India vs Zimbabwe: ఇండియా-జింబాబ్వే మధ్య కీలకపోరు.. వర్షంపై వాతావరణశాఖ ఏం చెబుతోందంటే?
ABN , First Publish Date - 2022-11-05T18:49:06+05:30 IST
టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం మూడు కీలక మ్యాచ్‌లు జరగబోతున్నాయి. సెమీస్ బెర్త్‌ను నిర్ణయించే
మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం మూడు కీలక మ్యాచ్‌లు జరగబోతున్నాయి. సెమీస్ బెర్త్‌ను నిర్ణయించే ఈ పోరులో సౌతాఫ్రికా-నెదర్లాండ్స్, పాకిస్థాన్-బంగ్లాదేశ్, భారత్-జింబాబ్వే జట్లు తలపడతాయి. గ్రూప్-1లో ఇప్పటికే న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక తేలాల్సింది గ్రూప్-2లోనే. కాబట్టి ఆదివారం నాటి మ్యాచ్‌లకు ప్రాధాన్యం ఏర్పడింది. గ్రూప్-2లో ఇండియా (team india) ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కాబట్టి జింబాబ్వే(zimbabwe)పై విజయం సాధించే ఎలాంటి అవాంతరాలు లేకుండా భారత జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. అయితే, జింబాబ్వే చిన్న జట్టు అని తీసిపారేయడం తప్పే అవుతుంది. గ్రూప్-2లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఒక్క పరుగు సాధించి ఆ జట్టు సెమీస్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. కాబట్టి రోహిత్ సేన జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.
భారత జట్టులో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో ఇరగదీస్తున్నారు కాబట్టి పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. కేఎల్ రాహుల్ కూడా గత మ్యాచ్‌లో బ్యాట్‌కు పనిచెప్పాడు. టీమిండియాకు ఇది కలిసొచ్చే అంశమే. ఇక, ఆదివారం మూడు మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ భారత్-జింబాబ్వే మ్యాచ్‌పైనే క్రికెట్ అభిమానులు దృష్టి సారించారు. ఆదివారం అక్కడ వర్షం పడే అవకాశాలున్నాయని వార్తలు రావడమే అందుకు కారణం. వర్షం కారణంగా భారత్-జింబాబ్వే మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు ఏడు పాయింట్లతో భారత్ సెమీస్ చేరుతుంది.
మెల్‌బోర్న్‌లో ఆదివారం వర్షం పడే అవకాశం ఉందన్న వార్తలపై వాతావరణశాఖ స్పందించింది. వాతావరణం మేఘావృతమై ఉంటుందని, వర్షం పడే అవకాశాలు 50 శాతం మాత్రమేనని పేర్కొంది. అలాగే, తేలికపాటి గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. ఉత్తర, ఈశాన్య శివారు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం 30 శాతమేనని తెలిపింది. ఉదయం వేళ 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మధ్యాహ్నానికి గాలులు వేగం తగ్గుతుందని వివరించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంటే ఆ సమయంలో వర్షం పడే అవకాశాలు అంతంత మాత్రమే. అయితే, ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమ రాత్రి 11 గంటలకు 77 శాతం వరకు ఉంటుందని, ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలకు పడిపోతాయని వాతావరణశాఖ తెలిపింది. వాతావరణశాఖ చెబుతున్న దాని ప్రకారం భారత్-జింబాబ్వే మ్యాచ్ జరిగేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి.