Amazon: ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇస్తే ఏం వచ్చిందో తెలుసా.. అస్సలు ఊహించలేరు
ABN , First Publish Date - 2022-12-19T22:17:29+05:30 IST
ఆన్‌లైన్ ప్రొడక్ట్ డెలివరీల విషయంలో పొరపాట్ల గురించి వింటూనే ఉంటాం. ఆర్డర్ ఇచ్చిన వస్తువుకు బదులు మరొక ఐటెమ్ రావడం చూసి షాక్‌కు గురైన వినియోగదారులు చాలామందే ఉన్నారు.
ఆన్‌లైన్ ప్రొడక్ట్ డెలివరీల విషయంలో పొరపాట్ల గురించి వింటూనే ఉంటాం. ఆర్డర్ ఇచ్చిన వస్తువుకు బదులు మరొక ఐటెమ్ రావడం చూసి షాక్‌కు గురైన వినియోగదారులు చాలామందే ఉన్నారు. అచ్చం ఇలాంటి అనుభూతే తాజాగా మరో వ్యక్తికి ఎదురైంది. యూకేకి చెందిన ఓ వ్యక్తి రూ.1,20,663 (యూరోలు - 1,200) విలువైన మ్యాక్‌బుక్ ప్రో (MacBook Pro) ల్యాప్‌టాప్‌కు ఆర్డర్ (Online order) ఇస్తే కుక్క ఆహారం (pet food) డెలివరీ అయ్యింది. ఈ షాకింగ్ ఘటన 61 ఏళ్ల అలెన్ ఉడ్ అనే పెద్దాయనకు ఎదురైంది. తన కూతురి కోసం అమెజాన్‌లో (Amazon) మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇచ్చానని, అయితే రెండు ప్యాకెట్ల పెడిగ్రీ (Pedigree) కుక్క ఆహారం వచ్చిందని చెప్పారు. ‘‘ నవంబర్ 29న ఆర్డర్ చేశాను. ఆ మరుసటి రోజే డెలివరీ అయ్యింది. వెంటనే డబ్బు కూడా చెల్లించాను. కానీ పార్శిల్ తెరచిచూశాక షాకవ్వడం నా వంతైంది. వెంటనే కంపెనీని కాంటాక్ట్ చేశాను. కానీ రిఫండ్ చేసేందుకు నిరాకరించారు’’ అని అలెన్ తెలిపినట్టు మెట్రోడాట్‌కోడాట్ (Metro.co.uk) రిపోర్ట్ పేర్కొంది.
అమెజాన్ కస్టమర్ సర్వీసు ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్లతో ఫోన్‌లో మాట్లాడేందుకు 15 గంటలకుపైగా సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని అలెన్ ఉడ్ వాపోయాడు. వేర్వేరు డిపార్ట్‌మెంట్లకు ఫార్వర్డ్ చేయడానికి చాలా టైమ్ పట్టిందని, మళ్లీ మళ్లీ కాల్స్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ‘‘ పార్శిల్ ఓపెన్ చేసి చూసినప్పుడు నా ముఖం ఎలా ఉండి ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందని తొలుత భావించాను. కానీ అమెజాన్ కస్టమర్ సర్వీసు ప్రతినిధితో మాట్లాడినా వాళ్లు నాకు సాయం చేయలేదు. నాకు రాని ల్యాప్‌టాప్‌ను రిటర్న్ చేయాలన్నారు. ఎలా పంపించను. నాకు డెలివరీ చేసిన కుక్క ఆహారాన్నే అమెజాన్ వేర్‌హౌస్‌కు పంపించాను. ఫలితంలో మార్పు లేదు’’ అని అలెన్ ఉడ్ పేర్కొన్నాడు. కానీ పొరపాటును ఆలస్యంగా గుర్తించిన అమెజాన్.. అలెన్‌కు క్షమాపణలు చెప్పింది. డబ్బును పూర్తిస్థాయిలో రిఫండ్ చేస్తామని హామీ ఇచ్చింది. ‘‘ అలెన్ ఉడ్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం. పూర్తిస్థాయి రిఫండ్ ప్రాసెస్ మొదలవుతుంది’’ అని అమెజాన్ ప్రతినిధి ఒకరు ప్రకటన చేశారు.