Rishabh Pant accident: రిషబ్ పంత్ బ్రెయిన్, వెన్నెముక ఎంఆర్‌ఐ స్కానింగ్ రిపోర్ట్స్ వెల్లడి.. ఏం తేలిందంటే..

ABN , First Publish Date - 2022-12-31T11:36:39+05:30 IST

శుక్రవారం తెల్లవారుజామున రూర్కీకి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Rishabh Pant accident) నుంచి టీమిండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.

Rishabh Pant accident: రిషబ్ పంత్ బ్రెయిన్, వెన్నెముక ఎంఆర్‌ఐ స్కానింగ్ రిపోర్ట్స్ వెల్లడి.. ఏం తేలిందంటే..

ముంబై: శుక్రవారం తెల్లవారుజామున రూర్కీకి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Rishabh Pant accident) నుంచి టీమిండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అతడికి నిర్వహించిన పలు టెస్టుల రిపోర్టులు తాజాగా వెల్లడయ్యాయి. మెదడు (Brain), వెన్నెముకల (spine) ఎంఆర్‌ఐ స్కానింగ్‌ రిపోర్టులు సాధారణంగా వచ్చాయని, ఎలాంటి సమస్య లేదని వైద్యులు వెల్లడించారు. ముఖం, శరీరంపై ఇతర పగిలిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ (Plastic surgery) నిర్వహించినట్టు తెలిపారు. వాపు, నొప్పి ఉండడంతో చీలమండ, మోకీలుకు శనివారం స్కానింగ్ చేయనున్నట్టు డెహ్రాడున్‌లోని మ్యాక్స్ హాస్పిటల్ వైద్యులు వవివరించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసినట్టు ఈఎస్‌పీఎన్‌‌క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. కాగా బీసీసీఐ ఎప్పటికప్పుడు పంత్ ఆరోగ్యం గురించి వాకబు చేస్తోంది. పంత్ కుటుంబ సభ్యులతో వైద్యుులతో ఫోన్‌లో వివరాలు అడిగి తెలుసుకుంటోంది. కాగా పంత్‌ నుదురు భాగం చిట్లినట్లయిందనీ, 2 చోట్ల చర్మం తెగిందని, వీపుపై కాలిన గాయాలున్నాయనీ, కుడి మోకాలి లిగ్మెంట్‌ కదిలినట్లు ఎక్స్‌రేలో వెల్లడైందని బీసీసీఐ కార్యదర్శి జై షా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వీటితో పాటు కుడిచేతి మణికట్టు, కుడికాలి చీలమండ, పాదానికి కూడా గాయాలయ్యాయని తెలిపిన విషయం తెలిసిందే.

పాపం.. అమ్మను సర్‌ప్రైజ్‌ చేద్దామనుకుంటే..

వచ్చే నెల ప్రారంభంలో శ్రీలంకతో జరగనున్న టి20, వన్డే సిరీస్‌లకు పంత్‌ ఎంపిక కాలేదు. దీంతో విరామం దొరికింది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు అకస్మాత్తుగా ఊరెళ్లి కుటుంబ సభ్యులను ఆశ్చర్యంలో ముంచెత్తుదామని పంత్ భావించాడు. ఆ ఉద్దేశంతోనే బయలుదేరగా.. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఢిల్లీ-డెహ్రాడూన్‌ హైవేపై ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లా మంగ్లూర్‌ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ‘మా ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు పంత్‌ పూర్తి స్పృహలోనే ఉన్నాడు. అతడితో నేను మాట్లాడా. అమ్మను సర్‌ప్రైజ్‌ చేద్దామని మా ఇంటికి బయల్దేరా అని చెప్పాడు’ అని రూర్కీలోని స్థానిక ఆస్పత్రిలో పంత్‌కు వైద్యం చేసిన డాక్టర్‌ సుశీల్‌ నగర్‌ తెలిపాడు. కాగా, పంత్‌ వైద్యానికయ్యే ఖర్చులన్నీ తమ ప్రభుత్వం భరిస్తుందని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి తెలిపారు. అతడికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించామని వెల్లడించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన పంత్‌.. ఆ రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా.. పంత్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ, మాజీ క్రికెటర్లు సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు ప్రార్థించారు.

Updated Date - 2022-12-31T11:42:53+05:30 IST