ప్రవాసుల ఆత్మగానం

ABN , First Publish Date - 2022-02-09T13:21:28+05:30 IST

‘సంగీత మపి సాహిత్యం, సరస్వత్యాఃస్తనద్వయం/ ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం’- సంగీత ప్రాధాన్యాన్ని విశదీకరించే ఈ శ్లోకం 13వ శతాబ్ది సంగీతవేత్త శార్ఙదేవుడు రచించిన ‘సంగీత రత్నాకరం’లోనిది.

ప్రవాసుల ఆత్మగానం

‘సంగీత మపి సాహిత్యం, సరస్వత్యాఃస్తనద్వయం/ ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం’- సంగీత ప్రాధాన్యాన్ని విశదీకరించే ఈ శ్లోకం 13వ శతాబ్ది సంగీతవేత్త శార్ఙదేవుడు రచించిన ‘సంగీత రత్నాకరం’లోనిది. సంగీతం చెవుల్లో పడగానే మధురంగా ఉంటుందని ఆ శ్లోకం ఒక అందమైన ఉపమానంతో వివరిస్తుంది. గానకోకిల లతా మంగేష్కర్ మధుర గాత్రమే ఆ మాధుర్యానికి ఉదాహరణ. ఈ గానభారతి ఎల్లలు దాటి సంగీత విశ్వాన్ని ఓలలాడించారు.


ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఎక్కడ ఉన్నా, వారి మూలాలు మాతృభూమిలో వేళ్ళూనుకుని ఉండడం వెనుక ఉన్న కారణాలలో ఒకటి లతా మంగేష్కర్ మధుర గానం. ఇది అత్యుక్తి కాని సత్యం. కరేబియన్ దీవి ట్రినిడాడ్ – టోబాగో నుంచి పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల వరకు భారతీయులకు తమ జాతి సంస్కృతి, జీవన విధానం తెలుసుకోవడానికి లతాజీ పాటలు విశేషంగా దోహదం చేస్తున్నాయి. విదేశాలలో స్ధిరపడి అక్కడే పుట్టి పెరిగిన అనేక మంది భారతీయ సంతతి ప్రజలకు, వారి పూర్వీకుల మాతృభూమి అయిన భారత్‌కు మధ్య ఆమె ఒక వారధి. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తో సహా ఉపఖండంలోని సమస్త ప్రజలకు, భారతీయ సంస్కృతికి ఆమె ఒక ప్రతినిధి. భారతదేశం ఎట్లా ఉంటుందో తెలియని విదేశీయులకు ఆమె తన గళం ద్వారా మన దేశాన్ని పరిచయం చేశారు. కేవలం ధన సంపాదన ప్రాతిపదికన కాకుండా భారతీయ సంస్కృతి కొలమానంగా, స్పష్టమైన షరతులతోనే సినిమా పాటలకు ఆమె తన స్వరాన్ని అందించారు. లతాజీ అలా తన భారతీయ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. భారతీయ సంస్కృతి కారణంగానే ఆమె ఒక్క భారతీయుల ఆదరాభిమానాలనే కాకుండా ఇతర జాతీయుల గౌరవాదరాలను కూడా సమున్నతంగా పొందారు.


రెండు దశాబ్దల క్రితం ఒక విందు సందర్భంగా అరబ్, అమెరికన్ మిత్రులు కొంతమంది భారతీయుల ప్రత్యేకత గురించి వివరించమని నన్ను అడిగారు. అప్పుడే విడుదలయిన హిందీ చలనచిత్రం ‘మోహబ్బత్’లోని ‘హం కో హమీసే చూరాలో’ పాటను ప్రదర్శించి గాయని వయస్సును అంచనా వేయమని చెప్పాను. అందరి సమాధానాలు విన్న తరువాత ఆ పాట పాడిన లతా మంగేష్కర్ వయస్సు ఎంతో వెల్లడించాను. వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి అయిన లతాజీ విదేశాలలో వేదికల మీద ప్రత్యక్షంగా పాటలు పాడడానికి వెనుకంజ వేసేవారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఆత్మకథలో పేర్కొన్నారు. చిన్న రికార్డింగ్ స్టూడియోలో సంగీత దర్శకుడు మరో ఇద్దరి ముందు పాటలు పాడే తాను విశాలమైన మందిరాలలో వేలాది శ్రోతల సమక్షంలో పాడడానికి భయం వేసేదని లత అన్నారు. విదేశాలలో లత సంగీత కార్యక్రమాలకు భారతీయులతో పాటు పాకిస్థానీయులు, బంగ్లాదేశీయులు కూడ పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు. 1974 నుంచి 1998 వరకు విదేశాలలో ప్రధానంగా ఉత్తర అమెరికాలో సంగీత కార్యక్రమాలను నిర్వహించిన లతా మంగేష్కర్ గల్ఫ్‌లో మాత్రం ఒకే ఒక్కసారి దుబాయిలో నిర్వహించారు. విదేశాలలో సంగీత కచేరీలకు లతను ప్రోత్సహించిన వ్యక్తి మధుర గాయకుడు ముకేష్. ఆమెతో పాటు ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్ళిన ముకేష్ అక్కడ అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించారు.


కన్నవారికి, కట్టుకున్న వారికి దూరంగా విదేశాలలో ఒంటరిగా ఉంటూ పనిచేసుకునే లక్షలాది భారతీయులను మానసికంగా నిత్యం మాతృభూమికి సన్నిహితం చేస్తున్నది లత మధుర గానమే అనడంలో అతిశయోక్తి లేదు. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ లేని, కేవలం టేప్ రికార్డులే ప్రధాన ఆధారంగా ఉన్న కాలంలో లతాజీ పాటల వీనుల విందుతో సేద దీరుతూ ఏళ్ళు గడిపిన ప్రవాసులు సంఖ్యానేకులు. వీడియోలు విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, కొత్త హిందీ సినిమాల క్యాసెట్లు లభ్యం కాని పక్షంలో లతా మంగేష్కర్ పాత పాటల వీడియోలు అద్దెకు తీసుకెళ్ళి, వీక్షించి ఆనందించేవారు. పని ఒత్తిడి, ఇతర కారణాల వలన అలిసిపోయిన సమయంలో అనేక మంది లతా మంగేష్కర్ పాత పాటలలో ఒకటి విని ఉల్లాసం పొందేవారు. 1940 దశకంలో ఆమె గొంతులో ఉన్న మాధుర్యం చివరి వరకు నిత్యనూతన సొగసులతో వర్ధిల్లింది. అన్ని తరాల శ్రోతలు ఆమెను ఆదరించారు. ఒక దశాబ్దకాలంగా సినీ సంగీతానికి ఆమె దూరంగా ఉన్నారు. తరాలు మారినా యూట్యూబ్‌లో లక్షలాది శ్రోతలు లతాజీ పాటలు వింటూ కొత్త జీవనోత్సాహాన్ని పొందుతున్నారు. దేవానంద్, వహీదారెహమాన్ నాయికా నాయకులుగా నటించిన ‘గైడ్’ సినిమాలో ‘ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై / ఆజ్ ఫిర్ మరనే కా ఇరాదా హై’ (మనసు గాలిలో అలా తేలిపోతూ వుంటే/ మరలా ఈ రోజు జీవితేచ్ఛ/ మరలా ఈ రోజు మృత్యుకాంక్ష) అంటూ లత పాడిన మధుర గీతం భావితరాలకు కూడా గుర్తుండిపోతుంది. అదే ఆమెకు అజరామర నివాళి. 

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2022-02-09T13:21:28+05:30 IST