క్లర్క్ స్థాయి నుంచి సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్తగా.. UAE లో భారతీయుడి విజయగాథ
ABN , First Publish Date - 2022-01-12T16:41:52+05:30 IST
'కష్టే ఫలి' అనే నానుడి తెలుసు కదా. కష్ట పడితేనే ఫలితం దక్కుతుందని అర్థం.
దుబాయ్: 'కష్టే ఫలి' అనే నానుడి తెలుసు కదా. కష్ట పడితేనే ఫలితం దక్కుతుందని అర్థం. ఫలితాన్ని పొందటానికి ఓర్పు, నేర్పుతో శ్రమించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమయితే కఠోరశ్రమ చేయవలసి కూడా ఉంటుంది. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. ఇదిగో.. ఈ భారత ప్రవాసుడికి ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది. కేవలం తన కష్టాన్ని మాత్రమే నమ్ముకుని చిన్న క్లర్క్ స్థాయి నుంచి సొంతంగా వ్యాపారాలు మొదలెట్టి.. ఇవాళ యూఏఈలో విజయవంతమైన వ్యాపారవేత్తగా వెలుగొందుతున్నారు. పెద్దగా చదువుకుంది కూడా లేదు. కేవలం తన కష్టం, తెలివితేటలతో ఆ స్థాయికి చేరుకున్నారాయన. ఆయన పేరు మహేష్ అద్వానీ. రాజస్థాన్‌లోని జైసల్మీర్ ఆయన స్వస్థలం. చదువుకుంది హై స్కూల్ వరకు మాత్రమే. కానీ, ఆయన కష్టం, నేర్పరితనం ముందు విజయాలు దాసోహం అన్నాయి. ఒక్కొమెట్టు ఎక్కుతూ నేడు యూఏఈలో ఒకవైపు టెక్స్‌టైల్, మరోవైపు హోటల్ చైన్ వ్యాపారాల్లో విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ఉపాధి కోసం యూఏఈ వెళ్లిన మహేష్ అద్వానీ ఇంతటి శిఖరాలను ఎలా చేరుకున్నారు? దాని కోసం ఆయన ఎలా శ్రమించారు? ఆయన కుటుంబం సహాకారం తదితర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం...
అది 1982. అప్పుడు మహేష్‌కు 18 ఏళ్లు. స్వస్థలమైన జైసల్మీర్‌లో కేవలం హై స్కూల్ పాసైన ఆయన.. అదే ఏడాది ఉపాధి కోసం యూఏఈ వెళ్లారు. దుబాయ్‌లో తన సమీప బంధువు ఒకరు పనిచేస్తుండడంతో ఆయనతో తనకు కూడా అక్కడ ఎదైనా ఉద్యోగం చూడమన్నారు మహేష్. దాంతో ఆయన ఓ టెక్స్‌టైల్ కంపెనీలో క్లర్క్ జాబ్ చూసిపెట్టారు. అలా దుబాయ్‌లో మహేష్ ప్రయాణం మొదలైంది. సరిగ్గా మూడేళ్లు తిరిగేసరికి అదే కంపెనీలో మేనేజర్‌గా ప్రమోటయ్యారు. ఆ తర్వాత మరో మూడేళ్లకు సొంతంగా టెక్స్‌టైల్ సంస్థ మొదలెట్టారు మహేష్. అలా వచ్చిందే 'బ్లాస్సమ్ ట్రేడింగ్' కంపెనీ.
మహేష్ అద్వానీ ఫ్యామిలీ..
ప్రస్తుతం మహేష్ 56 ఏళ్లు. ఆయనకు భార్య రష్మీ(52), ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు మనీషా. తను హెల్త్ కోచ్, న్యూట్రిషనిస్ట్. ఆమె సొంతంగా కేఫ్ నడిపిస్తోంది. రెండో కుమార్తె పల్లవి. ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లో పని చేస్తుంది. అలాగే సినిమా నిర్మాణంలో ఉంది. ఇక కుమారుడు సంజీత్. ఈయన 'బ్లాస్సమ్ ట్రేడింగ్', 'మైగోవిందా'స్' రెండింటీకి డైరెక్టర్‌గా ఉన్నారు.
స్వచ్ఛంద కార్యక్రమాలు..
స్వతహాగా అద్వానీ మంచి సామాజికవేత్త, ప్రేరణాత్మక వక్త కూడా. అతను ఇస్కాన్ ఉద్యమం (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్‌నెస్)లో క్రియాశీల సభ్యుడు. అలాగే యోగా, భారతీయ ఆధ్యాత్మిక అభ్యాసాలపై లోతైన ఆసక్తిని కలిగి ఉన్నారు. దుబాయ్ టెక్స్‌టైల్ మర్చంట్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్నా.. అద్వానీ అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు.
* కచ్‌లోని గాంధీధామ్‌లో మురికివాడల పునరావాస కార్యక్రమంలో భాగంగా పేద కుటుంబాల కోసం 300 ఇళ్లను నిర్మించడంలో తనవంతు సాయం చేశారు.
* కచ్‌లోని గాంధీధామ్‌లో భూకంపం కారణంగా నష్టపోయిన కుటుంబాల కోసం మరో 80 ఇళ్లను నిర్మించారు.
* మహారాష్ట్ర, గుజరాత్‌లోని నిరుపేద కుటుంబాలకు చెందిన 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యా స్కాలర్‌షిప్‌లు అందించారు.
'బ్లాస్సమ్ ట్రేడింగ్'..
అరబ్ మెన్స్‌వీయర్‌కు అవసరమయ్యే కందూర ఫ్యాబ్రిక్‌ను దిగుమతి చేసుకోవడంతో పాటు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఈ సంస్థ దుబాయ్‌లోనే టాప్. జపాన్ నుంచి భారీ మొత్తంలో దిశదశ/కందూర మెటిరీయల్‌ను దిగుమతి చేసుకుని యూఏఈ, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇరాక్, యెమెన్ మార్కెట్లకు పంపిణీ చేస్తుంది 'బ్లాస్సమ్ ట్రేడింగ్'. శౌఖ్, బుర్ దుబాయ్‌లో రెండు ప్రధాన శాఖలు ఉన్నాయి. ఈ రెండింటీలో కలిపి సుమారు 45 మంది ఉద్యోగులు ఉన్నారు. గత 30 ఏళ్లుగా ఈ కంపెనీ అరబ్ దేశాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తోంది. కస్టమర్ల అభిరుచి మేరకు వారికి కావాల్సింది ఇస్తే.. మరోమాట లేకుండా మళ్లీ వారు మన వద్దకే వస్తారంటారు మహేష్. ఈ టెక్స్‌టైల్ వ్యాపారంలో తన విజయం వెనుక దాగి ఉన్న సీక్రెట్ కూడా ఇదే అంటారాయన.
రెస్టారెంట్ బిజినెస్..
'బ్లాస్సమ్ ట్రేడింగ్' పేరిట టెక్స్‌టైల్‌తో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను సొంతం చేసుకున్న మహేష్ అద్వానీ.. ఆ తర్వాత రెస్టారెంట్ బిజినెస్‌లో అడుగు పెట్టారు. దుబాయ్‌లో మైగోవిందా'స్ పేరుతో భారతీయ వంటకాలతో శాఖహార భోజన రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాలు అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. అసాధారణమైన ఆహార నాణ్యత, అత్యుత్తమ కస్టమర్ సర్వీస్ ఈ రెండు విషయాలే తన రెస్టారెంట్ పాపులర్ కావడానికి దోహాదపడ్డాయని ఆయన చెప్పారు. దాంతో యూఏఈలో అనతికాలంలోనే మైగోవిందా'స్ ఫుడ్ చైన్ చాలా తెలికగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇండియా, యూఎస్‌తో పాటు ఇతర దేశాల్లోని ఈ రెస్టారెంట్‌కు బ్రాంచీలు ఉన్నాయి. ఇక దుబాయ్‌లో ఉన్న రెస్టారెంట్‌లో ప్రస్తుతం 150 మంది వరకు ఉపాధి పొందుతున్నారు.