UK: ఇది చాలా దారుణం.. బ్రిటన్‌లో భారతసంతతి పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్య..
ABN , First Publish Date - 2022-12-01T23:10:07+05:30 IST
దేశంలోకి వలసదారుల రాకను ఆక్రమణతో పోలుస్తూ బ్రిటన్ మంత్రి సుయెల్లా బ్రెవర్మన్ చేసిన కామెంట్స్‌ను భారత సంతతికి చెందిన సీనియర్ పోలీస్ అధికారి నీల్ బసు ఖండించారు.
ఎన్నారై డెస్క్: వలసదారులపై భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రెవర్మన్(Suella Bravermen) చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. దేశంలోకి వలసదారుల రాకను ఆక్రమణతో పోలుస్తూ ఆమె చేసిన కామెంట్స్‌ను భారత సంతతికి చెందిన సీనియర్ పోలీస్ అధికారి నీల్ బసు(Neil Basu) ఖండించారు. ఆ వ్యాఖ్యలు దారుణమని ఆయన మండిపడ్డారు. మెట్రోపాలిటన్ పోలీస్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ అయిన బసు..బుధవారం ఓ స్థానిక చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రిటన్ పోలీసు వ్యవస్థ, హోం శాఖలో బయటపడుతున్న జాత్యాహంకార ధోరణలను(Racism) ప్రస్తావించారు.
‘‘హోం శాఖ కార్యాలయంలో వినిపిస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇది చాలా దారుణం. 1960ల్లో నా తండ్రి విన్న భాషను ఇప్పుడు శక్తిమంతులైన కొందరు నేతలు మాట్లాడటం దారుణం’’ అని పేర్కొన్నారు. ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యల కారణంగా తన చిన్నతనంలో ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చారు. నీల్ బసు తండ్రి బెంగాల్ నుంచి వలసవెళ్లారు. నీల్ తల్లి ఓ శ్వేతజాతి మహిళ. భిన్నజాతుల వారసత్వం కలిగిన తాను జత్యాహంకార ధోరణి కారణంగా స్కూల్ రోజుల్లోనే తోటి విద్యార్థుల చేతుల్లో వేధింపులు ఎదుర్కొన్నానని వివరించారు.
అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న నీల్ త్వరలో రిటైర్ కానున్నారు. ముప్ఫై ఏళ్లుగా ఆయన పోలీస్ శాఖలో పలు కీలక స్థానాల్లో సేవలందించారు. ఒకానొక సమయంలో బ్రిటన్ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌సీఏ పగ్గాలు బసుకు అప్పగిస్తారన్న వార్తలు వెలువడ్డాయి. అయితే..అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్‌తో అభిప్రాయాబేధాల కారణంగా బసుకు ఈ పదవి దక్కలేదని సమాచారం. అప్పటి హోం సెక్రెటరీ ప్రీతీ పటేల్ కూడా బసుపై వ్యతిరేకత ప్రదర్శించారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.