Year Ender 2022: వస్తూనే ట్రోఫీ.. గుజరాత్ సంచలనం

ABN , First Publish Date - 2022-12-25T14:03:43+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో పలు సంచలనాలు నమోదయ్యాయి. ఈ ఐపీఎల్‌తో

Year Ender 2022: వస్తూనే ట్రోఫీ.. గుజరాత్ సంచలనం
IPL 2022

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో పలు సంచలనాలు నమోదయ్యాయి. ఈ ఐపీఎల్‌తో ఎంతోమంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకుని అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. ఈసారి ఐపీఎల్‌‌లోకి రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. అవి గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants). ఈ రెండింటి చేరికతో ఐపీఎల్ మొత్తం జట్ల సంఖ్య 10కి చేరుకుంది. గుజరాత్‌కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), లక్నోకు కేఎల్ రాహుల్(KL Rahul) సారథ్యం వహించారు. ఐపీఎల్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ అంతే గ్రాండ్‌గా విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐపీఎల్‌లో దిగ్గజ జట్టులుగా బోల్డన్ని ట్రోఫీలు అందుకున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లను చిత్తుగా ఓడించిన గుజరాత్ అడుగుపెట్టిన తొలిసారే ట్రోఫీని సొంతం చేసుకుంది. తనపై రూ. 15 కోట్లు వెచ్చించినందుకు హార్దిక్ పాండ్యా పూర్తిగా న్యాయం చేశాడు. ఫ్రాంచైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని 100 శాతం నిజం చేశాడు.

అద్భుత ప్రదర్శన చేసింది వీరే..

ఐపీఎల్ అంటేనే ధనాధన్. కళ్లు చెదిరే బౌండరీలు, సిక్సర్లతో బ్యాటర్లు విరుచుకుపడితే అద్భుతమైన బంతులతో వికెట్లను గిరాటేస్తుంటారు బౌలర్లు. మరి 2022 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందెవరో తెలుసుకుందామా?

జోస్ బట్లర్

ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ (Jos Buttler) ఈసారి అదరగొట్టేశాడు. అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)కు ప్రాతినిధ్యం వహించిన బట్లర్ కళ్లు చెదిరే ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో బట్లర్ 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో మొత్తం 863 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఓ బ్యాటర్ సాధించిన అత్యధిక పరుగులు ఇవే. అంతేకాదు, ఈ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా అతడి పేరు మీదే ఉంది. మొత్తంగా 17 మ్యాచ్‌లు ఆడిన బట్లర్ 45 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అభిమానులను ఉర్రూతలూగించాడు. అత్యద్భుత షోతో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే, ఫైనల్‌లో బలమైన గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ ఓటమి పాలై రెండో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా, ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో మాత్రం కప్పు చేజారకుండా చూసుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా వ్యవహరించిన బట్లర్ ఆ జట్టుకు ట్రోఫీ అందించిపెట్టాడు.

జోస్ బట్లర్ తర్వాత ఐపీఎల్ అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో లియామ్ లివింగ్ (Liam Livingstone) స్టోన్ ఉన్నాడు. 14 మ్యాచ్‌లు ఆడిన లివింగ్‌స్టోన్ 34 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత వరుసగా ఆండ్రీ రసెల్(Andre Russell), కేఎల్ రాహుల్(KL Rahul), సంజూ శాంసన్(Sanju Samson) ఉన్నారు. రసెల్ 14 మ్యాచుల్లో 32, రాహుల్ 15 మ్యాచుల్లో 30, శాంసన్ 17 మ్యాచుల్లో 26 సికర్లు కొట్టారు.

Updated Date - 2022-12-25T14:54:48+05:30 IST