దుబాయ్‌లో దీపావళి సందడి

ABN , First Publish Date - 2022-10-24T15:41:57+05:30 IST

దీపాల పండుగ దీపావళి ఉత్సవాలు దుబాయ్‌లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వారాంతపు సెలవులకు తోడు భారతీయ పాఠశాలలకు సోమ, మంగళవారాల్లోనూ సెలవులు ప్రకటించడంతో భారతీయ కుటుంబాల్లో సందడి నెలకొంది.

దుబాయ్‌లో దీపావళి సందడి

ధనత్రయోదశి సందర్భంగా 10 క్వింటాళ్ల బంగారం అమ్మకాలు

సౌదీలో తొలిసారి దీపాల పండుగ నిర్వహణ

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి, అక్టోబరు 23 : దీపాల పండుగ దీపావళి ఉత్సవాలు దుబాయ్‌లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వారాంతపు సెలవులకు తోడు భారతీయ పాఠశాలలకు సోమ, మంగళవారాల్లోనూ సెలవులు ప్రకటించడంతో భారతీయ కుటుంబాల్లో సందడి నెలకొంది. మరోపక్క, ధనత్రయోదశి, దీపావళిని పురస్కరించుకుని భారతీయులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేశారు. ధనత్రయోదశి సందర్భంగా ఆదివారం స్థానిక బంగారం దుకాణాలన్నీ కిటకిటలాడాయి. ఆదివారం రాత్రి వరకు ఒక్క దుబాయ్‌లోనే పది క్వింటాళ్లకు పైగా బంగారం అమ్మకాలు జరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పసిడి ధరలు తగ్గడం కూడా ఈసారి కలిసొచ్చిందని చెబుతున్నారు. గత దీపావళికి 200 దిర్హాంలుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 188 దిర్హాంలగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు బాగా పెరిగాయని దుబాయ్‌లోని ప్రఖ్యాత బంగారం నగల సంస్ధ మలబార్‌ గోల్డ్‌ సూక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఇర్ఫాన్‌ షేక్‌ చెప్పారు.

1.jpg

గత శుక్రవారం బంగారం ధర 184 దిర్హాంలకు పడిపోవడంతో పెద్ద సంఖ్యలో భారతీయులు అడ్వాన్సు బుకింగ్‌ చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇక, దీపావళి సందర్భంగా దుబాయ్‌లోని అనేక షాపింగ్‌ మాల్స్‌లో వారం రోజుల పాటు ప్రత్యేక ఆఫర్లు పెట్టారు. అయితే, కొవిడ్‌ ముందున్న పరిస్థితికి ఇప్పటికీ చేరుకోలేదని దుబాయ్‌లోని ప్రఖ్యాత తెలుగు రెస్టారెంట్‌ ‘అమరావతి’ యజమాని కొరపాటి సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కాగా, చాన్నాళ్ల తర్వాత దుబాయ్‌కు దీపావళి కళ వచ్చిందని స్థానికంగా నివసించే హైదరాబాదీ గోనెపల్లి అవంతిక అన్నారు. చరిత్రలో తొలిసారిగా సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌, జెద్దాలో దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చుతున్నారు. తెలుగు రాష్ట్రాల తరఫున తెలుగు ప్రవాసీ సంఘం, సాటా సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని సంఘం అధ్యక్షుడు మల్లేషన్‌, ప్రధాన కార్యదర్శి ముజమ్మీల్‌ షేక్‌ వెల్లడించారు.

Updated Date - 2022-10-24T16:11:52+05:30 IST