T20 World Cup: టాపార్డర్ దుమ్మురేపాలి!
ABN , First Publish Date - 2022-10-27T05:06:49+05:30 IST
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సంచలన విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత్.. టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-2లో తమ రెండో మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌తో గురువారం తలపడనుంది.
రోహిత్, రాహుల్‌పైనే అందరి దృష్టి
నేడు నెదర్లాండ్స్‌తో భారత్ పోరు
మధ్యాహ్నం 12.30 నుంచి
సిడ్నీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సంచలన విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత్.. టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-2లో తమ రెండో మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌తో గురువారం తలపడనుంది. పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్లూ ఆడడం ఇదే తొలిసారి. టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. డచ్ టీమ్‌ను తేలిగ్గా తీసుకొనే అవకాశం లేదు. పాక్‌తో మ్యాచ్‌లో భారత టాపార్డర్ విఫలం కాగా.. కోహ్లీ పోరాటంతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తర్వాతి పోరులో పటిష్టమైన దక్షిణాఫ్రికాతో తలపడాల్సిన నేపథ్యంలో కెప్టెన్ రోహిత్, రాహుల్, సూర్యకుమార్‌లు ఈ మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా ఉపయోగించుకొని సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. రాహుల్ తన టెక్నిక్‌ను మెరుగుపరచుకోవాల్సి ఉండగా.. సారథిగా రాణిస్తున్న రోహిత్ ఫామ్‌ను అందిపుచ్చుకోవాలి. వీరు చెలరేగితే డచ్ బౌలర్లకు ఇక చుక్కలే. అందుకే టాస్ గెలిస్తే రోహిత్ సేన బ్యాటింగ్ ఎంచుకొని భారీస్కోరు చేసే అవకాశం ఉంది. ఇక, విరాట్ నుంచి జట్టు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. కాగా, హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిస్తారని భావించినా.. విన్నింగ్ జట్టును మార్చే అవకాశం లేదని బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పష్టం చేశాడు. దీంతో పాండ్యా, దినేష్ కార్తీక్ ఫినిషర్ పాత్రలను పోషించాల్సి ఉంటుంది. బౌలింగ్ పరంగా కొత్తబంతితో భువనేశ్వర్, అర్ష్‌దీప్ గత మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. షమీ లయను అందుకోవాల్సి ఉండగా.. డెత్ ఓవర్లలో పరుగులను కట్టడిపై దృష్టిసారించాలి. అక్షర్‌కు మరో చాన్సివ్వొచ్చు. అశ్విన్, చాహల్‌లో ఒకరిని ఆడించే అవకాశాలున్నాయి.
నిలకడైన ప్రదర్శనతో..
ఆరెంజ్ ఆర్మీ విషయానికొస్తే.. జట్టు ప్రదర్శన నిలకడగా సాగుతోంది. లీగ్ దశలో ఆకట్టుకొన్న నెదర్లాండ్స్.. సూపర్-12లో బంగ్లాదేశ్‌కు కూడా ముచ్చెమటలు పట్టించింది. ఆల్‌రౌండర్ బాస్ లి లీడ్స్ జట్టులో కీలక ఆటగాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఆడిన అనుభవం ఉండడంతో.. ఇక్కడి పిచ్‌లపై అతడికి అవగాహన ఉంది. బౌలింగ్‌లో ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్ జట్టుకు అండగా నిలుస్తున్నారు. బ్యాటింగ్‌లో కొలిన్ ఎకర్‌మెన్ ఫర్వాలేదనిపిస్తున్నా.. టాపార్డర్ సత్తా చాటాలి. కెపెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ నుంచి జట్టు మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఆస్ట్రేలియా-ఎకు ఆడిన టామ్ కూపర్‌కు కూడా విదేశీ లీగ్‌లు ఆడిన అనుభవం ఉంది.
కోహ్లీ మమ్మల్ని కరుణిస్తాడని అనుకుంటున్నా పాక్‌పై విరాట్ ఆట అద్భుతం. మా మీద అతడు అలా విరుచుకుపడడని ఆశిస్తున్నా. ఆరెంజ్ జట్టుపై పెద్దగా అంచనాలూ లేవు.. ఎటువంటి ఒత్తిడీ లేదు. అగ్రశ్రేణి జట్టయిన భారత్‌తో ఆడడమే గొప్ప అనుభూతి. ప్రత్యర్థికి దీటైన ప్రదర్శన చేసేందుకు కృషి చేస్తాం.
నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్
పిచ్/వాతావరణం
సిడ్నీ వికెట్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇదే పిచ్‌పై 200 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వాతావరణం సాధారణంగా ఉన్నా.. టాస్ సమయానికి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్, షమి, అశ్విన్/చాహల్, భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్.
నెదర్లాండ్స్: మ్యాక్స్ ఒడౌడ్, విక్రమ్ సింగ్, బాస్ డి లీడ్స్, ఎకర్‌మెన్, కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), ప్రింగిల్, టిమ్ వాండర్, క్లాసెన్, పాల్ వాన్, షరీజ్ అహ్మద్/రోలఫ్ వాండర్ మెర్వీ.