Cristiano Ronaldo: సౌదీ అరేబియా క్లబ్‌తో రొనాల్డో కళ్లు చెదిరే ఒప్పందం.. మూడేళ్లకు ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం ఖాయం!
ABN , First Publish Date - 2022-12-31T20:02:10+05:30 IST
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌తో ఇటీవల తెగదెంపులు చేసుకున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తాజాగా సౌదీ అరేబియా(Saudi Arabia)కు చెందిన
రియాద్: ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌తో ఇటీవల తెగదెంపులు చేసుకున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తాజాగా సౌదీ అరేబియా(Saudi Arabia)కు చెందిన అల్ నజర్(Al Nassr )తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏడాదికి 200 మిలియన్ యూరోల (దాదాపు 1700 కోట్లు) వేతనంతో ఈ ఒప్పందం కుదిరినట్టు క్లబ్ ప్రకటించింది. రొనాల్డో తన జెర్సీని పట్టుకున్నఫొటోలను అల్ నజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఒప్పందం ప్రకారం 37 ఏళ్ల రొనాల్డో జూన్ 2025 వరకు అల్ నజర్ జట్టుకు ఆడతాడు. ఒప్పందం విలువ మొత్తంగా 500 మిలియన్ యూరోలు. ఈ మూడు సంవత్సరాలకు గాను రొనాల్డో మొత్తంగా రూ. 4,400 కోట్లకు పైగా వేతనం అందుకోనున్నాడు. ఫుట్‌బాల్ చరిత్రలోనే ఇంతపెద్ద మొత్తం అందుకున్న తొలి ఆటగాడిగా రొనాల్డో రికార్డులకెక్కనున్నాడు.
ఈ సందర్భంగా రొనాల్డో మాట్లాడుతూ.. మరో దేశంలో కొత్త ఫుట్‌బాల్ లీగులో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. జట్టు సహచరులతో కలవబోతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. తామందరం కలిసి జట్టుగా గొప్ప విజయాలు అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. గతంలో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున నాలుగేళ్లు ఆడిన రొనాల్డో ఆ తర్వాత రియల్ మాడ్రిడ్, జువెంటస్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 14 సంవత్సరాల తర్వాత గతేడాది (2021లో) మాంచెస్టర్‌తో తిరిగి చేతులు కలిపినప్పటికీ ఆ బంధం ఎంతోకాలం నిలవలేదు.
కాగా, అల్ నజర్ జట్టు 9 సార్లు సౌదీ అరేబియా లీగ్ టైటిళ్లను సొంతం చేసుకుంది. ఇటీవల ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ (Fifa World Cup)లో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు క్వార్టర్స్‌లో మొరాకో చేతిలో ఓడి ఇంటి ముఖం పట్టింది. ఓటమిని జీర్ణించుకోలేని రొనాల్డో కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
రొనాల్డో 2008, 2014, 2016, 2017, 2018లలో ఐదు చాంపియన్స్ లీగ్ టైటిళ్లు అందుకున్నాడు. 2019, 2020లో ఇటలీలో జువెంటస్‌తో, 2012, 2017లో స్పెయిన్‌లో రియల్ మాడ్రిడ్‌తో, 2007, 2008, 2009లో ఇంగ్లండ్‌లో యునైటెడ్‌తో లీగ్ టైటిళ్లు అందుకున్నాడు.