పాకిస్థాన్‌ ‘కెప్టెన్’ గెలిచేనా?

ABN , First Publish Date - 2022-04-06T12:56:19+05:30 IST

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పాలన పేరుకు మాత్రమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే విదేశాంగ విధానాన్ని పూర్తిగా పాక్ సైన్యమే శాసిస్తుంది.

పాకిస్థాన్‌ ‘కెప్టెన్’ గెలిచేనా?

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పాలన పేరుకు మాత్రమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే విదేశాంగ విధానాన్ని పూర్తిగా పాక్ సైన్యమే శాసిస్తుంది. తాము నిర్దేశించిన విదేశాంగ నీతికి భిన్నంగా ప్రజలచేత ఎన్నుకోబడ్డ ఏ ప్రభుత్వమైనా వ్యవహారిస్తే దానికి సైన్యం ఉద్వాసన చెప్పడం ఖాయం. భారత్, గల్ఫ్ దేశాల విషయంలో తమ అభీష్టానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్న నవాజ్ షరీఫ్‌ను తొలగించేందుకు పాక్ సైనికాధికారులు ఏమాత్రం వెనుకాడలేదు. ఆ తరువాత వారే ఇమ్రాన్‌ఖాన్‌ను ‘ఎన్నిక చేయించారు’. అయితే ఇమ్రాన్ సైతం తమతో సంబంధం లేకుండా సొంత విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుండడంతో సైన్యం ఆగ్రహించింది. ప్రధానమంత్రి పదవి నుంచి ఆయన్ని తప్పించేందుకు సైనికాధికారులు పూనుకున్నారు. ఇందుకు వారు రచించిన పథకంలో భాగమే ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడంలోనూ, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో విఫలమయ్యారనే అభియోగాలతో ఇమ్రాన్‌పై విపక్షాలు అవిశ్వాస సమరానికి ఉపక్రమించాయి. పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్ధలో గల్ఫ్ దేశాలు ప్రత్యేకించి సౌదీ అరేబియా కీలక పాత్ర వహిస్తుందనేది ఇక్కడ గమనార్హం.


పాకిస్థాన్‌కు అండగా నిలుస్తున్న గల్ఫ్ దేశాలతో టర్కీకి పొసగదు. అటువంటి టర్కీ, ఇంకా మలేషియాతో కలిసి నూతన ఇస్లామిక్ దేశాల కూటమిని ఏర్పాటు చేయడానికి ఇమ్రాన్ ప్రభుత్వం పూనుకోవడాన్ని పాక్ సైన్యం హర్షించలేదు. ఇస్లామాబాద్‌పై అగ్రహించిన గల్ఫ్ దేశాలను సైన్యాధిపతి జనరల్ బజ్వా శాంతింపజేశారు. ఆ తర్వాత గల్ఫ్ దేశాల అధిపత్యంలోని ఇస్లామిక్ దేశాల కూటమి (ఐ.ఓ.సి)కి ప్రత్యామ్నాయంగా టర్కీ, మలేషియాలతో కలిసి ఏర్పాటు చేయాలనుకున్న సమాఖ్యను ఇమ్రాన్‌ఖాన్‌ ఉపసంహరించుకున్నారు. గల్ఫ్ దేశాలు సంయుక్తంగా యమన్‌లో చేపడుతున్న సైనిక చర్యలో పాల్గొనేందుకు కూడా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం నిరాకరించింది. గతంలో యమన్ అంశంపై నవాజ్ షరీఫ్‌ను గద్దె దింపడంలో కొన్ని గల్ఫ్ దేశాలు ముఖ్య భూమిక వహించాయి. నవాజ్ షరీఫ్‌కు స్ధానికంగా ఉన్న వీసాను దుబాయి వెల్లడించడంతో లాభాపేక్ష పదవుల నిబంధన మూలంగా నవాజ్ షరీఫ్ తన పదవిని కోల్పోయారు. గల్ఫ్ దేశాలలో పాక్ ప్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇమ్రాన్‌ఖాన్‌ పలుమార్లు బహిరంగంగా ప్రస్తావించారు. ఈ విషయంలో ఇమ్రాన్ వైఖరి గల్ఫ్ పాలకులకు రుచించలేదు. మతం పేర తమను బురిడీ కొట్టించడం మినహా గల్ఫ్ రాజులు తమకు చేసిందేమీ లేదని కూడ ఇమ్రాన్‌ఖాన్‌ ఎత్తిచూపడం జరిగింది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కారణాన పాకిస్థాన్ దాదాపుగా దివాలా తీసింది. ఆదుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకుతో సహా ఎవరూ ముందుకు రాని క్లిష్ట పరిస్ధితులలో సౌదీ అరేబియా నగదు రూపేణా, చమురు సరఫరాతో పాకిస్థాన్‌ను ఆదుకున్నది. ఇందుకు పాక్ సైన్యమే ఒక రకంగా కారణం. 


పాకిస్థాన్ విదేశాంగ విధానంలో కీలక పాత్ర వహించే ఐయస్ఐ అధిపతి నియామక విషయంలో తనను ముందుగా సంప్రదించలేదని ఇమ్రాన్‌ఖాన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సైన్యంతో ఆయనకు మరింత చెడింది. వీటన్నింటికీ మించి ఇమ్రాన్‌ఖాన్‌ స్వంతంగా, స్వతంత్రంగా ప్రజలలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడాన్ని కూడా సైనికాధికారులు హర్షించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ తమ దేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం లేదంటూ అదే భారత్‌కు ఒక స్వంత విదేశాంగ విధానం ఉందంటూ ప్రశంసించారు. ఈ ప్రశంస పాక్ అంతర్గత వ్యవహారాలలో తుఫాన్‌ను సృష్టించింది. ఇమ్రాన్ నిజానికి ఇక్కడ భారత్‌ను ప్రశంసించడం కంటే ఎక్కువగా పరోక్షంగా తమ సైన్యంపై పరోక్ష విమర్శ చేశారు.


దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ, సైన్యంతో సఖ్యత లోపానికి తోడుగా ప్రతిపక్షాలన్నీ నవాజ్ షరీఫ్ కుమార్తె మర్యం నేతృత్వంలో సమైక్యమై ప్రజాక్షేత్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ పోరాటానికి ప్రజలు బాగా స్పందించారు. దీంతో పాకిస్థాన్ చరిత్రలో ఇప్పటి వరకు దివంగత జుల్ఫీకర్ అలీ భుట్టోతో సహా మరే నాయకుడూ సాహసించని విధంగా సైన్యంతో అమీతుమీ తేల్చకోవడానికి ఇమ్రాన్ నిర్ణయించుకున్నారు. అందుకు వ్యూహాత్మకంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. తనను గద్దె దించడానికి ప్రతిపక్షాలను అమెరికా ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మసకబారిన రష్యా కూడా ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతుగా అమెరికాను విమర్శించడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఇక, అవిశ్వాస తీర్మానం చివరి మజిలీలో పార్లమెంటు రద్దుకు సిఫారసు చేసి సైన్యంతో సహా అందరినీ ఇమ్రాన్ ఆశ్చర్యపరిచారు. మున్ముందు న్యాయస్ధానాలు ఏ రకమైన తీర్పునిచ్చినా, రాజకీయంగా ఇమ్రాన్‌ఖాన్‌ అంతిమ విజయం సాధించే అవకాశాలున్నా దేశ ఆర్ధిక వ్యవస్ధ మాత్రం ఇంకా విఫలమవుతూనే ఉంది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే దాని సమస్త విధానాలకు జాతి ప్రయోజనాలే గీటురాయి కావాలి.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2022-04-06T12:56:19+05:30 IST