Gold from Dubai: దుబాయిలోని ప్రవాసులూ.. బంగారం విషయంలో ఉన్న ఈ రూల్స్‌ను అస్సలు మర్చిపోవద్దు..!
ABN , First Publish Date - 2022-10-13T15:28:42+05:30 IST
యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్(United Arab Emirates)లో ఉండే భారత ప్రవాసులు స్వదేశానికి తిరిగి వస్తున్నారంటే ఎంతో కొంత బంగారం తీసుకుని రావడం సర్వసాధారణం. అందులోనూ దీపావళి సీజన్‌లోనైతే దుబాయిలో ఉండే జ్యువెలరీ షాపులు పసిడి నగలపై ప్రత్యేక రాయితీలు ఇస్తుంటాయి. దాంతో మనోళ్లు ఇతర ఆభరణాల కంటే కూడా బంగారు...
దుబాయి: యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్(United Arab Emirates)లో ఉండే భారత ప్రవాసులు స్వదేశానికి తిరిగి వస్తున్నారంటే ఎంతో కొంత బంగారం తీసుకుని రావడం సర్వసాధారణం. అందులోనూ దీపావళి సీజన్‌లోనైతే దుబాయిలో ఉండే జ్యువెలరీ షాపులు పసిడి నగలపై ప్రత్యేక రాయితీలు ఇస్తుంటాయి. దాంతో మనోళ్లు ఇతర ఆభరణాల కంటే కూడా బంగారు నగల కొనుగోళ్లకు అమితాసక్తి కనబరుస్తుంటారు. ఇంకా చెప్పాలంటే దుబాయ్‌లో బంగారం (Gold) విలువ మన దగ్గర కంటే 15 శాతం వరకు చీప్‌గా ఉంటుంది. అంతేగాక ఇక్కడ లభించే పసిడి స్వచ్ఛత కూడా వరల్డ్‌లోనే ఎక్కడ దొరకదట. అలాగే అన్ని రకాల వెరైటీ జ్యువెలరీ ఇక్కడ దొరకడం మరో ప్రత్యేకత.
దుబాయి (Dubai)లో జీఈడీ మలబార్ గ్రూప్ జ్యువెలరీ వైస్ చైర్మన్ కేపీ అబ్దుల్ సల్మాన్ మాట్లాడుతూ.. "ప్రపంచంలోనే బంగారం, ఇతర ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఉత్తమ ప్రదేశం. ఎందుకంటే ఇక్కడ దొరికే ఉత్తమ ధరలు మరెక్కడ దొరకవు. అంతేగాక చాలా వెరైటీలు ఉంటాయి. భారతదేశంలోని ఏ ప్రాంతంలో వారు ధరించే ఆభరణాలైన ఇక్కడ దొరుకుతాయి. ఏ భారతీయ వ్యక్తి అయిన ఆభరణాలను కొనుక్కోవాలంటే దుబాయే బెస్ట్ ప్లేస్(భారతదేశంలో దాని మూలంతో సంబంధం లేకుండా)." అని చెప్పుకొచ్చారు. "మీరు దక్షిణ భారతదేశానికి వెళితే, ఉదాహరణకు చెన్నైలో మీకు సౌత్ ఇండియన్ స్టైల్ ఆభరణాలు లభిస్తాయి. మీరు ఢిల్లీకి వెళితే, మీకు ఉత్తర భారత స్టైల్‌లో డిజైన్ చేయబడి నగలు దొరుకుతాయి. మీరు ముంబైకి వెళితే, మీకు మరో ప్రత్యేక డిజైన్ క్యాటగిరీ ఉంటుంది. అదే మీరు దుబాయికి వచ్చినట్లయితే, మీరు కేరళ నుంచి కాశ్మీర్ వరకు అన్ని రకాల భారతీయ ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. అది కూడా ఆఫర్‌లో బెస్ట్ ధరలతో. దుబాయ్‌లో ఆభరణాల ధరలు దాదాపు 12శాతం నుండి 15శాతం వరకు చౌకగా ఉంటాయి" అని అన్నారు.
దుబాయి నుంచి భారత ప్రవాసులు స్వదేశానికి బంగారం తీసుకొచ్చేందుకు ఉన్న షరతులివే..
అంత బాగానే ఉంది. దుబాయిలో చౌకగా, బెస్ట్ క్వాలిటీతో పసిడి ఆభరణాలు దొరకుతున్నాయ్ కదా అని ఎంత పడితే అంత తీసుకొచ్చేందుకు వీల్లేదు. వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటి పరిధి మేరకు మాత్రమే అక్కడి నుంచి మనం పసిడి తెచ్చుకోగలం. అది దాటి తీసుకురావడం ఎట్టిపరిస్థితుల్లో కుదరదు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత్‌కు తిరిగి వచ్చే ప్రయాణికులకు అక్కడి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు అండ్ కస్టమ్స్ (CBIC) విధించిన పరిమితి ప్రకారం.. ఎడాదికి పైగా యూఏఈలో నివాసం ఉన్న పురుషులు 20 గ్రాముల వరకు అంటే 2500 దిర్హమ్స్(రూ.50వేలు) విలువ చేసే బంగారం తీసుకువచ్చేందుకు పర్మిషన్ ఉంటుంది. దీనికి ఎలాంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే మహిళలైతే 40 గ్రాముల వరకు తెచ్చుకోవచ్చు. ఈ పరిమితులను దాటి ప్రవాసులు భారత్‌కు పసిడి తెచ్చుకోవాలంటే అదనంగా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కనుక దుబాయి నుంచి ఇండియాకు తిరిగి వచ్చే ప్రవాసులూ బంగారం విషయంలో ఉన్న ఈ రూల్స్‌ను అస్సలు మర్చిపోవద్దు. లేనిపక్షంలో చిక్కుల్లో పడడం ఖాయం.