Australia: 90 ఏళ్ల తర్వాత సొంత రికార్డును బ్రేక్ చేసిన ఆస్ట్రేలియా.. రెండు రోజుల్లోనే తలవంచిన సఫారీలు
ABN , First Publish Date - 2022-12-18T19:12:34+05:30 IST
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా (Australia) 90 ఏళ్ల నాటి రికార్డును తిరగరాసింది
బ్రిస్బేన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా (Australia) 90 ఏళ్ల నాటి రికార్డును తిరగరాసింది. రెండంటే రెండు రోజుల్లోనే దక్షిణాఫ్రికా(South Africa)ను మట్టికరిపించిన కంగారూలు 1932 తర్వాత రెండు రోజుల్లో టెస్టు మ్యాచ్‌ను ముగించారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శనివారం గబ్బాలో ప్రారంభమైన తొలి టెస్టులో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) అద్భుతమైన ఆటతీరుతో సఫారీలను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన కమిన్స్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఆసీస్ అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 77 పరుగులిచ్చి 7 వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా రెండుసార్లు ఓ టెస్టును రెండు రోజుల్లో ముగించగా, ఆశ్చర్యకరంగా రెండుసార్లూ సౌతాఫ్రికానే బాధిత జట్టు కావడం గమనార్హం.
మెల్‌బోర్న్‌లో 1932లో ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా, రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేసింది. ఆ స్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసి విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 218 పరుగులు సాధించింది. దీంతో ఆసీస్‌కు 66 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మరింత జాగ్రత్తగా ఆడాల్సిన దక్షిణాఫ్రికా ఈసారి మరింత దారుణంగా ఆడింది. పాట్ కమిన్స్ దెబ్బకు వికెట్లు టపటపా రాల్చుకుంది. మొత్తం 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులో నాలుగు డకౌట్లు ఉన్నాయి. 100 పరుగులు కూడా చేయకుండానే 99 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత విజయానికి అవసరమైన 34 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా విజయ లక్ష్యమైన 34 పరుగుల్లో 19 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలోనే రావడం విశేషం.