ఒళ్ళంతా కాదు.. కళ్ళలో కూడా పచ్చబొట్టే.. అందరికీ షాకిస్తున్న భార్యాభర్తల జంట..
ABN , First Publish Date - 2022-11-23T13:05:37+05:30 IST
భార్యాభర్తల జంట తమ ఒళ్ళంతా పచ్చబొట్లతో వారి శరీరాన్ని వింతగా మార్చుకుని..
పచ్చబొట్టు సంస్కృతి ఇప్పటిది కాదు. అయితే అది కాలంతో పాటు కొత్తగా రూపాంతరం చెందుతోంది. చరిత్రలోకి చూస్తే ఒకప్పుడు గిరిజన తెగలు, ప్రాచీన నాగరిక ప్రజలు పచ్చబొట్లు వేయించుకోవడం, శరీరంలో వివిధ ప్రాంతాలలో చర్మానికి రంధ్రాలు చేయించుకుని అలంకరణ వస్తువులు ధరించడం గమనించవచ్చు. ఇవి ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి. అయితే, ఓ భార్యాభర్తల జంట తమ ఒళ్ళంతా పచ్చబొట్లతో వారి శరీరాన్ని వింతగా మార్చుకుని ఏకంగా వరల్డ్ రికార్డ్ సృష్టించింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే...
24సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికాలో మోటార్ సైకిల్ ఈవెంట్స్ జరిగాయి. అప్పుడు విక్టర్ హ్యూగో అనే అబ్బాయి, గాబ్రియేలా పెరాల్టా అనే అమ్మాయి అక్కడ ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో వారిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. అప్పటినుండి వారు వారి శరీరం మీద పచ్చబొట్లు వేయించుకోవడం మొదలు పెట్టారు. అలా మొదలు పెట్టిన వారి పచ్చబొట్ల ముచ్చట ఇప్పటికీ ఆగలేదంటే నమ్మండి. శరీరం మొత్తం ఎక్కడా గ్యాప్ లేకుండా పచ్చబొట్టు వేయించుకోవడమే కాదు కనుబొమ్మల మీద, చెవులకు, ముక్కులకు, రింగులు కుట్టించుకున్నారు, నాలుకకు ఫోర్క్ లు గుచ్చుకోవడంతో వీరి రూపం ఒకింత ఒళ్ళు జలధరించేట్టు కనబడుతోంది. వీరి ఆకారం చూసి వీరికి ప్రపంచ రికార్డులో స్థానం ఇచ్చేశారు. మరొక విస్తుపోయే విషయం ఏమిటంటే.. కళ్ళలో కూడా పచ్చబొట్టు వేయించుకుని నల్లని కళ్ళతో అందరికీ షాక్ ఇస్తోంది సదరు మహిళ.