T20 World Cup :అడిలైడ్‌లో అల్లాడారు
ABN , First Publish Date - 2022-11-11T03:22:25+05:30 IST
అడిలైడ్‌లో అల్లాడారు తాజా టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తమ ప్రస్థానాన్ని ముగించింది. ఇంగ్లండ్ చేతిలో
పది వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు
బాదేసిన బట్లర్, హేల్స్
ఫైనల్లో ఇంగ్లండ్
పాకిస్థాన్‌తో అమీతుమీ
న్యూజిలాండ్‌పై గెలిచి పాకిస్థాన్
ఫైనల్లోకి వెళ్లగానే ఇంకేం.. 2007 తర్వాత మరోసారి దాయాది జట్ల మధ్య అంతిమ సమరమే.. అంటూ కోట్లాది భారతీయులు ఊహల్లో తేలిపోయిన వేళ.. అడిలైడ్‌లో టాస్ గెలిచిన ఏ టీ20 జట్టూ ఇప్పటిదాకా గెలవలేదు కాబట్టి అది కూడా శుభ శకునమే అని ఊరట చెందిన వేళ..
అసలు ప్రత్యర్థి మనకు పోటీనే కాదంటూ అంతా ఇంగ్లండ్‌ను తేలిగ్గా తీసుకున్న వేళ.. ఇక మనదే గెలుపు అని ఆశగా ఎదురుచూసిన భారత అభిమానులకు.. మైండ్ బ్లాంక్ అయ్యే రీతిలో షాక్ తగిలింది. ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ ఇద్దరే సాధించిన విధ్వంసం టీమిండియా ఫైనల్ ఆశలను చిదిమేసింది. అటు ఒక్క వికెట్ కూడా తీయలేని భారత బౌలర్ల వైఫల్యం జట్టును దారుణంగా దెబ్బతీసింది.
అడిలైడ్: తాజా టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తమ ప్రస్థానాన్ని ముగించింది. ఇంగ్లండ్ చేతిలో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో 2007 తర్వాత మరో కప్ గెలవాలనే కోరిక ఈసారీ కలగానే మిగిలింది. 169 పరుగుల ఛేదనను ఓపెనర్లు హేల్స్ (47 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 86 నాటౌట్), బట్లర్ (49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 నాటౌట్) అజేయ అర్ధసెంచరీలతో పూర్తి చేశారు. ఈ ఫలితంతో ఇంగ్లండ్-పాక్ మధ్య ఆదివారం ఫైనల్ జరుగబోతోంది. అలాగే 1992 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఇరు జట్లు ఓ ఐసీసీ తుది పోరులో తలపడబోతున్నాయి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు సాధించింది. హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63), విరాట్ కోహ్లీ (40 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్‌తో 50) మాత్రమే రాణించారు. జోర్డాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా హేల్స్ నిలిచాడు.
ఆ ఇద్దరే..: ‘పాకిస్థాన్‌తో ఫైనల్ ఆడాలంటే ముందు భారత జట్టు మమ్మల్ని ఓడించాలిగా..’ అంటూ సెమీ్‌సకు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ ధీమాగా చేసిన కామెంట్స్ గుర్తున్నాయిగా.. బరిలోకి దిగాక అన్నంత పనీ చేశాడు. నిజానికి ఈ పిచ్‌పై 169 పరుగులు సవాల్ విసిరే లక్ష్యమే. అలాగే భారత జట్టు సెమీస్ వరకు రావడానికి పదునైన బౌలింగే ముఖ్యం కారణం. దీంతో కచ్చితంగా లక్ష్యాన్ని కాపాడుకుంటుందనే అంతా భావించారు. కానీ అసలైన మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చిన బట్లర్.. అలెక్స్ హేల్స్‌తో కలిసి చెడుగుడు ఆడాడు. దీంతో భారత బ్యాటర్లు ఆడిన పిచ్‌కు ఈ జోడీ ఆడిన పిచ్‌కు సంబంధమే లేనట్టుగా అనిపించింది. బంతి నేరుగా బ్యాట్ మీదకు రావడంతో ఓపెనర్లు పరుగుల పండగ చేసుకున్నారు. అసలు ఏ దశలోనూ వీరు ఇబ్బందిపడినట్టు కనిపించలేదు. అశ్విన్, అక్షర్ ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. తొలి ఓవర్‌లోనే బట్లర్ మూడు ఫోర్లు సాధించాడు. ఆ తర్వాత అతడిని అధిగమిస్తూ హేల్స్ అద్భుత సిక్సర్లతో హోరెత్తించాడు. పవర్‌ప్లేలోనే 63 పరుగులు సాధించిన ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితాన్ని చూచాయగా చెప్పింది. 28 బంతుల్లోనే హేల్స్ మొదట ఫిఫ్టీ సాధించాడు. అటు వరుసగా ఫోర్, సిక్స్‌తో బట్లర్ 37 బంతుల్లో ఈ ఫీట్ పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత తను 14వ ఓవర్‌లో 4,6,4తో మరింతగా చెలరేగాడు. 66 రన్స్ వద్ద బట్లర్ క్యాచ్‌ను సూర్యకుమార్ అందుకోలేకపోయినా అప్పటికే జట్టు విజయం ఖాయమైంది. చివరికి 16వ ఓవర్ ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచిన కెప్టెన్ బట్లర్ జట్టును ఫైనల్లోకి చేర్చడంతో ఇంగ్లండ్ సంబరాల్లో మునిగింది.
హార్దిక్, కోహ్లీ పోరాడినా..: ప్రత్యర్థి ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగితే.. అంతకుముందు టీమిండియా ఓపెనర్లు ఎప్పటిలాగే నిరాశపరిచారు. చిన్న జట్లపై వరుసగా రెండు అర్ధసెంచరీలు చేసిన రాహుల్ (5) రెండో ఓవర్‌లోనే అవుటై నిరాశపరిచాడు. ఇక రోహిత్ (27) తొమ్మిదో ఓవర్ వరకు క్రీజులో ఉన్నా అతడి ఆటలో ఆత్మవిశ్వాసం కనిపించలేదు. ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ (14) ఓ సిక్సర్‌తో ఆహా.. అనిపించినా చక్కటి వ్యూహంతో అతడిని స్పిన్నర్ రషీద్ కట్టడి చేశాడు. ఈ దశలో పంత్‌కన్నా ముందే బరిలోకి దిగిన హార్దిక్.. కోహ్లీతో జత కలిశాడు. ఈ ఇద్దరూ సమన్వయ ఆటతీరుతో స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఆరంభంలో పాండ్యా కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేసినా ఆ తర్వాత మాత్రం చెలరేగాడు. 15 ఓవర్లలో అతికష్టమ్మీద జట్టు స్కోరు వందకు చేరింది. డెత్ ఓవర్లలో మాత్రం పాండ్యా ఆధిపత్యం చూపాడు. 18వ ఓవర్‌లో పాండ్యా రెండు సిక్సర్లు బాదగా అదే ఓవర్‌లో కోహ్లీ అర్ధసెంచరీ పూర్తి చేసి మరుసటి బంతికే అవుటయ్యాడు. ఇక 19వ ఓవర్‌లో పంత్ (6) ఓ ఫోర్‌తో పాటు పాండ్యా వరుసగా 4,6,4తో 20 పరుగులు వచ్చాయి. అలాగే 29 బంతుల్లో హార్దిక్ పాండ్యా కూడా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక చివరి ఓవర్‌లో పంత్ రనౌట్ కాగా, పాండ్యా 6,4 సాధించి ఆఖరి బంతికి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అతడి జోరుతో భారత్ చివరి ఐదు ఓవర్లలో 68 పరుగులు సాధించింది.
1 టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ వికెట్‌కైనా హేల్స్-బట్లర్‌దే అత్యధిక భాగ స్వామ్యం (170).
1 టీ20 ప్రపంచక్‌పలో రెండుసార్లు పది వికెట్ల తేడాతో ఓడిన తొలి జట్టుగా భారత్. గతేడాది పాక్ చేతిలోనూ ఇలాగే చిత్తయ్యింది.
3 అంతర్జాతీయ టీ20ల్లో వికెట్ నష్టపోకుండా మూడో అత్యధిక ఛేదనను ముగించిన ఇంగ్లండ్. పాక్ (200), కివీస్ (170) ముందున్నాయి.
పడిపోయిన ‘ఫైనల్’ టిక్కెట్ రేట్లు
సెమీ్‌సలో టీమిండియా ఓటమితో వరల్డ్‌కప్ ఫైనల్ క్రేజ్ కూడా పడిపోయింది. ఆదివారం మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరిగే టైటిల్ ఫైట్ మ్యాచ్ టిక్కెట్ల రేట్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. చిరకాల ప్రత్యర్థులు ఇండో-పాక్ మధ్య హైవోల్టేజ్ ఫైనల్ జరుగుతుందని ఆశించిన క్రికెట్ ఫ్యాన్స్.. రోహిత్ సేన పరాజయంతో నీరుగారిపోయారు.
రోహిత్ కంట కన్నీరు
గెలుపోటములను ఎంతో హుందాగా స్వీకరించే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అతడు డగౌట్‌లో కూర్చున్న సమయంలో.. పరాభవాన్ని తట్టుకోలేక కళ్లు చెమర్చడం అందరినీ కలచి వేసింది. విషణ్ణ వదనంతో ఉన్న కోచ్ రాహుల్ ద్రవిడ్.. రోహిత్, జట్టు సభ్యులను ఓదార్చుతూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అయింది.
పాక్ ప్రధాని అల్ప బుద్ధి!
సెమీ్‌సలో దారుణ ఓటమితో.. భారతీయుల హృదయాలు బరువెక్కిన సమయంలో.. పాకిస్థాన్ తన వికృతానందాన్ని బయటపెట్టింది. ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ తన స్థాయిని కూడా మరచిపోయి.. టీమిండియాను హేళన చేసే విధంగా ‘ఈ ఆదివారం 152/0 వర్సెస్ 170/0’ అని ట్వీట్ చేశాడు. గత టీ20 వరల్డ్‌క్‌పలో 151 పరుగులు చేసిన భారత్‌ను పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో చిత్తు చేయగా.. ఇప్పుడు ఇంగ్లండ్ మరోసారి 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ రెండు సందర్భాలను గుర్తు చేసే విధంగా ట్వీట్ చేసిన షరీఫ్ తన అల్పబుద్ధిని చాటుకున్నాడు. గాయపడిన హృదయాలతో ఉన్న భారతీయులు.. ఈ ట్వీట్‌పై భగ్గుమంటున్నారు.
పాండ్యాకు కెప్టెన్సీ: గవాస్కర్
అడిలైడ్: ఇంగ్లండ్‌తో సెమీ్‌సలో పరాజయంతో భారత జట్టులో పలు మార్పు చేర్పులు చోటుచేసుకోనున్నాయని సునీల్ గవాస్కర్ అన్నాడు. ‘సారథిగా తొలిసా రే తన జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించి హార్దిక్ సత్తా నిరూపించుకున్నాడు. భవిష్యత్‌లో అతడు తప్పకుండా టీమిండియా కెప్టెన్‌గా నియమితుడవుతాడు. అలాగే 30 ఏళ్ల వయస్సులో ఉన్న కొందరు ఆటగాళ్లు టీ20ల నుంచి రిటైర్ అవుతారు’ అని సన్నీ అభిప్రాయపడ్డాడు.
స్కోరుబోర్డు
భారత్: రాహుల్ (సి) బట్లర్ (బి) వోక్స్ 5; రోహిత్ (సి) కర్రాన్ (బి) జోర్డాన్ 27; కోహ్లీ (సి) రషీద్ (బి) జోర్డాన్ 50; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) రషీద్ 14; హార్దిక్ (హిట్‌వికెట్) 63; పంత్ (రనౌట్) 6; అశ్విన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 168/6. వికెట్ల పతనం: 1-9, 2-56, 3-75, 4-136, 5-158, 6-168. బౌలింగ్: స్టోక్స్ 2-0-18-0; వోక్స్ 3-0-24-1; సామ్ కర్రాన్ 4-0-42-0; ఆదిల్ రషీద్ 4-0-20-1; లివింగ్‌స్టోన్ 3-0-21-0; జోర్డాన్ 4-0-43-3.
ఇంగ్లండ్: బట్లర్ (నాటౌ ట్) 80; హేల్స్ (నాటౌట్) 86; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170. బౌలింగ్: భువనేశ్వర్ 2-0-25-0; అర్ష్‌దీప్ 2-0-15-0; అక్షర్ 4-0-30-0; షమి 3-0-39-0; అశ్విన్ 2-0-27-0; హార్దిక్ 3-0-34-0.