Kane Williamson: కీలక మ్యాచ్‌కు ముందు కివీస్‌కు ఎదురుదెబ్బ.. చివరి టీ20కి కెప్టెన్ దూరం
ABN , First Publish Date - 2022-11-21T17:04:47+05:30 IST
టీమిండియాతో కీలక మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ (New Zealand)కు ఎదురుదెబ్బ తగిలింది. మూడు మ్యాచ్‌ల
నేపియర్: టీమిండియాతో కీలక మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ (New Zealand)కు ఎదురుదెబ్బ తగిలింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మౌంట్ మాంగనూయిలో ఆదివారం (20న) జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో టీ20 22న మంగళవారం నేపియర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా (Team India) విజయం సాధిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. కివీస్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా సిరీస్‌ను సమయం చేయాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఒత్తిడి కూడా ఆ జట్టుపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) జట్టుకు దూరం కావడం కివీస్‌కు ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి.
ఇప్పటికే తీసుకున్న ముందుస్తు మెడికల్ అపాయింట్‌మెంట్ నేపథ్యంలో కేన్ ఈ మ్యాచ్‌కు దూరమవుతున్నట్టు ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. మంగళవారం నాటి మ్యాచ్‌కు కేన్ దూరమవుతుండడంతో జట్టుకు టిమ్ సౌథీ (Tim Southee) సారథ్యం వహిస్తాడని పేర్కొన్నాడు. ఇక, విలియమ్సన్ స్థానాన్ని మార్క్ చాప్‌మన్ భర్తీ చేయనున్నాడు. కేన్ ఇప్పటికే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నాడని, దురదృష్టవశాత్తు రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని గ్యారీ పేర్కొన్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు విలియమ్సన్ తిరిగి అందుబాటులోకి వస్తాడని వివరించాడు. అయితే, అతడి మోచేతి గాయానికి ఈ అపాయింట‌్‌మెంట్‌కు ఎలాంటి సంబంధమూ లేదన్నాడు.
టీ20ల్లో విలియమ్సన్ ఫామ్ గత కొంతకాలంగా ఆందోళనకంగా ఉంది. ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకున్నప్పటికీ విలియమ్సన్ మాత్రం ఈ సిరీస్‌లో 116.33 స్ట్రైక్ రేట్‌తో 178 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 93.51 స్ట్రైక్ రేటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈసారి అతడి ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని వదిలించుకుంది.