Sharan Hegde: లైఫ్‌లో ఎలా గెలవాలో చెప్పిన యువకుడు.. ఐఐఎంలో సీటు దొరక్కపోతే..

ABN , First Publish Date - 2022-11-22T21:05:25+05:30 IST

మూడేళ్ల క్రితం ఐఐఎంలో సీటు దక్కించుకోలేని యువకుడు అదే సంస్థలో అథిగా ప్రసంగించేందుకు వచ్చాడు. తప్పక చదవాల్సిన కథనం.

Sharan Hegde: లైఫ్‌లో ఎలా గెలవాలో చెప్పిన యువకుడు.. ఐఐఎంలో సీటు దొరక్కపోతే..

ఇంటర్నెట్ డెస్క్: క్యాట్(CAT) పరీక్షలో ఏకంగా 98 శాతం పర్సెంటైల్ వచ్చింది.. ఐఐఎంలో సీటు పక్కా అనుకున్నాడు. కానీ..లైఫ్ మరో టర్న్ తీసుకుంది. తాను ఆశించినట్టు సీటు అతడికి దక్కలేదు. ప్రతిభవావంతులైప్పటికీ అనేక మంది విద్యార్థుల జీవితాల్లో కనిపించే ఘటన ఇది. నీరాశలో కూరుకుపోయే సమయం. కానీ.. శరణ్ హెగ్డే(Sharan Hegde) అందరిలాంటి వాడు కాదు. వైఫల్యం ఎదురైనా లెక్క చేయకుండా ముందడుగు వేశాడు. ఫలితంగా.. ఒకప్పుడు తనను కాదన్న ఐఐఎంలో అతిథిగా వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. లైఫ్‌లో ఎలా పోరాడాలో ఎలా గెలవాలో చెప్పే ఉదంతం ఇది.

శరణ్ హెగ్డె.. ఇన్‌స్టాలో(Instagram) ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్(Finfluencer). శరణ్‌కు ఉన్న 3.3 మంది ఫాలోవర్లు.. అతడు ఏం చెబుతాడా అని ఎదురు చూస్తుంటారు. యూట్యూబ్‌లో అతడికి 1.3 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ట్విటర్‌లోనూ 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆర్థికాంశాలపై శరణ్‌కు ఉన్న పట్టు అపారం..నెట్టింట్లో అతడికున్న ఫాలోయింగే ఇందుకు నిదర్శనం. కానీ.. సరిగ్గా మూడేళ్ల క్రితం అతడో సామాన్య యువకుడు. ఐఐఎమ్‌లో సీట్ కొట్టాలి.. లైఫ్‌లో ఎదగాలి.. ఇదీ శరణ్ లక్ష్యం. అతడి ప్రతిభ కారణంగా క్యాట్ పరీక్షలో ఏకంగా 98 పర్సెంటైల్ స్కోర్ వచ్చింది. కానీ.. కోరుకున్న సీటు మాత్రం దక్కలేదు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడతను దేశంలోనే ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్. అందుకే.. ఐఐఎంకు అతిథిగా వచ్చి ఔత్సాహిక మహిళ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించాలంటూ ఆహ్వానం అందుకున్నాడు. కార్యక్రమంలో పాల్గొన్నాక సంస్థ ముందు నిలబడి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ శరణ్ తన జర్నీ గురించి పంచుకున్నాడు.

‘‘మూడేళ్ల క్రితం నేను ఐఐఎం ఆశలను వదిలేసుకున్నా. కానీ.. ఇప్పుడు అదే ఐఐఎం‌కు అతిథిగా వచ్చా. అక్కడ మైక్ ముందు నిలబడ్డాక ఏదో తెలీని గాబరా.. కానీ నా మొహంలో మాత్రం ఓ చిరునవ్వు. నా ఐఐఎం ప్రయత్నాలన్నీ వృథా అయిపోయాయని అప్పట్లో అనుకున్నా. ఆ తరువాత అమెరికా యూనివర్శిటీలో చేరా.. అక్కడ కూడా నన్ను ఏదో అసంతృప్తి వెంటాడింది. దీంతో..చదువు మధ్యలోనే ఆపేశా.. నాకిష్టమైన కంటెంట్ క్రియేషన్‌పై దృష్టి పెట్టా..చివరకు అనుకున్నది సాధించా. ఐఐఎంతో మొదలైన నా ప్రయాణం మళ్లీ ఇక్కడికే వచ్చింది. అందుకే..నా మొహంపై నవ్వు విరిసింది. జీవితం అంటే ఇదేనేమో.. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే.. లైఫ్‌లో ఏం జరిగినా అది మన మంచికే. వైఫల్యాన్ని కూడా ఈ కోణంలో చూడగలిగి, ఆ అనుభవాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి’’ అంటూ తన పోస్ట్ పెట్టాడు.

Updated Date - 2022-11-22T21:11:31+05:30 IST