మనకు తప్పిన లంక కష్టాలు

ABN , First Publish Date - 2022-07-13T12:56:13+05:30 IST

ప్రపంచీకరణ వేగంగా జరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఏ దేశానికైనా విదేశీ మారకం అత్యంత అవశ్యం.

మనకు తప్పిన లంక కష్టాలు

ప్రపంచీకరణ వేగంగా జరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఏ దేశానికైనా విదేశీ మారకం అత్యంత అవశ్యం. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అంతగా అభివృద్ధి చెందని ఆసియా దేశాలు, ప్రత్యేకించి దక్షిణాసియా దేశాలకు విదేశీ మారకం మరీ ముఖ్యం. ఇందుకోసం అవి తమ సహజ సంపద, పరిశ్రమలు, వాణిజ్యం కంటే, విదేశాలలో పని చేసే తమ మానవ వనరులపైనే ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది.


ఈ దేశాలకు చెందిన ప్రవాసీయులు ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళి, అక్కడ సంపాదించడం ద్వార ప్రత్యక్షంగా తమ కుటుంబాలను, పరోక్షంగా తమ దేశాలను కూడ ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తే, ప్రవాసీ పాత్ర ఎంత కీలకమైనదో అవగతమవుతుంది. శ్రీలంక విదేశీ మారక ద్రవ్య సంపాదనలో పర్యాటక రంగం కంటే గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న శ్రీలంక ప్రవాసీయులది కీలక పాత్ర. 15 లక్షల మంది శ్రీలంక ప్రవాసీయులు విదేశాలలో పని చేస్తుండగా, అందులో 80 శాతం మంది గల్ఫ్ దేశాలలో ఉన్నారు.


భారత్ సహా మిగిలిన దక్షిణాసియా దేశాల మాదిరిగా కాక, శ్రీలంక ప్రభుత్వం తమ ఆర్థిక వ్యవస్ధకు పట్టుకొమ్మ వంటి ప్రవాసీయుల సంక్షేమం, భద్రతకు పెద్ద పీట వేస్తుంది. శ్రీలంక రాయబారి, ఇక్కడకు పర్యటనకు వచ్చే శ్రీలంక మంత్రులు నాతో అనేక ఆంశాలపై మాట్లాడడం జరుగుతున్నప్పుడల్లా వారి సంభాషణలలో, అనంతరం కార్యచరణలో ఎంతో చిత్తశుద్ధి ఉంటుంది. ఇది ఇతర దేశాలలో లోపించిందని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రవాసీయులపై అంతటి శ్రద్ధ ప్రదర్శించే శ్రీలంక ప్రభుత్వం అదే ప్రవాసీయుల కారణాన ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటోంది. శ్రీలంక ఆర్థిక వ్యవస్ధ పతనమవడానికి అనేక కారణాలున్నా అందులో ప్రముఖంగా ప్రస్తావించవల్సింది ఆ దేశ ప్రవాసీయులు తమ మాతృభూమికి పంపించే డబ్బు గురించి. వార్షికంగా సుమారు 7 బిలియన్ డాలర్లు స్వదేశానికి పంపే ప్రవాసీయులు లంకకు ఆర్థికంగా వెన్నుపూస లాంటి వారు. కరోనా సంక్షోభ అనంతరం ఏర్పడ్డ పరిస్థితుల వలన ప్రవాసీయులు పంపించే డబ్బు క్రమేణా తగ్గడం మొదలయింది. తమిళ పులులను పూర్తిస్థాయిలో అణిచివేయడంతో పాటు రాజకీయంగా కూడా తనకు ఎవరూ ప్రత్యర్ధులు లేరనే మితిమీరిన విశ్వాసంతో మహిందా రాజపక్సే అనేక చర్యలు చేపట్టారు. వాటిలో శ్రీలంక రూపాయికీ డాలర్‌కీ మధ్య నిర్ణయించిన మారకం ధర కూడ ఒకటి. వాస్తవస్థితి కంటే తక్కువ మారకం ధరకు డాలర్ నిర్ణయించడంతో అధికారికంగా బ్యాంకింగ్ ద్వారా డబ్బు పంపించిన ప్రవాసీయులు పెద్ద మొత్తంలో నష్టపోతుండగా అనధికారికంగా ఉండియాల్ (హవాలా లేదా హుండి) ద్వారా పంపించేవారు ప్రయోజనం పొందుతున్నారు. దీనితో అధికులు హవాలాను అనుసరించడం ఆరంభించారు. విదేశాల నుంచి డబ్బును బ్యాంకింగ్ విధానంలోనే పంపించాలంటూ ప్రభుత్వం చేస్తున్న అభ్యర్థనలను ప్రవాసీయులు పెడచెవిన పెట్టడంతో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. కరోనా కంటె ముందు ఒక రియాల్‌కు 48 రూపాయలున్న శ్రీలంక రూపాయి విలువ ఇప్పుడు 98 రూపాయలకు చేరుకొంది.


పాకిస్తాన్ కూడా దాదాపుగా శ్రీలంక తరహాలోనే ఆర్థికంగా దివాళ తీసింది. కానీ, పాకిస్తానీ ప్రవాసీయులు తమ కుటుంబాలకు ప్రతి నెల పంపించే డబ్బుకు తోడుగా గల్ఫ్ దేశాలు చేసిన ఆర్థిక సహాయం, రుణంపై చమురు సరఫరా వంటి కారణాలతో అది నెట్టుకు రాగలుగుతోంది. కానీ, శ్రీలంకలో ఆ పరిస్థితి లేదు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్ధ బలోపేతం కావడంలో కూడ ప్రవాసీయుల పాత్ర ఉంది. ఆ మాటకు వస్తే, 1998లో పొఖ్రాన్ అణు పరీక్షల అనంతరం భారత్ ఆంక్షల దిగ్బంధంలో ఉన్నప్పుడు కూడ ప్రవాసీయులే భారత ఆర్థిక వ్యవస్థను ఆదుకున్నారు. 


దిగుమతులపై ఆధారపడ్డ శ్రీలంక రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పుడు బలహీనమైనట్లుగా, 1991లో ఇరాక్– కువైత్ యుద్ధంతో భారత ఆర్థిక వ్యవస్థ కూడ కుప్పకూలుతున్న స్థితి ఏర్పడింది. అప్పుడు అంతర్జాతీయ విపణిలో బంగారం తాకట్టుపెట్టి అప్పులు తెచ్చుకొని మరీ మనం చమురును దిగుమతి చేసుకొన్నాం. మన్మోహన్ సింగ్ కంటే ముందుగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అప్పటి ఆర్థికమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హా కృషి చేశారు. అప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి రుణ ప్రతిపాదనలు చేసింది మన తెలుగు ముద్దుబిడ్డ వై.వి.రెడ్డి. ఆ రుణం ఆమోదం పొందేవరకు తాత్కాలికంగా లండన్‌లో కుదువపెట్టడానికి బంగారాన్ని బొంబాయి విమానాశ్రయానికి తరలించే ఏర్పాట్లను కూడ పరిశీలించింది ఆయనే. దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ కాలంలో చంద్రశేఖర్, వి.పి.సింగ్, వాజ్‌పేయి తదితరులందరూ రాజకీయాలకు అతీతంగా జాతి ప్రయోజనాలను కాంక్షించినవారే. సద్దాం హుస్సేన్ సేనలపై దాడులు చేయడానికి గల్ఫ్‌కు వెళ్తున్న అమెరికన్ యుద్ధ విమానాలకు మార్గమధ్యంలో బొంబాయిలో ఇంధనం నింపవల్సిందిగా న్యూఢిల్లీలోని అప్పటి సౌదీ అరేబియా రాయబారి చేసిన విజ్ఞప్తిని అధికార, ప్రతిపక్షాలు రెండూ మన్నించడానికి జాతి ప్రయోజనాలే ప్రధాన కారణం. లేని పక్షంలో అప్పట్లో మన పరిస్థితులు కూడా ఇప్పటి శ్రీలంకకు భిన్నంగా ఉండకపోయేవి. ఆ రకమైన దార్శనికత, రాజకీయ వాతావరణం శ్రీలంకలో లేకపోవడం ఇప్పుడు దాని ప్రధాన సమస్య.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)



Updated Date - 2022-07-13T12:56:13+05:30 IST