కాంగ్రెస్ పునరుత్థాన పథం
ABN , First Publish Date - 2022-05-18T12:55:49+05:30 IST
ప్రజాస్వామ్య వ్యవస్ధల్లో ప్రభుత్వాలు ప్రతీ ఐదేళ్లకు తప్పనిసరిగా ప్రజామోదం పొందవలసి ఉంటుంది. గల్ఫ్ దేశాలలో సంపూర్ణ రాచరిక పాలన వర్థిల్లుతోంది.
ప్రజాస్వామ్య వ్యవస్ధల్లో ప్రభుత్వాలు ప్రతీ ఐదేళ్లకు తప్పనిసరిగా ప్రజామోదం పొందవలసి ఉంటుంది. గల్ఫ్ దేశాలలో సంపూర్ణ రాచరిక పాలన వర్థిల్లుతోంది. అయినప్పటికీ రాచరిక ప్రభువులు ముఖ్యంగా యువరాజులు ప్రజాస్వామ్య పాలకుల కంటే మెరుగ్గా పాలిస్తూ, నిరంతరం ప్రజానాడిని తెలుసుకుంటూ పాలితుల మన్ననలను పొందుతున్నారు. మరి ప్రజలలో నిరంతరం ఉండవల్సిన భారతీయ రాజకీయ పక్షాలు ప్రజలకు క్రమేణా దూరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, గతమెంతో ఘనకీర్తి కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఉదయపూర్‌లో నిర్వహించిన నవ సంకల్ప్ చింతన్ శివిర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, ముడి చమురు ధరలు, విద్యలో వెనకబాటుతనం, వివిధ తెగల మధ్య సమతుల్యత పాటించడం మొదలైన సవాళ్లు, సమస్యలను అధిగమిస్తూ తమ దేశాలను మరింత సంపద్వంతం చేస్తున్న గల్ఫ్ దేశాల రాచరిక కుటుంబాలు నిరంతరం ప్రజలలో ఉంటాయి. అపార చమురు నిక్షేపాలు తమ స్వంత జాగీరులే అయినప్పటికీ ప్రజాభీష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తుంటాయి. తమ విధానాలను, మనోభావాలను చాలా విస్పష్టంగా తమ ప్రజలకు చేరవేస్తాయి. జన్మతః అధికారం, అంతులేని సంపాదన ఉన్నప్పటికీ యువరాజులందరూ తమ పూర్వీకుల కంటే మిన్నగా పాలించాలనే ఆసక్తి చూపుతారు. అందుకే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారు. వివిధ తెగల పెద్దలతో తమ రాజ సౌధాలలో సదా మజ్లీస్ (భేటీ) జరుపుతుంటారు. ఇదే వారి విజయరహస్యం.
ఇప్పుడిక భారత్‌లోని కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. ఉదయపూర్‌లో జరిగిన చింతన శివిర్‌లో ప్రజలతో తమ సంబంధాలు తెగిపోయాయనే వాస్తవాన్ని అంగీకరించాలని కాంగ్రెస్‌కు యువరాజుగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ ఘంటాపథంగా చెప్పారు. ప్రజలతో మమేకం కావడానికి వారితో సంబంధాలను పునరుద్ధరించుకోవల్సిన అవశ్యకతను కూడ ఆయన నొక్కిచెప్పారు. యువతకు 50 శాతం ప్రాధాన్యం ఇస్తామని కూడ ఆ సమావేశం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి ఉపాధి కొరకు నిత్యం విదేశాలకు వెళ్లుతున్న వారందరూ యువకులు కదా. అయితే వారెవరినీ చేరుకోవడానికి కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రయత్నించలేదు. గల్ఫ్, యూరోప్, అమెరికా దేశాలలో కనీసం తెరాస, డియంకె తరహా ప్రాంతీయ పార్టీల కార్యకలాపాల ముందు కాంగ్రెస్ పత్తా లేకుండా పోతుంది. దుబాయిలో 2019లో రాహుల్ గాంధీ జరిపిన సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ సభ కంటే దీటుగా జరిగింది. అయితే ఆ తర్వాత ఈ ప్రాంతం గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. ప్రస్తుతం లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ (కేరళ) నియోజకవర్గానికి చెందిన యువజనులు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలలో ఉన్నారు. కాంగ్రెస్ ఎన్నడైనా వారి బాగోగుల గురించి పట్టించుకుందా? ఇక స్వదేశంలో యువత విషయానికి వస్తే, ఒకప్పుడు కీలకమైన యువజన కాంగ్రెస్ ఇప్పుడు కనుమరుగైంది. గులాం నబీ ఆజాద్ నుంచి వి.హనుమంతరావు దాకా నేటి కాంగ్రెస్ అతిరథ మహారథులు పలువురు యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన వారే కదా.
ప్రజలలో ఉండవల్సిన పార్టీ వారికి ఎందుకు దూరమయింది? ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడవల్సిన పార్టీ పత్రికా సమావేశాలకు లేదా ట్వీట్లకు మాత్రమే ఎందుకు పరిమితమవుతోంది? ఆత్మవిమర్శ చేసుకోవాలి. బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని రూపొందించి ప్రజలలోకి తీసుకువెళ్ళగల్గిన నేతలు ఆ పార్టీలో కరువయ్యారు. సైద్ధాంతికంగా ఆ పార్టీ ఒక సందిగ్థావస్ధలో ఉంది. నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉన్నా నాయకత్వ లేమి పార్టీని కృంగదీస్తుంది. చివరకు ఒక దశలో ప్రశాంత్ కిషోర్ తరహా వ్యూహకర్తల ముందు పార్టీని తాకట్టు పెట్టవల్సిన దుస్ధితి దాపురించింది. వందిమాగధ గణం, కోటరీ స్వార్థాలు తెలిసి ఉండి కూడా వాటి నుంచి కాంగ్రెస్ బయటకు రాలేని దుస్ధితిలో ఉంది. కనుకనే సమకాలీన రాజకీయాలలో ఉనికిని కోల్పోతోంది. తమ గతం నుంచి తేరుకుని వర్తమానంలోకి రాలేకపోతె ఎంతటి మహా వ్యక్తి అయినా, మహా సంస్థ అయినా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.
రాహుల్ గాంధీకి, చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్‌కు పెద్దగా తేడా లేదు. జఫర్ పాలన కేవలం ఎర్రకోట పరిసర ప్రాంతాలకే పరిమితం కాగా ఆయన సదా కవిత్వం, కళలు, చదరంగం ఆటలో నిమగ్నమై ఉండేవాడు. అటు మద్రాస్ నుంచి ఇటు చిట్టగాంగ్ వరకు వ్యాపించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడడానికి బహదూర్ షా జఫర్ నాయకత్వమే ఏకైక మార్గమని 1857 తిరుగుబాటుదారులు భావించారు. అందుకే ఆయన్ని బలవంతంగా తమ నాయకుడిగా ప్రకటించారు. ఆ రకంగా గత్యంతరం లేని పరిస్ధితులలో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి చివరి మొగల్ చక్రవర్తి నాయకత్వం వహించాడు. అయిష్ట నాయకత్వం, బలమైన ప్రత్యర్ధి కారణాన అది విఫలమయిందన్నది వేరే విషయం. ఇప్పుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పరిస్ధితి అంతకంటే భిన్నంగా ఏమి లేదు. ఈ నేపథ్యంలో ఉదయపూర్‌లోని చింతన్ శివిర్‌తో కాంగ్రెస్ పార్టీ ఎంత వరకు నూతన జవసత్వాలను పుంజుకుంటుంది? ప్రజాక్షేత్రంలో అందునా ప్రత్యేకించి యువతకు చేరువయ్యే విధానంపైనే కాంగ్రెస్ పునరుజ్జీవనం ఆధారపడి ఉంది.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)