తెలంగాణలో ఇక అన్నీ జాతీయ పార్టీలే!
ABN , First Publish Date - 2022-10-03T07:57:29+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే కొన్ని జాతీయ పార్టీలు ఉండడం, మరికొన్ని పార్టీలు తమకు తాము జాతీయ పార్టీలుగా ప్రకటించుకోగా..
- వైఎస్సార్‌టీపీ ఒక్కటే ప్రాంతీయ పార్టీ
- బీజేపీ, కాంగ్రెస్ సహా పలు జాతీయ పార్టీలు
- ఆ జాబితాలోకి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి
- ఆ గుర్తింపు పొందితే ఎన్నో ప్రయోజనాలు
- కొన్ని జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్నవి
- కేసీఆర్ పెట్టబోతున్న కొత్త జాతీయ పార్టీ
హైదరాబాద్, అక్టోబరు 2, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే కొన్ని జాతీయ పార్టీలు ఉండడం, మరికొన్ని పార్టీలు తమకు తాము జాతీయ పార్టీలుగా ప్రకటించుకోగా.. ఇప్పుడు మరో జాతీయ పార్టీ ఏర్పాటు కాబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక ప్రాంతీయ పార్టీగా పోరాడిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు జాతీయ పార్టీగా రూపాంతరం చెందబోతోంది. కొత్త పేరు, కొత్త అజెండాతో ముందుకొస్తోంది. ఈ పరిణామంతో తెలంగాణలో ఇక దాదాపుగా అన్ని పార్టీలూ జాతీయ పార్టీలే కానున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఇప్పటికే జాతీయ పార్టీలు కాగా, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తెలుగుదేశం లాంటి పార్టీలు జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్నవే. అంటే వీటిలో కొన్నింటికి ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వకున్నా.. అవి ఒకటికి మించిన రాష్ట్రాల్లో పోటీ చేస్తూ జాతీయ పార్టీగానే చెప్పుకొంటున్నాయి. అంటే ఇక తెలంగాణలో దాదాపుగా అన్నీ జాతీయ పార్టీలే కానున్నాయి. ఒక్క వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే ఇందుకు మినహాయింపు.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే!
జాతీయ పార్టీగా పేర్కొంటూ ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించవచ్చు. జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. పలు రాష్ట్రాల్లో పోటీ కూడా చే యవచ్చు. కానీ, వాటిని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించాలంటే మాత్రం నిర్దిష్ట అర్హతలు ఉండాల్సిందే. ఒక రిజిస్టర్డ్ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు మూడు మార్గాలున్నాయి. ఒకటి.. దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో 6శాతం ఓట్లను సంపాదించాలి. ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో గానీ, లోక్‌సభ ఎన్నికల్లో గానీ పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లు రావాలి. అంతేకాకుండా నాలుగు ఎంపీ సీట్లను కూడా గెలవాలి. రెండో మార్గం.. దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాలు గెలవాలి. ఈ రెండుశాతం సీట్లు కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి. ఇక మూడో అవకాశం.. ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండడం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడో నిబంధన ప్రకారమే జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది.
రాష్ట్రంలో పార్టీగా గుర్తింపు పొందాలంటే..
ఒక రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఉండడం కూడా అంత తేలికేం కాదు. ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో కనీసం ఆరుశాతం ఓట్లు తెచ్చుకోవడంతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలు గెలవాలి. లేకుంటే ఆరుశాతం ఓట్లు తెచ్చుకోవడంతో పాటు ఒక ఎంపీ సీటు గెలవాలి. అయితే జాతీయ పార్టీగా గుర్తింపు పొందితే ప్రయోజనమేంటి? అంటే.. దేశవ్యాప్తంగా ఒకే గుర్తు ఆ పార్టీకి లభిస్తుంది. ఇది ప్రధానమైన ప్రయోజనం. ఒకే గుర్తుపై దేశవ్యాప్తంగా పోటీ చేయవచ్చు. అంతేకాకుండా...గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు దూరదర్శన్, ఆలిండియా రేడియోలలో ప్రచారానికి ఉచితంగా సమయం కేటాయిస్తారు. ఓటర్ల జాబితాలను ఉచితంగా అందిస్తారు. అంతేకాకుండా ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి తక్కువ రేటుకు భూమిని కేటాయిస్తారు.
గుర్తింపు పొందిన జాతీయ పార్టీలివే..
ప్రస్తుతం దేశంలో గుర్తింపు పొందిన జాతీయ రాజకీయ పార్టీలు 8 ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ). ఇందులో నేషనల్ పీపుల్స్ పార్టీ ఇటీవలే జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఈ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సి.కె.సంగ్మా మేఘాలయ ముఖ్యమంత్రి కూడా. ఈయన దివంగత పీకే సంగ్మా కుమారుడు. గతంలో కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పెట్టినవారిలో శరద్‌పవార్‌తో పాటు సంగ్మా కూడా ఒకరు. అయితే సంగ్మా ఆ తర్వాత ఎన్సీపీ నుంచి బయటికొచ్చేసి ఎన్‌పీపీ పెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లోని ఏడింటిలో నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ గుర్తింపు పొందడం...జాతీయ పార్టీగా కూడా గుర్తింపు పొందేందుకు అవకాశం కల్పించింది. కాంగ్రెస్ నుంచి విడిపోయి పెట్టిన ఎన్సీపీ, దాన్నుంచి విడిపోయి పెట్టిన ఎన్‌పీపీ రెండూ జాతీయ పార్టీ హోదా సాధించడం కూడా విశేషమే. మరోవైపు వాస్తవానికి ఈ జాతీయ పార్టీల జాబితాలో ఇప్పటికే ఉన్నవాటిలో సీపీఐ, సీపీఎం, బీఎస్పీ లాంటి పార్టీలు గతంలో ఎప్పుడో గుర్తింపు పొందాయి. ఆనాటికి వీటికి జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు అర్హతలున్నా..ఇప్పుడు వీటిలో కొన్నింటికి జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఉండాల్సిన అర్హతలు లేవు. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సాధించే ఓట్లను బట్టి జాతీయ పార్టీల గుర్తింపుపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష చేయనుంది. దీంతో అప్పటివరకూ ఇవన్నీ జాతీయ పార్టీలుగానే కొనసాగుతాయి.