ఐపీఎల్‌ రెఫరీగా ఎంపికైన తొలి తెలుగు వ్యక్తిగా డేనియల్ మనోహర్

ABN , First Publish Date - 2022-03-23T02:08:59+05:30 IST

టీమిండియా మాజీ ఆటగాడు డేనియల్‌ మనోహర్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అదరగొడుతున్నాడు

ఐపీఎల్‌ రెఫరీగా ఎంపికైన తొలి తెలుగు వ్యక్తిగా డేనియల్ మనోహర్

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ క్రికెటర్  డేనియల్‌ మనోహర్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అదరగొడుతున్నాడు. క్రికెటర్‌గా 2008లో రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ హైదరాబాదీ ఆ తర్వాత మ్యాచ్‌ రెఫరీగా కొత్త పాత్రలోకి ప్రవేశించాడు. తాజాగా ఐపీఎల్‌ రెఫరీ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తిగా ఘనత సాధించాడు. ఈనెల 28వ తేదీన గుజరాత్‌ లయన్స్‌-లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరగనున్న టీ20.. ఐపీఎల్‌ రెఫరీగా డేనియల్‌కు తొలి మ్యాచ్‌. 


రంజీల్లో 1997లో కర్టాటకపై అరంగేట్రం చేసిన డేనియల్‌ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టి సంచలనం సృష్టించగా తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ మొత్తం మీద 8 సెంచరీలతో కలిపి 4 వేలకు పైగా పరుగులు చేశాడు. క్రికెటర్‌గా మంచి ప్రతిభవంతుడైనా జాతీయ జట్టుకు ఆడేందుకు పెద్దగా  అవకాశాలు రాలేదు. అయితే, క్రికెటంటే మక్కువతో మైదానానికి దూరం కాలేక.. రిటైరయ్యాక రెఫరీగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు.


హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ 2014లో రెఫరీగా డేనియల్‌ పేరును సిఫార్సు చేసింది. ఆ తర్వాత జరిగిన అధికారిక రెఫరీ పరీక్షలో ఉత్తీర్ణుడై బీసీసీఐ ప్యానెల్‌లో చేరిన డేనియల్‌ ఇప్పటివరకు 88 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో బాధ్యతలు నిర్వహించాడు. సోమవారం ముంబైలో ఏర్పాటు చేసిన ఐపీఎల్‌ బయోబబుల్‌లో డేనియల్‌ చేరాడు. కెరీర్‌లో క్రికెటర్‌గా సాధించలేని పేరు ప్రఖ్యాతులు రెఫరీగా మారక రావడం పట్ల డేనియల్‌ హర్షం వ్యక్తం చేశాడు.


‘టీ20ల్లో ఎక్కువ శాతం హైఓల్టేజ్‌ మ్యాచలే ఉంటాయి. స్లోఓవర్‌ రేట్‌, స్టార్‌డమ్‌ ఉన్న అంతర్జాతీయ ప్లేయర్లతో మైదానంలో ఒక్కోసారి చిన్నపాటి వివాదాలను జరుగుతుంటాయి. రెఫరీగా బాధ్యతలు నిర్వహించడం ఒక విధంగా సవాలే. అయితే, నియమ నిబంధనలపై పూర్తిగా పట్టుంటే ఎంతటి ఒత్తిడినైనా, సమస్యనైనా అధిగమించవచ్చు’ అని డేనియల్‌ చెప్పాడు

Updated Date - 2022-03-23T02:08:59+05:30 IST