Driving licenses: ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్స్.. కువైత్ మరో సంచలన నిర్ణయం!
ABN , First Publish Date - 2022-10-11T15:36:05+05:30 IST
ఇప్పటికే కువైత్ (Kuwait) వర్క్ పర్మిట్లు, రెసిడెన్సీ వీసాల విషయంలో ప్రవాసులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.
కువైత్ సిటీ: ఇప్పటికే కువైత్ (Kuwait) వర్క్ పర్మిట్లు, రెసిడెన్సీ వీసాల విషయంలో ప్రవాసులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా కఠిన షరతులు విధిస్తోంది. ఇది చాలదంటూ ఇప్పుడు వలసదారులకు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్ (Driving licenses) విషయంలోనూ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్లు పొందిన ప్రవాసుల ధృవపత్రాలను మరోసారి తనిఖీ చేయాలని అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) నిర్ణయించింది. వారికి సంబంధించిన ఫైళ్లను పునఃపరిశీలించనుంది.
దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి, అంతర్గత మంత్రిత్వశాఖ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ జనరల్ డిపార్ట్‌మెంట్ (The General Department of Public Relations and Security) వెల్లడించింది. ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్, వాటి తాలూకు ధృవపత్రాలను మంత్రిత్వశాఖ అధికారులు తనిఖీ చేస్తారని పేర్కొంది. ఒకవేళ ఈ పరీక్షలో ఎవరైనా తప్పుడుమార్గంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు తేలితే వారికి సమన్లు పంపించనుంది. అనంతరం వారి డ్రైవింగ్ లైసెన్లను శాశ్వతంగా రద్దు చేయాలని మంత్రిత్వశాఖ నిర్ణయించింది.