OHRK: కెరీర్‌పై ఎలాంటి భ్రమల్లేవు!
ABN , First Publish Date - 2022-11-21T02:48:33+05:30 IST
ఒకరు ‘పెళ్లిచూపులు’.. మరొకరు ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో పాపులర్ అయ్యారు. తెలంగాణ యాస డైలాగ్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఆ ‘జాతి రత్నాలు’.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. ఈ పోరగాళ్లు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎమ్.డి. వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ లో వ్యక్తిగత, కెరీర్ విశేషాలను పంచుకున్నారిలా..
ఒకరు ‘పెళ్లిచూపులు’.. మరొకరు ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో పాపులర్ అయ్యారు. తెలంగాణ యాస డైలాగ్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఆ ‘జాతి రత్నాలు’.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. ఈ పోరగాళ్లు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎమ్.డి. వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ లో వ్యక్తిగత, కెరీర్ విశేషాలను పంచుకున్నారిలా..
రాహుల్ రామకృష్ణ: కమెడియన్ పదంతో ఇబ్బంది లేదు. ఆ పదానికి సంబంధించిన హేళన ఇబ్బందిగా ఉంటుంది. కామెడీ చేయటం టఫెస్ట్ జాబ్. ప్రేక్షకులు అప్‌డేట్ అయ్యారు.
ప్రియదర్శి: ఏది చెబితే నవ్వుతారో అని తెలుసుకోవడం చాలా ప్రెజర్. ఆడియన్స్ దగ్గర పవర్ ఉంది. సినిమా హాల్‌లో సీన్ నచ్చకపోతే ఫోన్లు చూస్తారు.
ఆర్కే- రాహుల్, రామకృష్ణ ఈ రెండు పేర్లేంటీ?
రాహుల్ రామకృష్ణ: పేరెంట్స్‌ది అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్లిద్దరూ ఏ విషయాన్ని ఓ పట్టాన ఒప్పుకునేవారు కాదు. మా నాన్నగారికి ‘రాహుల్’, అమ్మగారికి ‘రామకృష్ణ’ పేరు పెట్టాలని ఇష్టం.. ఉండేదట!
ఆర్కే- అంటే.. అరేంజ్ మ్యారేజ్‌కు అగైనెస్టా?
రాహుల్ రామకృష్ణ: అదేం కాదు. ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే.. అండర్ స్టాండింగ్ ఉండాలి కదా! నేను ప్రేమించి పెళ్లాడాను.
ఆర్కే- ఎవరు ప్రేమించారు?
రాహుల్ రామకృష్ణ: నేనే ప్రేమించా. తను మా పక్క వీధి అమ్మాయి. పార్కులో నడుస్తూంటే..
ఆర్కే- అంతలో మనసు పారేసుకున్నావా?
రాహుల్ రామకృష్ణ: (నవ్వులు).. ఈ కాలంలో మనసు పారేసుకోవటాలు.. వెతుక్కోవటాలు లేవు సర్. ఆసక్తులు కలిశాయి. పేరు నాగ హరిత. వైజాగ్ వాళ్లది.
ఆర్కే- మీ ఇద్దరినీ చూస్తే అప్పుడే ఉద్యమంలోంచి బయటికొచ్చినట్లు.. ఆ గెటప్, ఆ గడ్డం.. ఆ రెవెల్యూషన్ పాత్రలు చూస్తే అలా అనిపిస్తుంది. ఇక ప్రియదర్శి ‘మల్లేశం’ సినిమాతో ఏడ్పించావు.
ప్రియదర్శి: యాదృచ్ఛికంగా జరిగిపోయిందలా..
ఆర్కే- మీ జర్నీ ఎప్పుడు ప్రారంభమైంది?
ప్రియదర్శి: పదకొండు సంవత్సరాల కితం ఒక వర్షం కురవని రాత్రి. కారు మేఘాలు జోరుగా తిరుగుతున్నాయి.
రాహుల్ రామకృష్ణ: హేయ్.. డైరక్టుగా పాయింట్‌కురా..
ఆర్కే- ఉండనీ. అప్పటికి జీవితంలో క్లారిటీ లేక.. కారుమేఘాలు కమ్ముకున్నట్లున్నాయి. అంతా చీకట్లే. ఎక్కడా వెలుతురు కనపడలేదు. అంతేనా?
ప్రియదర్శి: మనోడు ఆసమయంలో వచ్చి అగ్గిపెట్టె ఉందా? అన్నాడు. నేను లైటర్ ఉంది అన్నా(నవ్వులు). నిజానికి హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీలో కలిశాడు. పుస్తకాల పురుగే కాదు కాక్‌రోచ్. లైబ్రరీకి వచ్చేవాడు. నేనప్పుడు ఎమ్.ఏ. చదువుతున్నా. ఫ్రెషర్స్‌కేనా రా?
రాహుల్ రామకృష్ణ: క్యాంపస్ ఫెస్టివల్‌లో..
ప్రియదర్శి: అవును. మాది మామూలు పరిచయం. మాస్ కమ్యూనికేషన్ చదువు అయిపోయి బయటికి వచ్చాక షార్ట్‌ఫిల్మ్స్ చేసేవాడ్ని సర్. మనోడు పాత్రికేయుడిగా, ఎన్జీవోలో పని చేసేవాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ దగ్గర ఎక్కువ కలిసినట్లు ఉన్నాం.
రాహుల్ రామకృష్ణ: మాది పెద్దగ్యాంగ్. తరుణ్ భాస్కర్, విజయ్‌దేవరకొండ.. మేమంతా ఆల్మోస్ట్ ఒకేసారి ఆరంగేట్రం చేశాం. నాకంటే ప్రియదర్శి సీనియర్.
ఆర్కే- మీకు పెళ్లిచూపులు ఎవరు అరేంజ్ చేశారు..
ప్రియదర్శి: (నవ్వులు) సినిమా పెళ్లిచూపులు అయితే.. ప్రణీత్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. అతను తరుణ్ భాస్కర్ దగ్గర పని చేసేవాడు. అతను పిలిస్తే ‘పెళ్లిచూపులు’ ఆడిషన్స్‌కు వెళ్లా. కౌశిక్ క్యారెక్టర్ చేయమన్నాడు. నాకు తరుణ్ ఫ్రెండే. అయితే ప్రణీత్ ఆ సమయంలో నన్ను పిలిచాడు అక్కడకి. రైట్ టైమ్‌లో రైట్ ప్లేస్‌కు వెళ్లా.
ఆర్కే- డెస్టినీ డ్రైవ్స్ యూ..
ప్రియదర్శి: అన్నేళ్ల హార్డ్‌వర్క్ లక్‌గా మారింది.
ఆర్కే- అరేంజ్డ్ మ్యారేజ్ నచ్చదా..నీక్కూడా?
ప్రియదర్శి: విరక్తి అని చెప్పను కానీ ఆ ఇన్‌స్టిట్యూషన్ నాకు అర్థం కాదు సర్.
ఆర్కే- రాహుల్, నీ భావాలు ఒకే రకంగా... కుడి, ఎడంగా! ఎక్సెప్ట్ ఆ గడ్డం, జుట్టు తప్ప..
ప్రియదర్శి: ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి లెగసీగా మారింది.
రాహుల్ రామకృష్ణ: ‘భరత్ అనే నేను’ కోసం దర్శకుడు కొరటాలగారు గడ్డం పెంచమన్నారు. అప్పుడే రాజమౌళిగారు పిలిచి.. ‘గడ్డం ఇలా కాదు. ఇంకొంచెం పెంచు’ అన్నారు. అలా పెంచుకుంటు పోయాను. కరోనా టైమ్‌లో కంటిన్యూ అయింది. ఒకటిన్నర సంవత్సరం తర్వాత షూటింగ్‌కు వెళ్లినపుడు ‘ఇదే గడ్డం ఉంచేయ్’ అన్నారు. అలా ఇక్కడిదాకా గడ్డం వచ్చింది.
ఆర్కే- గడ్డం అంటే చిరాకేసిందా?
రాహుల్ రామకృష్ణ: మామూలు చిరాకు కాదు. ఈ గడ్డం మీద ఖర్చు చేశా. కేర్ తీసుకోవాలి. ఆ ట్రీట్‌మెంట్లు, మెయిన్‌టైన్స్ బోలెడు డబ్బు.
ఆర్కే- ఇవన్నీ ఉంటాయా? నాకు తెలీదు(నవ్వులు). అంటే గడ్డం పెంచటానికి ఎరువేసినట్లు వేయాలా?
రాహుల్ రామకృష్ణ: ‘సినిమా గడ్డం’ కదా సర్. స్ర్కీన్‌లో బాగా రిచ్ కనిపించాలంటే.. ఇన్‌వె్‌స్టమెంట్ తప్పదు.
ఆర్కే- నీది కూడా లవ్ మ్యారేజా ప్రియదర్శి?
ప్రియదర్శి: క్లియర్‌లీ.. మోర్ లవ్ మ్యారేజ్. కాలేజీలో ‘రిచా’ నా సీనియర్. యూనివర్శిటీ నుంచి బయటికొచ్చాక ఓ ప్రొఫెషనల్ వర్క్ మీద కలిశాం. ఫ్రెండ్‌గా మారాక.. కలిసి జీవిద్దాం అనుకున్నాం.
ఆర్కే- ఆమె నార్త్ ఇండియానా?
ప్రియదర్శి: వాళ్ల రూట్స్ ఆగ్రా. అరుణాచల్‌ప్రదేశ్, బెంగళూరులో పెరిగింది. ఆ టైమ్‌లో నేను ఎర్రిబాగులోడిలా కెమెరాలేసుకుని.. సినిమానే ప్రపంచంగా తిరిగేవాణ్ని. ఆర్థిక పరిస్థితి బాగలేక.. పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు మా నాన్న పంపించలేదు. అందుకే సెంట్రల్ యూనివర్శిటీలో చేరా. అక్కడే నా జీవితం మారింది.
ఆర్కే- పనీపాట లేక కెమెరాలేసుకుని తిరుగుతుంటే.. ఆ అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంటానంది.
ప్రియదర్శి: ఆమె గొప్పదనం అదే. నాలో ఏదో విషయం ఉందని అర్థం చేసుకుంది.
ఆర్కే- మీ ఇద్దరి నేటివ్ ఎక్కడ..
ప్రియదర్శి: నాన్నది ఖమ్మం. అమ్మవాళ్ల ఊరు గుంటూరు దగ్గర ఉండే పిడుగురాళ్ల. పిడుగురాళ్లలో పుట్టా. నెలల బిడ్డగా ఉన్నపుడు హైదరాబాద్‌కి తీసుకొచ్చారు నాన్న. అప్పుడు నాన్న పీహెచ్‌డీ చేసేవారంట. పెరిగిందంతా హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలో. చందానగర్‌లో ఎక్కువ రోజులు ఉన్నా కాబట్టి చందానగర్ మా ఊరు అని చెబుతుంటా.
రాహుల్ రామకృష్ణ: మాది హిమాయత్ నగర్. నాన్న వాళ్లది హైదరాబాద్. అమ్మ వాళ్లది విజయనగరం ప్రాంతం. మా తాతగారు ఒరిస్సాలోని కటక్‌లో ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అలా అమ్మ పుట్టి పెరిగిందంతా ఒరిస్సాలో. ప్రాపర్ హైదరాబాద్ బాయ్.
ఆర్కే- మీ ఇంట్లో సినిమా పిచ్చి ఉందా
రాహుల్ రామకృష్ణ: పుస్తకాలు, మ్యూజిక్ అంతే. మా నాన్నగారు బిజినెస్.. వదిలేసి యోగావైపు వెళ్లారు. మా అమ్మ చాలా ఉద్యోగాలు చేసి మ్యాగజైన్స్, బిజినెస్ పబ్లికేషన్స్‌కు ఎడిటర్‌గా సెటిలైంది. సినిమాలంటే ఇష్టం లేదు. అయితే మా ఇంట్లో కల్చరల్ ఆర్ట్స్‌కి ప్రోత్సాహం ఉండేది. థియేటర్ అంటే ఇష్టం. స్ర్టీట్ థియేటర్లు, చిన్నచిన్న నాటకాలు వేసేవాణ్ని. ఆ సమయంలో తరుణ్ భాస్కర్ పరిచయమయ్యారు. అతని మొదటి షార్ట్‌ఫిల్మ్‌లో నటించా. ఆ తర్వాత అవకాశాలొచ్చాయి. డబ్బులొస్తుంటే ఉండిపోయా. యాక్టర్ కావాలని ఎప్పుడూ కోరుకోలేదు.
ఆర్కే- మీ ఇద్దరూ చదువుకున్నారు. భావాలు విభిన్నం. నటన రాని వాడు కూడా సలహా ఇచ్చి ఉంటాడు కదా?
ప్రియదర్శి: (నవ్వులు) సలహాలకు మా ఇండస్ర్టీ పెట్టింది పేరు. తెలిసి ఇస్తారో, తెలీయక ఇస్తారో తెలియదు. ఇండస్ర్టీకొచ్చిన కొత్తలో ‘ఎప్పుడూ బిజీగా ఉండాలమ్మా. రోజుకు రెండు కాల్షీట్లు పని చేయాలి. అప్పుడే వృద్ధిలోకొస్తార’ని చెప్పేవారు. సలహాలు ఉచితం. పనికొచ్చే సలహా తీసుకుని ముందుకెళ్లాలి.
ఆర్కే- ‘అర్జున్‌రెడ్డి’ లో పాత్ర గురించి...
రాహుల్ రామకృష్ణ: ఆ పాత్ర వీడు చేయాలి.
ఆర్కే- మీ ఫ్రెండుకు ఎందుకు ద్రోహం చేశారు.
ప్రియదర్శి: చెప్పురా ఇప్పుడుచెప్పు (నవ్వులు)
రాహుల్ రామకృష్ణ: ద్రోహం చేయలేదు మహాప్రభూ!
ప్రియదర్శి: అది ద్రోహం కాదు సర్. పెళ్లిచూపులు షూటింగ్ టైంలో ఫస్టాఫ్ అయిపోయింది. ఆ సమయంలో సందీప్ రెడ్డి ఈ పిల్లోడు బాగా చేస్తున్నాడే ‘శివ క్యారెక్టరుకు బావుంటాడేమో’ అనుకున్నాడు. కట్ చేస్తే...
రాహుల్ రామకృష్ణ: కట్ చేస్తే.. కాంపౌండ్‌లో విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి కనిపించారు. నాకు విజయ్ అప్పటికే పరిచయం. మేము క్రికెట్ ఆడుకునేవాళ్లం. ఆ పదినిమిషాలు వారిద్దరితో మాట్లాడాను. ఉదయాన్నే ఫోన్ చేసి ‘అర్జున్‌రెడ్డి’ లో శివ పాత్ర ఉంది చేస్తావా? అని అడిగాడు. మనమప్పుడు ఎలా గాలి తిరుగుడు. ఖాళీ కాబట్టి చేశా. అలా షూటింగ్ అయిపోయి డబ్బింగ్ చెప్పేప్పుడు.. ఆ శివ పాత్ర ఈయనదే అని తెల్సింది. ఆ సినిమా రిలీజ్ కావటం.. సూపర్ హిట్ కావటంతో బిజీ అయ్యా.
ఆర్కే- మీ భావజాలం పరంగా భాష ఇబ్బంది?
రాహుల్ రామకృష్ణ: భాషదేముంది సర్. వాడుక భాషలో ఏదైతే తప్పు మాటలు అనుకుంటామో.. వందేళ్ల తర్వాత అది నార్మల్ అయిపోతుంది. అది అచ్చు కూడా పడచ్చు. ఆర్కే- ‘నీయమ్మ’ పదాన్ని పిల్లలు క్యాజువల్‌గా వాడేస్తున్నారు కదా?
రాహుల్ రామకృష్ణ: మాస్ మీడియం ప్రభావం సమాజం మీద ఉంటుంది. అయితే ఇదంతా.. కాంటెక్ట్స్ డ్రివెన్ సర్. ‘అర్జున్‌రెడ్డి’ అనే ఆయన మాట్లాడే భాష, ఆయన తీరు అలా ఎందుకు ఉన్నాయంటే.. దానికో సందర్భం ఉంది. అతను యాంగర్ ఇష్యూ్‌సతో ఉన్నాడు. యంగ్ ఏజ్‌లో ఉన్నపుడు ఆ లాంగ్వేజ్‌ను సులువుగా వాడతారు.
ఆర్కే- మీరొచ్చి ఐదేళ్లయిందా ఇండస్ట్రీకి
ప్రియదర్శి: ఆరేడేళ్లయింది. సీనియర్ ఆర్టిస్టులకంటే అదృష్టమనిపిస్తుంది. డిజటలైజేషన్ వల్ల మాకు కలిసొచ్చింది.
ఆర్కే- అదృష్టంతో పాత్రలొచ్చాయి. మీరు మెప్పించారు. ఎప్పటికీ ఇలా ఉంటుందని గ్యారెంటీ లేదు?
రాహుల్ రామకృష్ణ: నేనే గొప్ప. యాభై ఏళ్లుంటా అనే భ్రమల్లేవు. హైదరాబాద్‌లో లైబ్రరీ పెట్టాలనే ఆలోచన ఉంది..
ఆర్కే- ఈ ఐదేళ్లలో ఏమి నేర్చుకున్నారు.
రాహుల్ రామకృష్ణ: డిసిప్లయిన్, వర్క్ వాల్యూ తెలిసింది. డైలీ షెడ్యూల్ కాదు.. కమిట్‌మెంట్‌తో పని చేయటం నేర్చుకున్నా. నా సమయాన్నే కాదు.. ఇతరుల సమయాన్ని రెస్పెక్ట్ చేయటం తెలిసింది.
ఆర్కే- గౌరవం డిసిప్లయిన్ బట్టే ఉంటుంది..
ప్రియదర్శి: ఏమి అవ్వాలో తెలీదు కానీ.. ఎలా ఉండొద్దో తెలుసుకున్నా.
ఆర్కే- జర్నలిస్ట్ గా పనిచేశావు రాహుల్?
రాహుల్ రామకృష్ణ: పోస్ట్‌నూన్, మెట్రో ఇండియా పత్రికలకు పని చేశా. ఆ తర్వాత ఫ్రీలాన్స్ జర్నలి
జర్నలిస్ట్ గా పని చేశా. తెలంగాణ మూమెంట్‌లో రిపోర్టర్‌గా చేయటం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నా. బైలైన్ పడటం ఆనందమైన విషయం. ఫైనాన్షియల్‌గా వయబుల్ లేదు కానీ ఆసక్తికరం.
ఆర్కే- ఇండస్ర్టీ ప్రమాదకరం. పైకి తీసుకెళ్లి కిందికి దించుతుంది. ‘లైగర్’ విషయంలో విజయ్ దేవరకొండ తప్పేముంది.
ప్రియదర్శి: హిట్ అండ్ ఫ్లాప్ మామూలే కదా. అతను డిఫరెంట్. బ్లిప్ ఇన్ కెరియర్.
ఆర్కే- నీకు మంచి ఫ్రెండ్ కదా?
రాహుల్ రామకృష్ణ- హి ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. పర్సనల్‌గా ఎఫెక్ట్ అవ్వడు. స్ర్టాంగ్. అమితాబ్ గారే రీ-ఇన్‌వెంట్ చేసుకున్నారు. ఎలా పడినా, ఎక్కడపడినా విజయ్ బౌన్స్ బ్యాక్ అవుతాడు. తగ్గడు.
ఆర్కే- అక్కడి తక్కడిగాళ్లే మీ సర్కిల్ అంతా.
ప్రియదర్శి: ఇక్కడ ఇంకో దారిలేదు.
ఆర్కే- ఇంత చిన్న జర్నీలో ఎంతో నేర్చుకున్నారు..
ప్రియదర్శి: పాత తప్పులు చేయద్దు అంతే. ఎవరైనా సరే పడి లేస్తారు. ఎవరికైనా రియాలిటీ చెక్ ఉండాలి.