Abu Dhabi: ఎడారి దేశంలో చిక్కుకున్న భారతీయులు.. సాయం కోసం వేడుకోలు.. అయితే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2022-10-26T18:09:06+05:30 IST
ఉపాధి కోసం దేశం కాని దేశానికి వెళ్లిన సుమారు 100 మంది భారతీయులు ఎడారి దేశంలో చిక్కుకున్నారు. తిరిగి స్వదేశానికి రాలేక.. అక్కడే ఉండలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తమకు సాయం చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని..
ఎన్నారై డెస్క్: ఉపాధి కోసం దేశం కాని దేశానికి వెళ్లిన సుమారు 100 మంది భారతీయులు ఎడారి దేశంలో చిక్కుకున్నారు. తిరిగి స్వదేశానికి రాలేక.. అక్కడే ఉండలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తమకు సాయం చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అనంతరం ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉద్యోగం, ఉపాధి కోసం ఏటా కొన్ని వేల మంది భారతీయులు ఎడారి దేశానికి వలస వెళ్తుంటారు. ఇలా అందరిలాగే పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుమారు 100 మంది పౌరులు కొద్ది రోజుల క్రితం యూఏఈ వెళ్లారు. అనంతరం అబుధాబిలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం పొందారు. ఈ క్రమంలో తమ జీవితాలు చక్కబడతాయని వారంతా ఆశించారు. అయితే.. ఇంతలో ఆ కంపెనీ యజమాని వాళ్లకు షాకిచ్చాడు. ఉద్యోగం నుంచి తీసేశాడు. కానీ వాళ్ల పాస్‌పోర్టులను మాత్రం తిరిగి ఇవ్వలేదు. దీంతో వాళ్లంతా యూఏఈలో ఉండలేక.. తిరిగి స్వదేశానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం సోషల్ యాక్టివిస్ట్ దిల్‌బాగ్ సింగ్ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. ఆ 100 మంది భారతీయుల ఇబ్బందులను వివరిస్తూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. సాయం చేయాల్సిందిగా లేఖలో కోరారు. దీంతో కేంద్ర మంత్రి స్పందించారు. యూఏఈలో కష్టాలు పడుతున్న భారతీయులకు సహాయం చేసి, వాళ్లను స్వదేశానికి తరలించడానికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకోవాల్సిందిగా దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ అధికారులను ఆదేశించారు.