Gurthunda Seethakalam Review: బయటకి రాగానే అంతా మర్చిపోతాం
ABN , First Publish Date - 2022-12-09T16:41:08+05:30 IST
(Tamannah Bhatia) ఈసారి సత్యదేవ్ (Satyadev) పక్కన 'గుర్తుందా శీతాకాలం' (Gurthundaa Seethakalam) సినిమాలో నటించడం ఒక ఆసక్తికరం. ఈ సినిమా కన్నడ సినిమా 'లవ్ మాక్ టైల్' (Love Mocktail) కి రీమేక్ (Remake).
రివ్యూ: Gurthunda Seethakalam
నటీనటులు : తమన్నా, సత్యదేవ్, ప్రియదర్శి, కావ్యా శెట్టి, మేఘా ఆకాష్, హర్షిని, సుహాసిని మణిరత్నం తదితరులు
సంగీతం : కాల భైరవ
ఛాయాగ్రహణం : సత్య హెగ్డే
నిర్మాతలు : రామారావు చింతపల్లి, నాగ శేఖర్, భావన రవి
దర్శకత్వం : నాగ శేఖర్
-- సురేష్ కవిరాయని
అగ్ర నటీమణుల్లో ఒకరు అయిన తమన్నా (Tamannah Bhatia) ఈసారి సత్యదేవ్ (Satyadev) పక్కన 'గుర్తుందా శీతాకాలం' (Gurthundaa Seethakalam) సినిమాలో నటించడం ఒక ఆసక్తికరం. ఈ సినిమా కన్నడ సినిమా 'లవ్ మాక్ టైల్' (Love Mocktail) కి రీమేక్ (Remake). నాగశేఖర్ (Nagashekar) దర్శకుడు కాగా, కాల భైరవ సంగీతం సమకూర్చారు. ఇందులో తమన్నా తో పాటు మేఘ ఆకాష్ (Megha Akash), కావ్య శెట్టి (Kavya Shetty) కూడా వున్నారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
(Gurthunda Seethakalam story) కథ:
ఈ సినిమా కథ చాలా సింపుల్. సత్యదేవ్ (సత్యదేవ్) అనే అతను మంగళూరు ప్రయాణం అవుతాడు, మధ్య దారిలో దివ్య (మేఘ ఆకాష్) అనే అమ్మాయి మంగుళూరు వరకు తాను కూడా వస్తాను అని లిఫ్ట్ అడుగుతుంది. సత్యదేవ్ సరే అంటాడు. సుమారు ఏడు గంటల ప్రయాణం కాబట్టి, దివ్య వూరికే ఉండక సత్యదేవ్ ని అతని గర్ల్ ఫ్రెండ్స్ వున్నారా, ఉంటే వాళ్ళ కథలు చెప్పమని అడుగుతుంది. అప్పుడు సత్యదేవ్ తన స్కూల్ రోజుల దగ్గర నుండి కథని ప్రారంభించి స్కూల్ డేస్ లో అతను వచ్చీ రానీ ఇంగ్లీష్ తో తనకి నచ్చిన అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియక వదులుకున్నాడు. తరువాత కాలేజీ చదువుతున్నప్పుడు బాగా ధనవంతు రాలయిన అమ్ము (కావ్య శెట్టి) తో ప్రేమలో పడటం, ఆమెని పెళ్లి చేసుకుంటాను అని చెప్పటం వరకు వస్తుంది. తరువాత బెంగుళూరు లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ రావటం, అమ్ముకి సత్యదేవ్ జీతం ఎంతో తెలిసాక, ఆ జీతంతో బతకలేము అని బ్రేక్-అప్ చెప్పటం జరుగుతుంది. తరువాత అదే కంపెనీ లో పని చేస్తున్న నిధి (తమన్నా) అనే అమ్మాయి పరిచయం అవటం పెళ్లిచేసుకోవటం కూడా జరుగుతుంది. వాళ్లిద్దరూ సంతోషంగా తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక సంఘటన వాళ్ళిద్దరినీ కుదిపేస్తోంది. అదేంటి, ఏమైంది అన్నది మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
'గుర్తుందా శీతాకాలం' అనే సినిమా కన్నడ సినిమా 'లవ్ మాక్ టైల్' అనే సినిమాకి రీమేక్. తెలుగు సినిమా కి దర్శకుడు కూడా కన్నడ సినిమాలు చేసిన నాగశేఖర్ అనే అతను, మొదటి సారిగా తెలుగు సినిమా దర్శకత్వం చేసాడు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ కన్నడ సినిమాని రీమేక్ చెయ్యడానికి ఎందుకు తీసుకున్నారు అనేదే ఒక చిన్న సందేహం. ఎందుకంటే ఇలాంటి కథలు టాలీవుడ్ లో చాలా వచ్చాయి. 'ప్రేమమ్', 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్', 'నా పేరు కార్తిక్', ఇంకా ఈమధ్యనే వచ్చిన 'థేంక్ యు' లాంటి సినిమాలు కథలు అన్నీ ఇలాంటివే. స్కూల్ నుండి వుద్యోగం చేసేవరకు ఒక అబ్బాయి జీవితంలో ముడిపడి వున్న అమ్మాయిలు, వారితో ఎటువంటి బంధం, చివరికి ఎవరిని చేసుకున్నాడు లాంటి కథలు ఎన్నో వచ్చాయి. ఇప్పుడు ఈ 'గుర్తుందా శీతాకాలం' కూడా అటువంటి బ్యాక్ డ్రాప్ తో వచ్చిన కథే. అయితే క్లైమాక్స్ లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి, కానీ కథల కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే.
మరి ఇన్ని సినిమాలు ఒకేలా వుండే కథలతో వచ్చినప్పుడు మళ్ళీ అటువంటి సినిమానే ఎందుకు రీమేక్ చేసారో అర్థం కాని ప్రశ్న. ఒకవేళ అలాంటి సినిమానే తీయాలంటే ఆ సినిమా ప్రేక్షకుడిని కట్టి పడేసాలా అన్ని హంగులూ ఉండాలి. కానీ అవేమీ ఈ సినిమాలో కనిపించవు. దానికి మించి సహజత్వానికి దూరంగా ఉంటాయి ఈ సినిమాలో సన్నివేశాలు. అదీ కాకుండా, ఒక యాక్టర్ ని కాలేజీ కుర్రాడుగా, టీనేజ్ అబ్బాయిగా, వుద్యోగం చేస్తున్న వాడిగా ఇన్ని చూపించాలి అంటే, చాలా కష్టపడాలి. సత్యదేవ్ చాలా మంచి యాక్టర్, అందులో సందేహం లేదు, కానీ అతను కాలేజీ కుర్రాడు రోల్ కి మాత్రం అస్సలు సూట్ కాలేదు. అయితే సినిమాలో అక్కడక్కడా కొన్ని హాస్య సన్నివేశాలు బాగున్నాయి కానీ, ఎదో మిస్ అయింది అన్న భావన మాత్రం కలుగుతుంది. మొదటి సగం అంత స్కూల్, కాలేజీ లో జరిగే సన్నివేశాలు ఆలా సాగిపోతుంది. రెండో సగం అంత భార్య, భర్తల మధ్య జరిగే భావేద్వేగాలు వాళ్ళ మధ్య అనుబంధం వీటితో సాగుతుంది. అయితే ఈ రెండో సగం లో బంధాలు, అనుబంధాలు మాత్రం ప్రేక్షకుడు ఆశించినంత బలంగా వుండవు. ప్రేక్షకుడికి కట్టిపడేసాలా తీయాల్సిన భావేద్వేగాలు కనపడవు సరికదా, ఆ సన్నివేశాలు కొన్ని చాలా సాగదీసినట్టుగా, ఎప్పుడు అయిపోతుందా అన్నట్టుగా ఉంటుంది.
దర్శకుడు నాగశేఖర్ తెలుగు ప్రేక్షకుడికి దగ్గరగా వుండేటట్టు కథ మారిస్తే బాగుండేది. ఆలా కాకుండా కథ సహజత్వానికి చాలా దూరంగా ఉంటుంది. కాలేజీలో వున్నప్పుడు సత్యదేవ్ మరియు కావ్య శెట్టిల మధ్య వచ్చే సన్నివేశాలు సరిగా కుదరలేదు. కావ్య శెట్టి కాలేజీ అమ్మాయిల లేదు, సత్యదేవ్ కూడా కాలేజీ అబ్బాయిలా కనిపించడు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ ప్రేమ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు అందుకే. ఇంక, తమన్నా మరియు సత్యదేవ్ ఇద్దరు మంచి నటులే కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా కెమిస్ట్రీ అంతగా కుదరలేదు. తమన్నా చివర సన్నివేశాల్లో చాలా బాగా చేసింది, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. కథ కూడా ముందే తెలిసిపోతూ ఉంటుంది. అదీ కాకుండా, దర్శకుడు కథ చెప్పే తీరు అంత ఆసక్తికరంగా లేదు. సినిమా మొత్తం లో భావోద్వేగాలు అసలు లేవు. అది బాగుంటేనే కదా ప్రేక్షకుడు చూసేది, ముఖ్యంగా ఇలాంటి కథలున్న సినిమాల్లో. దర్శకుడు అన్నిటిలో విఫలం అయ్యాడనే చెప్పాలి.
ఇక నటీనటుల విషయానికి వస్తే, సత్య దేవ్ కాలేజీ కుర్రాడిగా వున్నప్పుడు వేసిన జోక్స్ బాగున్నాయి. అలాగే ఒక పరిణితి చెందిన మనిషిగా చాలా బాగా చేసాడు. ఒక సమయం లో అయితే తమన్నా కన్నా సత్యదేవ్ కే ఎక్కువ మార్కులు వేయొచ్చు. అలాగే తమన్నా కొన్ని సన్నివేశాల్లో బాగా చేసింది, కానీ ఆమె చెయ్యాల్సిన సినిమా కాదు అని అభిప్రాయం. కానీ సత్యదేవ్, తమన్నా ల మధ్య కెమిస్ట్రీ అంతగా పండలేదు. మేఘా ఆకాష్ బాగుంది, చలాకీగా వుంది. కావ్య శెట్టి కాలేజీ అమ్మాయిగా ఆ పాత్రలో సూట్ కాలేదు. మామూలుగా కనిపించింది. ప్రియదర్శి కి సత్యదేవ్ స్నేహితుడుగా చాలా పెద్ద పాత్ర వచ్చింది ఈ సినిమాలో, అతను దాన్ని చాల బాగా చేసాడు. హాస్యాన్ని పలికించాడు కూడా. అతనికి జోడీగా హర్షిణి చేసింది, ఆమెకి కూడా పెద్ద రోల్ వచ్చింది. సుహాసిని మణిరత్నం చివర్లో కనపడతారు. సినిమాటోగ్రఫీ బాగుంది, చక్కని దృశ్యాలని తన కెమెరాతో సత్య హెగ్డే బంధించారు. సంగీతం పరవాలేదు కానీ సన్నివేశాలను ఈమాత్రం ఎలేవేట్ చేసే విధంగా అయితే లేదు. మాటలు కూడా మామూలుగా వున్నాయి.
చివరగా 'గుర్తుందా శీతాకాలం' సినిమా బయటకి వచ్చాక, సినిమాలో ఒక్క సన్నివేశం కూడా మనకి గుర్తు ఉండదు. అన్నీ మర్చిపోతాం. ఈ సన్నివేశాలు అన్నీ ఎక్కడో చూసాం ఈమధ్య అనిపిస్తుంది. అదీ కాకుండా అన్ని సన్నివేశాలు లాగి లాగి సాగదీసాడు దర్శకుడు. ఇప్పుడు థియేటర్ కి ప్రేక్షకులు రావటమే కష్టం అవుతున్న ఈ సమయంలో టాలీవుడ్ లో ఫెయిల్ అయినా కథలనే, మళ్ళీ రీమేక్ చెయ్యడం సాహసమే మరి.