Virat Kohli: టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ మరో రికార్డు
ABN , First Publish Date - 2022-10-27T19:24:21+05:30 IST
టీమిండియా మాజీ సారథి, పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో ఘనత సాధించాడు.
సిడ్నీ: టీమిండియా మాజీ సారథి, పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ (T20 World Cup) చరిత్రలో రెండో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును బద్దలుగొట్టాడు. టీ20 ప్రపంచకప్ సూపర్-12, గ్రూప్-2లో భాగంగా నేడు (గురువారం) సిడ్నీ గ్రౌండ్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ(Virat Kohli Records) ఈ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 44 బంతుల్లో 62(నాటౌట్) పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ పరుగులతో కలుపుకుని టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ సాధించిన పరుగుల సంఖ్య 989 పరుగులకు చేరుకుంది. మొత్తం 23 మ్యాచుల్లో 21 ఇన్నింగ్స్‌లలో 89.90 సగటుతో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ మొత్తం స్కోరులో 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 89 నాటౌట్.
టీ20 ప్రపంచకప్‌లలో కోహ్లీ 2014 (319 పరుగులు), 2016(273 పరుగులు)లలో ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్’ సాధించాడు. రెండుసార్లు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అందుకున్న తొలి ఆటగాడు కోహ్లీనే. కాగా, విండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ 33 మ్యాచుల్లోని 31 ఇన్నింగ్స్‌లలో 34.46 సగటుతో 965 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 117 పరుగులు. ఇప్పుడీ రికార్డును కోహ్లీ తుడిచిపెట్టేశాడు.
ఇక టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే పేరున ఉంది. జయవర్ధనే 39.07 సగటుతో 11,016 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలున్నాయి. అత్యుత్తమ స్కోరు 100 పరుగులు.