు ఎంత దారుణం చేశాడో చూడండి..
ఎన్నారై డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో(Florida) ఇటీవల దారుణం జరిగింది. కిస్సిమ్మీ(Kissimmee) ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన కన్నతల్లినే కడతేర్చాడు. తల్లి పెంపకం సరిగా లేదని, తనను అసలైన మగాడిగా ఎదిగేలా ఆమె చర్యలు తీసుకోలేదంటూ ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసుల విచారణలో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న నిందితుడిని ఇటీవలే అరెస్టు చేశారు.
ఓసియోలా కౌంటీ షెరిఫ్ కార్యాలయం(Osceola County Sheriff’s Office) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. నిందితుడు మ్యాథ్యూ స్టీవర్ట్ సిస్లీ(Mathew Stewart Sisley) ఇంటికి వెళ్లారు. ఇంట్లోని మంచంపై విగతజీవిగా పడి ఉన్న అతడి తల్లి, కత్తి గాయాలతో బాధపడుతున్న చెల్లి కనిపించారు. అయితే.. మ్యాథ్యూ అప్పటికే పరారయ్యాడు. మంగళవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తల్లిని ఎందుకు హత్య చేశావన్న ప్రశ్నకు మ్యాథ్యూ చెప్పిన సమాధానం అధికారులను షాక్‌కు గురిచేసింది. అయితే.. తల్లిని కావాలనే చంపానని అంగీకరించిన అతడు.. ప్రమాదవశాత్తూ చెల్లి తన చేతిలో గాయపడిందని చెప్పుకొచ్చాడు. హత్య చేసినందుకు తాను పశ్చాత్తాప పడటం లేదని, తల్లికి ఇది జరగాల్సిందేనని తేల్చి చెప్పాడు. కాగా.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.