India vs Zimbabwe : జింబాబ్వేతో జర జాగ్రత్త!
ABN , First Publish Date - 2022-11-06T05:54:28+05:30 IST
తాజా టీ20 వరల్డ్‌క్‌పలో ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. పసికూనలనుకున్న జట్లు కొట్టిన దెబ్బకు పటిష్ట జట్లు కూడా ఫలితం
నేడు భారత్ కీలక పోరు
విజయం సాధిస్తే సెమీస్‌కు
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి..
మెల్‌బోర్న్: తాజా టీ20 వరల్డ్‌క్‌పలో ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. పసికూనలనుకున్న జట్లు కొట్టిన దెబ్బకు పటిష్ట జట్లు కూడా ఫలితం అనుభవించాయి. అందుకే.. ఆదివారం జింబాబ్వేతో ఆడనున్న అత్యంత కీలక మ్యాచ్‌కు భారత్ పూర్తి స్థాయిలో సిద్ధం కాబోతోంది. మామూలుగానైతే పెద్దగా అందరి దృష్టిని ఆకర్షించని ఈ మ్యాచ్‌ను ఇప్పుడు అభిమానులు ఉత్కంఠగా తిలకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. సెమీ్‌సలో ప్రవేశించేందుకు రోహిత్ సేనకున్న చివరి అవకాశం ఇదే. పొట్టి వరల్డ్‌క్‌పల్లో ఈ రెండు జట్లు తలపడడం ఇదే తొలిసారి. అంతేకాదు.. 2016 తర్వాత ఇప్పుడే టీ20 మ్యాచ్ ఆడబోతున్నాయి. ఇక గ్రూప్-2లో పాక్‌కు షాక్ ఇచ్చినట్టుగానే భారత్‌కు కూడా తమ సత్తా చూపాలని జింబాబ్వే భావిస్తోంది. అటు స్థాయికి తగ్గ ప్రదర్శనతో నేటి మ్యాచ్‌లో భారత్ కసిదీరా చెలరేగాలని అంతా కోరుకుంటున్నారు.
పవర్‌ప్లేలో మెరుగైతేనే..: భారత్ ఆడిన నాలుగు గ్రూప్ మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లను ఆఖరి ఓవర్‌లో గెలిచి ఊపిరి పీల్చుకుంది. దక్షిణాఫ్రికాపై చిత్తయ్యింది. నెదర్లాండ్స్‌పై మాత్రమే సత్తా చూపింది. ఈ అన్ని మ్యాచ్‌ల్లోనూ పవర్‌ప్లేలో జట్టు ప్రదర్శన ఘోరంగా ఉంది. బంగ్లాపై చేసిన 37 పరుగులే అత్యధికం. దీనికి కారణం ఓపెనింగ్‌లో నిలకడ లేకపోవడమే. రాహుల్, రోహిత్ మధ్య ఒక్కసారి కూడా అర్ధ శతక భాగస్వామ్యం నమోదు కాలేదు. దీంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అలాగే ఫామ్‌లో ఉన్న విరాట్, సూర్యకుమార్‌లకు అండగా నిలిచేవారు కనిపించడం లేదు. హార్దిక్ పాక్‌పై మాత్రమే మెరుగ్గా ఆడాడు. దినేశ్ కార్తీక్ ఇప్పటి వరకు 14 పరుగులు మాత్రమే చేశాడు. వీరంతా ఎదురుదాడికి దిగితేనే ఫలితం ఉంటుంది. ఇక జింబాబ్వేలో నలుగురు ఎడమచేతి బ్యాటర్లు ఉండడంతో ఈసారి కూడా అక్షర్‌ను పక్కనబెట్టి హుడాకు అవకాశం ఇవ్వొచ్చు. పేసర్లు భువనేశ్వర్, షమి, అర్ష్‌దీప్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం.
రజాపైనే భారం: పాకిస్థాన్‌పై గెలుపుతో ఏ జట్టునైనా ఓడించగలమనే ఆత్మవిశ్వాసంతో జింబాబ్వే కనిపిస్తోంది. అటు ద్వైపాక్షిక సిరీ్‌సల కోసం 20 ఏళ్లుగా జింబాబ్వే జట్టు భారత పర్యటనకు రాలేకపోయింది. అలాగే కొన్నేళ్ల తర్వాత టీమిండియా పూర్తి స్థాయి జట్టుతో ఆడే అవకాశం ఈ టీమ్‌కు లభించనుంది. కాబట్టి స్టార్ బ్యాటర్లకు తమ బౌలింగ్ పదునేంటో చూపాలనుకుంటోంది. అయితే బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించలేకపోవడం ఫలితంపై ప్రభావం చూపనుంది. ఆల్‌రౌండర్ సికిందర్ రజా, కెప్టెన్ ఇర్విన్, షాన్ విలియమ్స్ కీలక ఆటగాళ్లు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్, దినేశ్ కార్తీక్, అక్షర్/హుడా, అశ్విన్, భువనేశ్వర్, షమి, అర్ష్‌దీప్.
జింబాబ్వే: మధెవెరె, ఇర్విన్(కెప్టెన్), చకబ్వ, విలియమ్స్, రజా, షుంబా, బుర్ల్, జోంగ్వే, ఎన్‌గరవ, చటారా, ముజరబాని.
గెలిస్తే సరి.. మరి ఓడితే!
ఆదివారం జరిగే మూడు మ్యాచ్‌లతో గ్రూప్-2 సెమీస్ బెర్త్‌లు ఖరారవుతాయి. ఉదయం జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా.. మధ్యాహ్నం జింబాబ్వేపై భారత్ గెలిస్తే ఈ రెండు జట్లు నేరుగా సెమీ్‌సలో ప్రవేశిస్తాయి. అప్పుడు పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్‌పై గెలిచినా ఫలితం లేదు. ఒకవేళ అనూహ్య పరిస్థితుల్లో భారత్ ఓడితే.. అది పాక్‌కు వరంగా మారుతుంది. ఆ జట్టు బంగ్లాపై గెలిస్తే మెరుగైన రన్‌రేట్‌తో భారత్‌ను వెనక్కినెట్టి సెమీస్‌కు వెళుతుంది. ఇక భారత్ ఓడినంతమాత్రాన ఆశలు పూర్తిగా ఆవిరైపోవు. అందుకు ఓ అద్భుతం జరిగి సఫారీలకు నెదర్లాండ్స్ షాకివ్వాల్సి ఉంటుంది. అది కష్టమే కాబట్టి.. రోహిత్ సేన చక్కటి విజయంతో గ్రూప్‌ను ముగించాలని కోరుకుందాం.