Anjani Kumar: తదుపరి డీజీపీగా అంజనీకుమార్!
ABN , First Publish Date - 2022-12-19T03:14:41+05:30 IST
రాష్ట్ర తదుపరి డీజీపీగా ఎవరు నియమితులు కానున్నారు? ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీకాలం మరో 12 రోజుల్లో ముగియనుండడంతో పోలీసు శాఖలో ఈ విషయం చర్చనీయాంశమైంది.
మరో వారంలో ఉత్తర్వులు!
ఏసీబీకి మహేశ్ భగవత్‌కు చాన్స్
రాచకొండ సీపీగా భగవత్ రికార్డు
ఆ స్థానంలో కమలాసన్ రెడ్డి!
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర తదుపరి డీజీపీగా ఎవరు నియమితులు కానున్నారు? ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీకాలం మరో 12 రోజుల్లో ముగియనుండడంతో పోలీసు శాఖలో ఈ విషయం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంజనీకుమార్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అంజనీకుమార్ గతంలో శాంతిభద్రతల డీజీగా, హైదరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. తదుపరి డీజీపీ నియామకానికి సంబంధించి, మరో వారంరోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. డీజీపీ రేసులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కూడా ఉన్నారు. అత్యంత కీలకమైన ఏసీబీ డీజీ పదవికి ప్రస్తుతం రాచకొండ కమిషనర్‌గా ఉన్న మహేశ్ భగవత్ వైపు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. రాచకొండలో సుదీర్ఘకాలం(ఆరేళ్లకు పైగా) సీపీగా పనిచేసిన రికార్డును నెలకొల్పిన మహేశ్ భగవత్.. కమిషనరేట్ పరిధిలో తనదైన ముద్ర వేశారు.
అతిపెద్ద కమిషనరేట్ అయినా.. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుని, యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఉన్న మారుమూల గ్రామాలకు సైతం పోలీసింగ్‌ను దగ్గర చేశారు. అన్నింటికీ మించి, కమిషనరేట్ పరిధిలో అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. ఓ వైపు శాంతిభద్రతలపై దృష్టిసారిస్తూనే.. సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థులకు మార్గదర్శనం చేస్తున్నారు. అత్యంత కీలకమైన రాచకొండకు కొత్త సీపీగా నిజామాబాద్ రేంజ్ డీఐజీ కమలాసన్‌రెడ్డి నియమితులవుతారని తెలిసింది. ఐపీఎ్‌సగా కన్‌ఫర్డ్ కాకముందు ఆయన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేసి, తనదైన ముద్ర వేశారు. నగరంలో రౌడీషీటర్లను అణిచివేశారు. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అజీజ్‌రెడ్డి, బెదిరింపులతో నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన గౌరు సురేశ్‌ల ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ అయూబ్‌ఖాన్ అరెస్టు ఈయన నేతృత్వంలో జరిగినవే. ఆ తర్వాత హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీగా పనిచేసిన సమయంలో వీసా గడువు ముగిసినా అక్రమంగా నగరంలో నివసిస్తున్న విదేశీయుల చిట్టా తీసి, డీపోర్టింగ్‌కు చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ సీపీగా తనదైన ముద్ర వేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన కమలాసన్‌రెడ్డి రాచకొండ బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయని సమాచారం.