New Orleans: న్యూఆర్లీన్స్‌లో భారీగా పెరిగిన హత్యలు..
ABN , First Publish Date - 2022-09-19T04:31:31+05:30 IST
న్యూఆర్లీన్స్ నగరంలో(New Orleans) హత్యల రేటు ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. 2021 నాటి గణాంకాలతో పోలిస్తే ఈమారు అక్కడ హత్యల సంఖ్య ఏకంగా 78 శాతం మేర పెరిగింది.
ఎన్నారై డెస్క్: న్యూఆర్లీన్స్ నగరంలో(New Orleans) హత్యల రేటు ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. 2021 నాటి గణాంకాలతో పోలిస్తే ఈమారు అక్కడ హత్యల సంఖ్య ఏకంగా 78 శాతం మేర పెరిగింది. 2019 నాటితో పోలిస్తే ఈ సంఖ్య 141 శాతం ఎక్కువ. నేరాల డాటాను సమీకరించే మెట్రోపోలిటన్ క్రైమ్ కమిషన్ ప్రకారం.. ప్రతి 100,000 వేల మంది స్థానికులకు 52 మంది హత్యకు గురైయ్యారట. దీంతో.. సెయింట్ లూయిస్(St. Louis) నగరాన్ని వెనక్కు నెట్టిన న్యూఆర్లీన్ అత్యధిక హత్యలు జరుగుతున్న నగరంగా, అమెరికాకు హత్యల రాజధానిగా(Murder capital) అపఖ్యాతి మూటగట్టుకుంది. న్యూఆర్లీన్స్ నగరంలో కాల్పుల ఘటనలు కూడా పెరిగాయి. 2019 నాటి లెక్కలతో పోలిస్తే ఈమారు కాల్పుల ఘటనల సంఖ్య రెండింతలైంది.
మరోవైపు.. నేరాలను అరికట్టేందుకు నగర పాలకులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీసుల జీతాలు పెంచేందుకు 80 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. మరోవైపు.. పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో సూచనలు ఇచ్చేందుకు న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ మాజీ అధికారి ఫాస్టో పిచార్డోను సలహాదారుగా నియమించారు. నగర పరిస్థితులను చక్కదిద్దాలంటే పోలీసులు వెంటనే రంగంలోకి దిగాలని ఆయన మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. తక్షణ చర్యల్లో భాగంగా..212 మంది పోలీసులను ప్యాట్రోల్ విధుల్లో నియమించాలని పిచార్డో సూచించారు.