సూర్య @ నెం. 1

ABN , First Publish Date - 2022-11-03T05:17:56+05:30 IST

ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లోనున్న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రతిభకు ప్రతిఫలం దక్కింది. బుధవారం విడుదలైన ఐసీసీ..

సూర్య  @ నెం. 1
Star batter Suryakumar Yadav

టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం

కోహ్లీ తర్వాత రెండో భారత బ్యాటర్‌గా రికార్డు

దుబాయ్‌: ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లోనున్న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రతిభకు ప్రతిఫలం దక్కింది. బుధవారం విడుదలైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య అగ్రపీఠాన్ని అధిరోహించాడు. బ్యాటర్ల జాబితాలో ఇప్పటిదాకా అగ్రస్థానంలోనున్న పాకిస్థాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను వెనక్కి నెట్టేశాడు. నిన్నటిదాకా రెండోస్థానంలో కొనసాగిన 32 ఏళ్ల సూర్య.. ఇప్పుడు 863 ర్యాంకింగ్‌ పాయింట్లతో నెంబర్‌వన్‌గా నిలిచాడు. దీంతో టీ20 బ్యాటర్లలో టాప్‌ ర్యాంక్‌ను దక్కించుకున్న రెండో భారత క్రికెటర్‌గా సూర్య రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2014 సెప్టెంబరులో విరాట్‌ కోహ్లీ 897 ర్యాంకింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

ప్రస్తుత ప్రపంచక్‌పలో సూర్య.. నెదర్లాండ్స్‌ (51), దక్షిణాఫ్రికా (68) జట్లపై కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక, 842 పాయింట్లతో రిజ్వాన్‌ రెండో ర్యాంక్‌కు పడిపోగా.. న్యూజిలాండ్‌ స్టార్‌ డెవాన్‌ కాన్వే (792) మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. కోహ్లీ (638) 10వ ర్యాంక్‌తో టాప్‌టెన్‌లో కొనసాగుతున్నాడు. బౌలర్లలో భువనేశ్వర్‌ 11వ ర్యాంక్‌లో ఉండగా.. అశ్విన్‌ 18వ, అర్ష్‌దీప్‌ 27వ, అక్షర్‌ పటేల్‌ 29వ స్థానాల్లో నిలిచారు. అఫ్ఘానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ టాప్‌లో, శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ రెండో ర్యాంకులో ఉన్నారు.

Updated Date - 2022-11-03T05:17:57+05:30 IST