Minister Gangula Kamalakar : మంత్రి గంగులకు సీబీఐ నోటీసులు

ABN , First Publish Date - 2022-12-01T01:58:29+05:30 IST

మంత్రి గంగుల కమలాకర్‌కు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం ఇద్దరు అధికారులు కరీంనగర్‌లోని మంత్రి ఇంటికి చేరుకున్నారు.

 Minister Gangula Kamalakar : మంత్రి గంగులకు సీబీఐ నోటీసులు

కరీంనగర్‌ క్రైం, నవంబరు 30: మంత్రి గంగుల కమలాకర్‌కు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం ఇద్దరు అధికారులు కరీంనగర్‌లోని మంత్రి ఇంటికి చేరుకున్నారు. గంగుల సోదరుడి కుమారుడికి నోటీసులు ఇచ్చి, ఆయన సంతకం తీసుకొని వెళ్లారు. ఐపీఎస్‌ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాస్‌ ఢిల్లీ స్థాయిలో రాయబారాలు, మోసాలు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించి మూడు రోజుల కిందట ఢిల్లీలో అరెస్టు చేశారు. శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన కాపు సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీ గాయత్రి రవిచంద్రతో దిగిన ఫొటోలు సీబీఐ దృష్టికి వచ్చాయి. దీంతో మంత్రి, ఎంపీలకు శ్రీనివాస్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీసేందుకు సిద్ధమైన దర్యాప్తు సంస్థ.. విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీచేసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడని మంత్రి గంగుల తెలిపారు. ఆ వివరాల కోసమే సీబీఐ అధికారులు నోటీసు ఇచ్చారన్నారు. తాను ఢిల్లీ వెళ్లి సీబీఐ అధికారులకు వివరాలు తెలియజేస్తానన్నారు.

Updated Date - 2022-12-01T01:58:30+05:30 IST