America: ఫ్లోరిడాలో కలకలం.. ఏకంగా 1.70లక్షల మందిని చంపడానికి అవసరమయ్యేంత డ్రగ్ పట్టివేత!
ABN , First Publish Date - 2022-09-21T21:17:21+05:30 IST
అగ్రరాజ్యం అమెరికా(America)లో కలకలం చోటు చేసుకుంది. ఏకంగా 1.70లక్షల మందిని చంపేందుకు సరిపడా డ్రగ్ లభ్యమైంది. వారంలోపే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ లభించడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా(America)లో కలకలం చోటు చేసుకుంది. ఏకంగా 1.70లక్షల మందిని చంపేందుకు సరిపడా డ్రగ్ లభ్యమైంది. వారంలోపే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ లభించడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..
ఫెంటనైల్(fentanyl).. దీన్ని సక్రమంగా ఉపయోగిస్తే మనుషులకు మేలు చేస్తుంది. అదే దుర్వినియోగం చేస్తే.. ప్రాణాలు తీస్తుంది. ఫెంటనైల్‌ను మరో డ్రగ్‌తో కలిపి వైద్య రంగంలో ఉపయోగిస్తారు. ఆపరేషన్లు తదితర సమయాల్లో పేషెంట్లకు నొప్పి తెలియకుండా ఉండటానికి దీన్ని వాడుతారు. పేషెంట్ల శారీరక స్వాభావం తదితరాలను దృష్టిలో పెట్టుకుని మిల్లీ గ్రాములలో ఇతర డ్రగ్‌తో కలిపి దీన్ని అందిస్తారు. కాగా.. ఇంతటి డేంజర్ డ్రగ్‌ను ఫ్లోరిడా పోలీసు(Florida Police)లు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.
ఆదివారం తెల్లవారుజామున ఎమర్జెన్నీ నెంబర్‌కు ఫోన్ రావడంతో స్థానిక పోలీసులు హుటాహుటిన పామ్ కోస్ట్(Palm Coast)లోని గ్యాస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ గ్యాస్ స్టేషన్ మూసివేసి ఉండగా.. దాని వెనకాల ఫోర్డ్ రేంజర్ కారులో ఓ వ్యక్తి నిద్రిస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడిని నిద్ర లేపి.. పేరు తదితర వివరాలను అడిగారు. వాటికి అతడు సరైన సమాధానాలు చెప్పలేదు. దీంతో మరింత లోతుగా ప్రశ్నించిన అధికారులు.. ఓ కేసులో నాక్స్ కౌంటీ (Knox County) కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న జార్జియాకు చెందిన జేమ్స్ డ్యూక్(James Duke)గా అతడిని గుర్తించారు. అనంతరం అతడు పడుకున్న వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ వాహనంలో పెద్ద(338 గ్రాములు) మొత్తంలో ఫెంటనైల్‌ను గుర్తించారు. ఈ డ్రగ్‌ను మెక్సికో, ఫ్లేగ్లర్ కౌంటీ నుంచి అతడు అక్రమంగా అమెరికాలోకి తరలిస్తున్నట్టు గుర్తించిన అధికారులు ఆదివారం ఉదయం 4 గంటలకు జేమ్స్ డ్యూక్‌ను అరెస్ట్ చేశారు. కాగా.. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. జేమ్స్ డ్యూక్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫెంటనైల్ ద్వారా సుమారు 1.70 లక్షల మంది ప్రాణాలు తీయవచ్చన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఈ డ్రగ్ దొరకడం వారంలో ఇది రెండోసారి అని పేర్కొన్నారు.