లక్షల్లో జీతమొచ్చే జాబ్‌కు రిజైన్ చేసిన యువతి.. ఇదేం పనంటూ మాట్లాడటమే మానేసిన తండ్రి.. చివరకు..
ABN , First Publish Date - 2022-11-29T14:55:59+05:30 IST
ఉద్యోగంలో చేరిన ఆరు నెలలలోపే నేను ఉద్యోగం వదిలేస్తున్నానని కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది.
ఎంబిఏ పూర్తవగానే దేశరాజధాని ఢిల్లీలో సంవత్సరానికి 8లక్షల రూపాయల ప్యాకేజితో ఉద్యోగానికి ఎంపికయింది ఆ అమ్మాయి. తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎంతగానో సంతోషించారు కానీ ఉద్యోగంలో చేరిన ఆరు నెలలలోపే నేను ఉద్యోగం వదిలేస్తున్నానని కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది. అసలు ఆమె నిర్ణయం ఏంటి? ఎందుకు అలా చేసింది? వివరాల్లోకి వెళితే...
మోనికా జాకర్ రాజస్థాన్ రాష్ట్రం సికార్ జిల్లాలో దాస కి దాని అనే ఓ చిన్నగ్రామానికి చెందినది. తన ఎంబిఏ పూర్తవగానే ఢిల్లీలో డ్రీమ్ ఇన్ఫోటెక్ కంపెనీలో సంవత్సరానికి 8లక్షల ప్యాకేజితో ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. ఆమె ఒకరోజు తన కొలీగ్ తో కలసి ఢిల్లీలోనే ఉన్న షూటింగ్ ఇన్స్టిట్యూట్ కు సరదాగా వెళ్ళింది. అక్కడికి వెళ్ళి వచ్చిన తరువాత ఆమె మనసులో షూటింగ్ గురించే ఆలోచన పట్టుకుంది. 'నేనూ షూటింగ్ నేర్చుకుంటే..' అనే ఆలోచన ఆమెకు కొత్తగా అనిపించింది. నాకు ఇదే సరైనది, ఇన్నాళ్ళు ఉద్యోగం చేసినా దానిలో తృప్తి లేదు అనుకుంది. అలా అనుకోగానే తల్లిదండ్రులతో నేను ఉద్యోగం మానేస్తున్నాను అనే మాట చెప్పింది. 'పిచ్చిపిచ్చిగా ఉందా ఇంత మంచి ఉద్యోగం వదిలేస్తానంటున్నావు ఏంటి? అసలు ఉద్యోగం మానేయాలని ఎందుకు అనుకుంటున్నావు? అని అడిగాడు మోనికా తండ్రి.
'నేను షూటింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఆ ఫీల్డ్ లోనే కొనసాగాలని అనుకుంటున్నాను' అని చెప్పింది మోనిక. కూతురు ఉద్యోగం మానెయ్యాలని అనుకోవడమే పెద్ద షాక్ గా అనిపిస్తే షూటింగ్ నేర్చుకోవడానికి ఆ నిర్ణయం తీసుకోవడం మరింత కోపం తెప్పించింది మోనిక తండ్రికి. కానీ ఆయన కోపాన్ని అణుచుకుని ఇలాంటివి నేర్చుకోవడానికి స్కూల్ వయసు, కాలేజి వయసు సరైనది. నువ్వేమో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు. కాబట్టి నీ ఆలోచన మానుకో అని చెప్పాడు. కానీ మోనికా ఆయన మాట వినలేదు. నేను చెప్పే గడువులోగా నేషనల్ లెవల్ కి సెలెక్ట్ అవ్వకపోతే అసలు షూటింగ్ ఫీల్డ్ వదిలేస్తాను అని ఛాలెంజ్ చేసింది. మోనిక తండ్రి ఆమెతో మాట్లాడటం మానేశాడు. మోనిక కూడా ఏమాత్రం తగ్గకుండా మొండిగా తను అనుకున్న లక్ష్యం వైపే దృష్టి పెట్టింది.
అనుకున్నట్టుగా ఉద్యోగం వదిలేసి షూటింగ్ కోసం కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టింది. కేవలం 25 రోజుల్లో షూటింగ్ మీద పట్టు తెచ్చుకుని రాష్ట్రస్థాయిలో పాల్గొనే అవకాశం పొందింది. అప్పటికి మోనికా దగ్గర కనీసం సొంతంగా రైఫిల్ కిట్ కూడా లేదు. అందుకని షెకావతి షూటింగ్ రేంజ్ నుండి రైఫిల్ కిట్ తెచ్చుకుని రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంది. దానికి ఫలితంగా ఆ పోటీలో అర్హత సాధించింది. ఆ తరువాత డెహ్రడూన్ లో జరిగిన నార్త్ జోన్ నేషనల్స్ లోనూ, కేరళలో జరిగిన నేషనల్ గేమ్స్ లోనూ మూడు పాయింట్లతో అర్హత సాధించింది. మోనిక వరుస విజయాలు చూసిన ఆమె తండ్రి సంతోషపడ్డాడు. తన కూతురు కోసం ఆయనే స్వయంగా షూటింగ్ కిట్ ఆర్డర్ చేశాడు.
కోవిడ్ సమయంలోనూ తన ప్రాక్టీస్ ను వదల్లేదు మోనిక. ప్రతిరోజు మూడుగంటలు షూటింగ్ కోసం కేటాయించింది. ఆమె కృషి ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రం తరపున 1స్వర్ణ పతకం, 2రజత పతకాలు, 1 కాంస్య పతకం ఆమె సొంతమయ్యాయి. ప్రస్తుతం పూణెలో శిక్షణ తీసుకుంటున్న ఈమె గత రెండునెలల నుండి ప్రతిరోజూ 7గంటల పాటు ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పుడు ఆమెకు కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంది. తన కూతురు కష్టమే తనకు గుర్తింపు తెస్తోందని మోనికా తండ్రి చాలా సంతోషంగా చెబుతున్నాడు. ఒలంపిక్స్ లో పతకం సాధించి దేశానికి పేరు తీసుకురావాలని అయన ఆశాభావం వ్యక్తం చేశాడు. మోనిక అనుకున్న లక్ష్యం సాధిస్తే దేశం కూడా గర్వపడుతుంది.