Aswini Dutt: ప్రకటన ఉపసంహరించుకోవాలి!
ABN , First Publish Date - 2022-11-22T14:42:14+05:30 IST
సంక్రాంతికి, దసరా పండుగలకు స్ట్రెయిట్ చిత్రాలకే థియేటర్లు ఇవ్వాలని, ఆ తర్వాతి ప్రాధాన్యం అనువాద చిత్రాలకు అంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (Producers council)చేసిన ప్రకటనను సీనియర్ నిర్మాత సి.అశ్వినీదత్ (Aswinidutt comments on TFPC)ఖండించారు
సంక్రాంతికి, దసరా పండుగలకు స్ట్రెయిట్ చిత్రాలకే థియేటర్లు ఇవ్వాలని, ఆ తర్వాతి ప్రాధాన్యం అనువాద చిత్రాలకు అంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (Producers council)చేసిన ప్రకటనను సీనియర్ నిర్మాత సి.అశ్వినీదత్ (Aswinidutt comments on TFPC)ఖండించారు. ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇలాంటి ప్రకటనలు పరిశ్రమని తప్పుదోవ పట్టించడంతోపాటు... పొరుగు పరిశ్రమలతో ఉన్న అనుబంధాన్ని,మన మార్కెట్‌ని దెబ్బతినేలా చేస్తాయని అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘మన సినిమాలు మన దగ్గర ఎలా ఆడుతున్నా... డబ్బింగ్ రైట్స్ ఓటీటీ మార్కెట్ వల్ల కొంత వరకూ గట్టెక్కుతున్నాయి. తమిళంలో మన సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. చక్కని వసూళ్లు రాబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనువాద చిత్రాలకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని ఎలా చెబుతారు? అలాంటి పరిస్థితి ఎదురైన మనల్ని మనమే దెబ్బ తీసుకున్నట్లు అవుతుంది. ఓ తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడితో సినిమా చేశారు. ఆ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తే తప్పేంటి? మరో నిర్మాత సంస్థ తీసిన రెండు చిత్రాలను ఒకేసారి విడుదల చేసుకోవచ్చా? నిర్మాతల మండలి ప్రకటనను నేను ఖండిస్తున్నా’’ అని అన్నారు.