The Exorcist Movie: ప్రేక్షకులకు గుండెపోటు.. స్త్రీలకు గర్భస్రావం.. థియేటర్ల బయట అంబులెన్స్‌లు.. చరిత్రలోనే భయంకరమైన సినిమా..!

ABN , First Publish Date - 2022-12-10T16:35:03+05:30 IST

నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన`కనెక్ట్` ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ The Exorcist గుర్తుకు వస్తోందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. హారర్ సినిమాల చరిత్రలోనే The Exorcist గుర్తుంచుకోదగ్గ చిత్రం. ఆ సినిమా చూసి భయపడని వారు ఉన్నారంటే వారి గుండె ధైర్యానికి సలాం కొట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

The Exorcist Movie: ప్రేక్షకులకు గుండెపోటు.. స్త్రీలకు గర్భస్రావం.. థియేటర్ల బయట అంబులెన్స్‌లు.. చరిత్రలోనే భయంకరమైన సినిమా..!

అశ్విన్ శరవణన్ (Ashwin Saravanan).. 2015లో నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో మయూరి సినిమా తెరకెక్కించి హారర్ సినీ ప్రియుల మనసులను గెలుచుకున్నాడు. ఇటీవలి కాలంలో వస్తున్న హారర్ సినిమాలన్నీ కాంచన తరహాలో కామెడీ కలగలిపి తెరకెక్కుతున్నాయి. అసలైన హారర్ ప్రియులకు అవి సరైన కిక్ ఇవ్వడం లేదు. ఆ సమయంలో అశ్విన్ తీసిన మయూరి సీరియస్ హారర్‌గా రూపొంది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 2019లో అశ్విన్ తీసిన గేమ్ ఓవర్ కూడా సినీ ప్రియులకు చక్కని అనుభూతి మిగిల్చింది.

ప్రస్తుతం అశ్విన్ రూపొందిస్తున్న చిత్రం కనెక్ట్ (Connect). నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ (Connect Movie trailer) తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కనెక్ట్ ట్రైలర్ చూస్తుంటే 1973లో విడుదలైన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ The Exorcist గుర్తుకు వస్తోందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. హారర్ సినిమాల (Hollywood Horror film) చరిత్రలోనే The Exorcist గుర్తుంచుకోదగ్గ చిత్రం. ఆ సినిమా చూసి భయపడని వారు ఉన్నారంటే వారి గుండె ధైర్యానికి సలాం కొట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

exorist.jpg

1973లో విడుదలైన The Exorcist సినిమా చూస్తే మరణాన్ని కలుసుకున్నట్టే అని చాలా మంది చెబుతుంటారు. ఈ సినిమా చూసి థియేటర్లలోనే చాలా మంది గుండెపోటుకు గురయ్యారు. అంతేకాదు ఒక మహిళకు అబార్షన్ కూడా అయింది. మరో మహిళ థియేటర్‌లోనే ప్రసవించింది. ఎంతో మంది థియేటర్లలోనే వాంతులు చేసుకునేవారట. కళ్లు తిరిగి పడిపోయేవారట. అమెరికాలో The Exorcist సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల బయట అంబులెన్స్‌లు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సినిమా రివ్యూ చేయడానికి వెళ్లిన సినీ విమర్శకులు కూడా సినిమా ప్రారంభమైన కొద్ది నిమిషాలకే థియేటర్ నుంచి పరుగులు తీశారట. ఈ సినిమా చూసి మానసిక అనారోగ్యానికి గురైన వారికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించాల్సి వచ్చిందట.

షూటింగ్ సమయంలోనే మరణాలు..

హాలీవుడ్ స్క్రీన్ రైటర్ విలియం రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వార్నర్ బ్రదర్స్ ఆ నవల హక్కులు కొని ప్రఖ్యాత దర్శకుల కోసం ప్రయత్నించారట. అయితే ఆ నవలను సినిమాగా మార్చేందుకు ఎవరూ ముందుకు రాలేదట. దీంతో రచయిత విలియం దర్శకుడిగా మారాల్సి వచ్చింది. పేరున్న దర్శకుడు కాకపోవడంతో స్టార్స్ ఎవరూ ఆ సినిమాలో నటించడానికి ముందుకు రాలేదు. దీంతో ఎంతో మందిని ఆడిషన్స్ చేసి తనకు కావాల్సిన నటులను విలియం ఎంచుకున్నాడు. దాదాపు 1,000 మంది అమ్మాయిలను టెస్ట్ చేసి ఈ చిత్రంలో చైల్డ్ లీడ్ పాత్ర కోసం లిండా బ్లెయిర్‌ను తీసుకున్నాడు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ పక్షి ఎలక్ట్రిక్ సర్క్యూట్ బాక్స్‌లోకి ప్రవేశించడంతో సెట్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. మంటలు చెలరేగడంతో సెట్ మొత్తం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ దెయ్యం సన్నివేశాలు చిత్రీకరిస్తున్న గదిలోకి మాత్రం ఒక్క నిప్పు రవ్వ కూడా వెళ్లలేదట. షూటింగ్ సమయంలో తరచుగా ప్రమాదాలు జరగడం, వ్యక్తులు గాయపడడం జరిగేదట. దీంతో చాలా మంది నటీనటులు షూటింగ్‌కు రావడానికి కూడా భయపడ్డారట. ఆ భయంతోనే 6 వారాల పాటు షూటింగ్ ఆపేశారట.

అన్ని ఆటంకాలను దాటుకుని 1973 డిసెంబర్ 21న ఈ సినిమా విడులైంది. ఈ సినిమాను చూసేందుకు అమెరికా జనం ఎగబడ్డారు. తెల్లవారుఝామున 4 గంటల నుంచే టిక్కెట్ల కోసం థియేటర్ల మందు క్యూలైన్లలో నిలబడేవారు. చాలా నగరాల్లో, రద్దీని నియంత్రించడానికి పోలీసులను కూడా పిలిచారు. వసూళ్ల విషయంలో The Exorcist సినిమా ఎన్నో రికార్డులను నెలకొల్పింది. అంతేకాదు, ఆస్కార్‌లో 10 నామినేషన్లు అందుకున్న మొదటి భయానక చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం రెండు ఆస్కార్‌లు, 4 గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెలుచుకుంది. ఇప్పటికీ IMDB రేటింగ్స్‌లో ప్రపంచంలోనే నెంబర్ వన్ హారర్ (scariest movie ever) చిత్రంగా The Exorcist అగ్రస్థానంలో ఉంది.

Updated Date - 2022-12-10T16:40:09+05:30 IST