Elon Musk: బ్లాక్ లిస్ట్‌లో పడ్డ భారత సంతతి ప్రొఫెసర్‌తో ఎలాన్ మస్క్ సమావేశం

ABN , First Publish Date - 2022-12-12T21:33:51+05:30 IST

గతంలో ట్విటర్‌ బ్లాక్ లిస్టులో చేర్చిన భారత సంతతి ప్రొఫెసర్‌ డా. జయ్ భట్టాచార్యను(Dr. Jay Bhattacharya) ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా సమావేశమయ్యారు.

Elon Musk: బ్లాక్ లిస్ట్‌లో పడ్డ భారత సంతతి ప్రొఫెసర్‌తో ఎలాన్ మస్క్ సమావేశం

ఎన్నారై డెస్క్: గతంలో ట్విటర్‌ బ్లాక్ లిస్టులో(Black List) చేర్చిన భారత సంతతి ప్రొఫెసర్‌ డా. జయ్ భట్టాచార్యను(Dr. Jay Bhattacharya) ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) తాజాగా సమావేశమయ్యారు. డా. భట్టాచార్య బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడానికి గల కారణాలపై చర్చించారు. అంటువ్యాధుల నిపుణుడైన డా. భట్టాచార్య.. కొవిడ్ లాక్‌డౌన్‌లు పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వాదించి బ్లాక్ లిస్టు పాలుకావాల్సి వచ్చింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన డా. భట్టాచార్యతో పాటూ అప్పట్లో అనేక మంది లాక్ డౌన్ వ్యతిరేకులను ట్విటర్ బ్లాక్ లిస్ట్ చేసినట్టు ట్విటర్ ఫైల్స్‌ ద్వారా తాజాగా వెల్లడైంది. కాగా.. తాను ఓ రోజంతా ట్విటర్ ప్రధాన కార్యాలయంలో గడిపానని డా. భట్టాచార్యా తాజా ట్విట్ చేశారు. అప్పటి బ్లాక్ లిస్ట్ గురించి తెలుసుకునేందుకు ఇది తనకు లభించిన ఓ అవకాశమని వ్యాఖ్యానించారు. ‘‘ట్విటర్‌లో చేరిన మొదటి రోజే నన్ను బ్లాక్ లిస్టులో పెట్టారు. జీబీ డిక్లరేషన్(gbdeclaration) షేర్ చేయడమే దీనికి కారణమని నేను అనుకుంటున్నాను. ఈ డిక్లరేషన్‌పై కొందరు ఫిర్యాదు చేసి ఉంటారు’’ అని తాజాగా ఆయన ట్వీట్ చేశారు.

కరోనా సంక్షోభం తొలినాళ్లలో కోవిడ్ కట్టడి వ్యూహాలతో కాయకష్టం చేసుకునేవారు, పేదలు, చిన్నారులు బాధితులుగా మారారని వాదిస్తూ డా,. భట్టాచార్య, సునేత్ర గుప్తా, మార్టిన్ కుల్డా్ర్ఫ్‌ ఈ డిక్లరేషన్‌ను రాసుకొచ్చారు. ఆ మరుసటి రోజు అంటే.. 2021 అక్టోబర్ 4న ట్విటర్ వేదికగా దీన్ని విడుదల చేశారు. అయితే.. అప్పటి ట్విటర్ యాజమాన్యం(ట్విటర్ 1.0) నుంచి వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోరామని డా. భట్టాచార్య పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖ డాక్టర్ ఫ్రాన్సిస్‌ను ట్విటర్ సంప్రదించి ఉంటే తమ నిబద్ధత గురించి తెలిసుండేదని వ్యాఖ్యానించారు. ‘‘మేము చెప్పినదానికి కట్టుబడి ఉండాలన్న రీతిలో అప్పటి ట్విటర్ యాజమాన్యం ఎందుకు నన్ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందో తెలుసుకునేందుకు మరి కొంత సమయం పడుతుంది. ఈ విషయంలో సాయం చేస్తానన్న మస్క్‌కు నా ధన్యవాదాలు. పారదర్శకతకు, భావప్రకటనా స్వేచ్ఛకు వేదికగా మారిన కొత్త ట్విటర్‌లో తదుపరి విషయాలు వెల్లడిస్తా.’’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-12-12T21:33:52+05:30 IST