NRI: వారణాసిపై నోరు పారేసుకున్న భారత సంతతి అమెరికా మోడల్.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-12-01T21:25:10+05:30 IST

గంగానదీ తీరాన ఉన్న ఆధ్మ్యాత్మిక నగరం వారణాసిపై తెలిసీ తెలియని తనంతో నోరు పారేసుకున్న ఓ భారత సంతతికి చెందిన అమెరికా యువతి చివరకు క్షమాపణలు చెప్పింది.

NRI: వారణాసిపై నోరు పారేసుకున్న భారత సంతతి అమెరికా మోడల్.. చివరకు ఏమైందంటే..

ఎన్నారై డెస్క్: గంగానదీ తీరాన ఉన్న ఆధ్మ్యాత్మిక నగరం వారణాసిపై(Varanasi) తెలిసీ తెలియని తనంతో నోరు పారేసుకున్న ఓ భారత సంతతికి చెందిన అమెరికా యువతి చివరకు క్షమాపణలు చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్ అయిన అపర్ణా సింగ్(Aparna Singh) ఇటీవల వారణాసిలో పర్యటించింది. అమెరికాలో ఆమె ఓ నగల దుకాణం కూడా నిర్వహిస్తుంటుంది. తన బ్రాండ్ కోసం నగలు తయారు చేసే స్వర్ణకారులను కలుసుకునేందుకు ఇటీవల ఆమె వారణాసికి వచ్చింది. ఈ సందర్భంగా నగరంలో పర్యటించిన ఆమె.. ఇందుకు సంబంధించి ఓ వీడియో రూపొందించి టిక్‌టాక్‌లో(Tiktok) పెట్టింది. ‘నేను పర్యటించిన అత్యంత భయానక నగరం’(Scariest City) అంటూ ఓ టైటిల్ కూడా జోడించింది.

‘‘గంగానదిలోకి మురుగు నీరు ఎలా వచ్చి చేరుతోందో చూడండి.. అందులోనే కొందరు స్నానాలు చేస్తున్నారు. వీధుల్లోనే మరి కొందరు నిద్రిస్తున్నారు. వారి పక్కనే కుక్కలు..ఓ వైపున మృతదేహాలను దహనం చేస్తున్నారు. నేనుంటున్న హోటల్ ఎలా ఉందో చూడండి.. బాగా పాతబడిపోయి..భయపెట్టేలా ఉందిది. ఈ ప్రవేశద్వారం..కోతులు లోపలికి రాకుండా హోటల్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప ఎలక్ట్రిక్ట్ కంచెలు.. అంతా భయపెట్టే వాతావరణం.. చీకట్లు ముసురుకున్న ఓ చిన్న మార్గం గుండా నా హోటల్‌కు చేరుకోవాలి.. కొత్త ప్రదేశాల్లో పర్యటించాలనుకునే వారు తొందరపడకండి.. ముందుగా మీరు వెళ్లే ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి..నేను కొంత పరిశోధన చేశాను. కానీ ఇక్కడి పరిస్థితి నేను ఊహించిన దానికంటే భయానకంగా ఉంది’’ అంటూ తనకు తోచింది చెప్పుకుపోయింది. దీనికి తోడు.. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం బాగా డల్‌గా ఉండే ట్యూన్ కూడా ఎంపిక చేసుకుంది.

అపర్ణా సింగ్..ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేయగానే విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు ఆమెపై భగ్గుమన్నారు. వారణాసి గొప్పదనం, పవిత్రత గురించి చెబుతూ తలంటేశారు. దీంతో.. దిగొచ్చిన ఆమె నెటిజన్లకు క్షమాపణలు చెబుతూ మరో వీడియో షేర్ చేసింది. వారణాసిలో తన అనుభవాన్ని మాత్రమే పంచుకున్నానని, ఎవరినీ, దేన్నీ కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పింది. ‘‘మంచి వీడియోలు ఎన్ని పోస్ట్ చేసినా పట్టించుకోరు కానీ.. ఇలాంటి ఒక అనుభవాన్ని పంచుకుంటే మాత్రం దుమ్మెత్తిపోస్తారు’’ అంటూ ఆమె నెటిజన్లపై ఒకింత అసహనం కూడా వ్యక్తం చేసింది.

Updated Date - 2022-12-01T21:34:06+05:30 IST