కాకతీయ సాంస్కృతిక పరివారం ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం
ABN , First Publish Date - 2022-10-10T23:03:04+05:30 IST
కాకతీయ సాంస్కృతిక పరివారం సింగపూరు వారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం పెరుమాళ్ కోవెల ప్రాంగణంలో గల పిజిపి హాలులో ఘనంగా జరుపుకున్నారు.
కాకతీయ సాంస్కృతిక పరివారం సింగపూరు వారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం పెరుమాళ్ కోవెల ప్రాంగణంలో గల పిజిపి హాలులో ఘనంగా జరుపుకున్నారు. సింగపూరులో నివశిస్తున్నతెలుగు వారే కాకుండా కన్నడ వారు కూడా ఈ వ్రతంలో పాల్గొనడం విశేషం. ఎంతో భక్తి శ్రద్దలతో 100 జంటలు పీటలమీద కూర్చుని వ్రతాన్ని నిర్వహించుకున్నారు. దాదాపు 500 మంది వ్రతానికి హాజరై స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వ్రతం చేసుకున్న దంపతులు స్వామి వారి కండువాలు, స్వామి వారి రూపులు తీసుకున్నారు. సంస్థ అధ్యక్షులు రాంబాబు పాతూరి మాట్లాడుతూ కోవిడ్ అనంతరం తమ సంస్థ తరపున జరిపిన మొదటి ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఘనవిజయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు. అలాగే కార్యక్రమాన్ని అనుకున్న క్షణం నుండీ నిర్విరామంగా శ్రమించిన కమిటీ సభ్యులకు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను రేపటి తరాలకు గర్తుండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమని చెప్పారు. కార్యక్రమానంతరం స్వామి వారి ప్రసాద వితరణ జరిగింది. ఈ క్రింది లింకు ద్వారా వ్రతాన్ని చూడగలరు: https://www.youtube.com/watch?v=IreKLaCJ7FA