Pele: భారత్‌తోనూ పీలేకు అనుబంధం
ABN , First Publish Date - 2022-12-30T18:59:27+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాకర్ అభిమానులను విషాదంలో ముంచేస్తూ గురువారం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాకర్ అభిమానులను విషాదంలో ముంచేస్తూ గురువారం రాత్రి కన్నుమూసిన బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే(Pele )కు భారత్‌తోనూ మంచి అనుబంధం ఉంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా 2015 అక్టోబరు 11న కోల్‌కతాలో అడుగుపెట్టిన పీలేను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. కోల్‌కతా చేరుకున్న పీలే టీమిండియా మాజీ క్రికెటర్, అట్లెటికో డి కోల్‌కతా ఫుట్‌బాల్ జట్టు ఫ్రాంచైజీ సహ యజమాని అయిన సౌరవ్ గంగూలీ(Sourav Ganguly), ఫ్రాంచైజీ మరో సహ యజమాని సంజీవ్ గోయెంకా(Sanjiv Goenka)తో కలిసి అక్టోబరు12న ఫొటోలకు పోజిచ్చాడు. భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెంచడం ఎలానో చెబుతూ.. ఎదుగుతున్న పిల్లల్లో ఫుట్‌బాల్‌ను అంతర్భాగంగా చేయాలని సూచించాడు. అలాగే, ప్రతిభ చూపిస్తున్న ఆటగాళ్లకు విదేశీ కోచ్‌లతో శిక్షణ ఇప్పిస్తే వారు మరింతగా రాటుదేలుతారని సలహా ఇచ్చాడు.
ఈ సందర్భంగా పీలేకు సంజీవ్ గోయెంకా అట్లెటికా డి కోల్‌కతా(Atletico De Kolkata) జెర్సీని బహూకరించారు. అదే రోజున (అక్టోబరు 12)న క్యాంపస్‌లో విద్యార్థులతో ముచ్చటించాడు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో పది రోజుల ముందుగానే తన 75వ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)చేతిని ఈ సందర్భంగా పీలే ముద్దాడాడు. ఆ సమయంలో స్టేజిపై సౌరవ్ గంగూలీ, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్(AR Rahman) ఉన్నారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా పీలే కేక్ కట్ చేశాడు.
అలాగే, సౌరవ్ గంగూలీతో కలిసి చెట్లాలో దుర్గా పూజా పండల్‌ను పీలే సందర్శించాడు. న్యూఢిల్లీలో అక్టోబరు 16న జరిగిన సుబ్రతో కప్ సాకర్ అండర్-17 బాయ్స్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన పీలే ఓపెన్ జీపుపై అంబేద్కర్ స్టేడియం మొత్తం కలియతిరిగాడు. మ్యాచ్ సందర్భంగా చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ మార్షన్ అరూప్ రాహా.. పీలేకు ఆయన చిత్రపటాన్ని బహూకరించారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు గాలిలో ముద్దులు విసురుతూ, చేతులూపుతూ అందరినీ పలకరించారు.