Charkhi Dadri: భారత్‌లో అత్యంత భయానక విమానప్రమాదం, నేటికి సరిగ్గా 26 ఏళ్ల క్రితం..

ABN , First Publish Date - 2022-11-12T17:49:03+05:30 IST

చర్ఖీ దాద్రీ విమాన ప్రమాదం .. విమానయాన చరిత్రలో అత్యంత దారుణమైన దుర్ఘటనగా నిలిచిపోయింది. నేటికి(నవంబర్ 12) సరిగ్గా 26 ఏళ్ల క్రితం ఈ ఘోరం జరిగింది.

Charkhi Dadri: భారత్‌లో అత్యంత భయానక విమానప్రమాదం, నేటికి సరిగ్గా 26 ఏళ్ల క్రితం..

ఇంటర్నెట్ డెస్క్: చర్ఖీ దాద్రీ విమాన ప్రమాదం(Charkhi Dadri mid air collision).. విమానయాన చరిత్రలో అత్యంత దారుణమైన దుర్ఘటనగా(worlds deadliest mid air collision) నిలిచిపోయింది. నేటికి(నవంబర్ 12) సరిగ్గా 26 ఏళ్ల క్రితం ఈ ఘోరం జరిగింది. గగనతలంలో రెండు విమానాలు ఢీకొనడంతో మొత్తం 349 మంది కన్నుమూశారు. ఆ విమానాల్లోని వారందరూ ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని ఢిల్లీకి పశ్చిమాన 100 కీలోమీటర్ల దూరంలోని చర్ఖీ దాద్రీ అనే ప్రాంతం గగనతలంలో సుమారు 14 వేల అడుగుల ఎత్తున ఈ విమానాలు ఢీకొన్నాయి. మృతదేహాలు, విమానం విడిభాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తీవ్రతకు భూకంపం వచ్చిందేమో అని గ్రామస్తులు భయపడిపోయారు. నాటి ఘటన గురించి నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.

ప్రమాదం జరిగింది ఇలా..

1996 నవంబర్ 12న ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు(Saudi Arabian Airlines) చెందిన ఫ్లైట్ 763.. సిబ్బంది సహా మొత్తం 312 మందితో సాయంత్రం 6.32 గంటలకు టేకాఫ్ అయింది. మరోవైపు.. కజకస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌కు(Khazakhstan Airlines) చెందిన ఫ్లైట్ 1907.. 37 మందితో ఢిల్లీ విమానాశ్రయం వైపుగా వస్తోంది. రెండు విమానాలకు వీకే దత్తా అనే ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ మార్గనిర్దేశం చేస్తున్నారు. రెండు విమానాలు ఒకే గగనతల మార్గంలో(ఎయిర్‌వే) వేరు వేరు ఎత్తుల్లో ప్రయాణించాలి. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు ఎలా చేరుకోవాలో ఆయన కజకస్థాన్ విమానానికి కొన్ని సూచనలు చేశారు. విమానాన్ని 15 వేల అడుగుల ఎత్తుకు దించాలని కజకస్థాన్‌ విమాన పైలట్లకు సూచించారు. అదే సమయంలో.. సౌదీ అరేబియా విమానాన్ని 14 వేల అడుగుల ఎత్తుకు చేర్చాలని చెప్పారు.

కానీ.. కజకస్థాన్ ఎయిర్‌లైన్స్ విమానం తనకు నిర్దేశించిన ఎత్తుకంటే మరింత కిందకు దిగింది. ఏకంగా 14 వేల కిలోమీటర్ల దిగువకు చేరుకుంది. ఎదురుగా సౌదీ అరేబియా విమానం వస్తోందన్న విషయాన్ని అప్పటికే ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ సూచించారు. కానీ.. కజక్ ఎయిర్‌లైన్స్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇంతలోనే ఊహించని ప్రమాదం జరిగిపోయింది. కజకస్థాన్ విమానం వెనక భాగాన ఉన్న రెక్కలు సౌదీ విమానం ప్రధాన ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. రెండు విమానాలు అదుపుతప్పి.. కుప్పకూలిపోయాయి. సౌదీ విమానం శకలాలు ధనీ గ్రామం(హరియాణా)లో చెల్లాచెదురుగా పడగా.. కజకస్థాన్ విమానం బిరోహార గ్రామంలోని పొలాల్లో కూలిపోయింది.

ఘటనపై దర్యాప్తు..

ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలుసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి రమశ్ చంద్ర లాహోటీ నేతృత్వంలో దర్యాప్తు కమిషన్ ఏర్పాటైంది. రెండు విమానయాన సంస్థలతోనూ కమిషన్ చర్చింది. ఫ్లైట్ రికార్డర్లలోని వాయిస్ డాటాను విశ్లేషించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమాఖ్య అభిప్రాయాలను సేకరించింది. అనంతరం ఓ సవివరమైన నివేదిక సమర్పించింది. దీని ప్రకారం.. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ సూచనలను కజకస్థాన్ ఎయిర్‌లైన్స్ విమానం పైలట్లు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. కజక్ పైలట్‌కు ఇంగ్లిష్ రాకపోవడంతో..సూచనలను సరిగా అర్థం చేసుకోలే.. విమానం నిర్దేశిత ఎత్తుకంటే మరింత కిందకు దించారని నివేదిక తేల్చింది.

విమానంలోని రేడియో ఆపరేటర్ సాయంతో పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ సూచనలు తీసుకోవడం కూడా ప్రమాదానికి ఒక కారణమని పేర్కొంది. విమానం ఎంత ఎత్తులో ఉందో తెలుసుకునేందుకు రేడియో ఆపరేటర్ మాటమాటికీ తన సీట్లోంచి లేచి పరికరాల్లో చూసి తెలుసుకునే వాడని చెప్పింది. ఇక ఘటన జరిగిన సమయంలో గగనతలంలో బలమైన గాలులు వీచడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడింది. ఆ టైంలో ఆకాశం మేఘావృతమై కూడా ఉందని కజకస్థాన్ ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి.

ఇక.. కజకస్థాన్ పైలట్లు కిలోమీటర్లు, మీటర్లలో దూరాన్ని కొలిచే వారని ఇండియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సంఘం తెలిపింది. కానీ.. అంతర్జాతీయంగా ‘నాటికల్ మైల్స్’, ‘మైల్స్‌’ పదాలను వినియోగించడంతో కజక్ పైలట్లు కొన్ని సార్లు ఇబ్బంది పడేవారని పేర్కొంది. ఇక ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు.. కజక్ విమానం నిర్దేశిత 15 వేల అడుగుల ఎత్తులో లేదని రేడియో ఆపరేటర్ గుర్తించి పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో... ప్రధాన పైలట్(కెప్టెన్)విమానాన్ని మరింత ఎత్తుకు చేర్చాలని సాటి పైలట్‌కు ఆదేశించారు. ఈ క్రమంలో.. కజక్ విమానం.. ఎదురుగా వస్తున్న సౌదీ విమానం రెక్కల్నీ ఢీకొట్టింది.

ఇక ఢిల్లీ చుట్టుపక్కల గగనతలంలో అధికశాతం వాయుదళం ఆధీనంలో ఉండటంతో.. విమానం రాకపోకలకు ఓకే కారిడార్ మిగిలింది. దీంతో.. ఢీల్లీ ఎయిర్‌పోర్టుకు రెండు ప్రత్యేక కారిడార్లు(విమాన రాకపోకలకు గగనతల మార్గాలు) ఏర్పాటు చేయాలని సూచించింది. అంతేకాకుండా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోసం అప్పటికే ఉన్న ప్రధాన రాడార్‌తో పాటూ సెకెండరీ రాడార్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది.

Updated Date - 2022-11-12T18:08:07+05:30 IST