ఒకప్పుడు గోల్ప్ కిట్ మోయడానికి రూ.10 తీసుకున్న కుర్రాడు.. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌లకు శిక్షణ ఇస్తున్నాడు..
ABN , First Publish Date - 2022-12-07T11:43:12+05:30 IST
పరిస్థితుల కారణంగా దొంగతనాలు చేశాడు, చెడు అలవాట్లకు బానిస అయ్యాడు కానీ చివరికి
ఆ కుర్రాడి వయసు 14సంవత్సరాలు. అతని బాబాయ్ వారి ఇంటికి కొద్ది దూరంలో ఉండే గోల్ఫ్ గ్రౌండ్ కు ప్రతిరోజూ వెళుతుండటం చూసి తనూ వెళ్ళాడు. అయితే గోల్ఫ్ ఆడటానికో చూడటానికో కాదు. గోల్ఫ్ గ్రౌండ్ లో ఆడుతున్న వారి గోల్ఫ్ కిట్ లు మోయడానికి. ఇలా గోల్ఫ్ కిట్ లు మోసినందుకు వారికి పది రూపాయలు ఇచ్చేవారు. కొన్నేళ్ళు గడిచిపోయాయి. 10రుపాయలకు గోల్ఫ్ కిట్ మోసిన ఆ కుర్రాడు ఇప్పుడు ఐఏఎస్, ఐపియస్ ఆఫీసర్లకు గోల్ఫ్ శిక్షణ ఇస్తున్నాడు. పరిస్థితుల కారణంగా దొంగతనాలు చేశాడు, చెడు అలవాట్లకు బానిస అయ్యాడు కానీ చివరికి తన జీవితాన్ని ఉన్నతంగా మలచుకున్న స్పూర్తివంతమైన ఓ కుర్రాడి కథ ఇదీ..
అమన్ సింగ్ రాజ్ పుత్ కు అమ్మ ఎలా ఉంటుంది తెలీదు, తన రెండున్నర సంవత్సరాల వయసులోనే అమ్మను కోల్పోయాడు. అప్పటికి అతని చెల్లికి రెండు నెలలే.. అమ్మమ్మ తాతయ్య ఇద్దరు పిల్లల బాధ్యతను భుజాలమీదకు ఎత్తుకున్నారు. భోపాల్ నగర శివారు ప్రాంతంలో మురికివాడలో నివసించేవారు. తల్లి చనిపోగానే ఇతని తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకున్నా అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ అమ్మమ్మ తాతయ్యల దగ్గరే పెరిగారు. చిన్నప్పుడు తిండి దొరకడం కష్టమయ్యేది. కానీ అలాగే జీవితం సాగింది. వీరు నివసించే ప్రాంతాలలో చెడు అలవాట్లు ఎక్కువ ఆ కారణంగా పెరిగే కొద్ది అమన్ కూడా ఆ అలవాట్ల వైపు మళ్ళాడు. పేకాట ఆడటం, మధ్యం సేవించడం వంటి పనులు చేసేవాడు. డబ్బుకోసం గోల్ఫ్ కిట్ లు మోసేవాడు. అయితే అది సరిపోకపోవడంతో దొంగతనాలు చేయడం ఇతరుల ఇళ్ళ దగ్గర ఇనుము వస్తువులు ఏవైనా ఉంటే వాటిని ఎత్తుకెళ్ళి అమ్మడం చేసేవాడు. అయితే ఈ విషయం అమ్మమ్మ తాతయ్యలకు తెలియడంతో అమన్ ను బాగా కొట్టారు. దొంగతనం ఎంత తప్పో చెప్పారు. మనిషికి మంచి అలవాట్లు కావాలి అంటే చెడువారితో స్నేహం వదిలి మంచివారితో స్నేహం చేయాలని చెప్పారు.
ఆ మాటలు అమన్ మీద చాలా ప్రభావం చూపించాయి. తమను పెంచడానికి అమ్మమ్మ తాతయ్యలు ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకున్నాడు. క్రమంగా చెడు అలవాట్లకు దూరమయ్యాడు. ప్రతి రోజూ గోల్ఫ్ గ్రౌండ్ కు వెళ్ళేవాడు. అక్కడ దాదాపు పది కేజీల బరువుండే గోల్ఫ్ కిట్ ను మోసేవాడు. ఈ క్రమంలోనే ఒక ఆఫీసర్ గోల్ఫ్ కిట్ మోస్తున్నప్పుడు అతను అమన్ ను గోల్ఫ్ ఆడమని ప్రోత్సహించాడు. చాలా మంది అతను మురికివాడ నుండి వస్తాడు విలువైన వస్తువులు ఎత్తుకుని పోతాడు అతన్ని ఆడనివ్వకండి అని చెప్పేవారు కానీ అమన్ గోల్ఫ్ ఎంతో బాగా ఆడుతుండటంతో అక్కడివారు అమన్ ను ప్రోత్సహించారు. 2017లో అలా ఆడటం మొదలుపెట్టిన అమన్ 2020 సంవత్సరానికల్లా గోల్ఫ్ ఆడటంలో నిష్టాతుడు అయిపోయాడు. 2020 సంవత్సరంలోనే ఇతనికి గోల్ఫ్ కోచ్ గా సర్టిఫికెట్ లభించింది. ఈ క్రమంలోనే తన గ్రాడ్యుయేట్ కూడా పూర్తిచేసాడు.
2020,2021,2022 సంవత్సరాలలో జరిగిన బెల్ గోల్ఫ్ ఓపెన్ టోర్నమెంట్ లలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు అమన్. 2020 సంవత్సరంలోనే ఇండియన్ గోల్ఫ్ యూనియన్ లో క్వాలిఫై అయ్యాడు. ఒకప్పుడు గోల్ఫ్ కిట్ మోస్తూ 10రూ సంపాదించిన అతను ప్రస్తుతం ఐఏఎస్, ఐపియస్ ఆఫీసర్లకు గోల్ఫ్ ఆడటం నేర్పిస్తూ గంటకు 700రూపాయల ఫీజు తీసుకుంటున్నాడు. 22ఏళ్ళ వయసుకే ఎంతో జీవితం చూసిన అమన్ సింగ్ రాజ్ పుత్ తను పెరిగిన మురికివాడలో పిల్లలకు ప్రేరణ అయ్యాడు. ఇప్పుడు అక్కడి పిల్లలందరూ అతని దగ్గరకు గోల్ఫ్ నేర్చుకోవడానికి వస్తున్నారు. అతని గురించి తెలిశాక వారికే కాదు అందరికీ ప్రేరణ అవుతాడు ఈ కుర్రాడు.