ఊరూవాడా దీపావళి సందడి
ABN , First Publish Date - 2022-10-24T00:05:38+05:30 IST
వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలైంది. ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలా
ఆమనగల్లు / శంషాబాద్, అక్టోబరు 23: వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలైంది. ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల పరిధిలో ఊరూవాడ దీపావళి పర్వదిన వేడుకలకు ప్రజలు సిద్ధమయ్యారు. చీకటి పై వెలుతురు, అసత్యంపై సత్యం విజయం సాధించినందుకు గుర్తుగా ఈ పండుగను అనాదిగా జరుపుకుంటారు. సోమవారం దీపావళి పండుగ నేపథ్యంలో లక్ష్మీపూజలు, నోములు, వ్రతాలు ఆచరించేందుకు ఇళ్లను, వ్యాపార సముదాయాలను, దుకాణాలను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా సూర్యగ్రహణం నేపథ్యంలో గతంలో మాదిరిగా నోములు, వ్రతాలకు ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. పండుగకు వివిధ ప్రాంతాలలో నివాసముండే వారు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీపావళి నేపథ్యంలో ఆదివారం మార్కెట్లో కొనుగోళ్ల సందడి మొదలైంది. మహిళలు పూలు, ప్రమిదలు, పూజా సామగ్రి కొనుగోలు చేయడంలో నిమగ్నమయ్యారు. ఆమనగల్లు పట్టణంలో టపాసుల దుకాణాలు పెద్దసంఖ్యలో వెలిశాయి. కాగా పెరిగిన ధరలతో బాణాసంచా కొనాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 25 నుంచి 30 శాతం వరకు ధరలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో పూల ధరలు కూడ పెరిగాయి. ఈ ఏడాది కిలో బంతిపూలు రూ.100 నుంచి 120ల వరకు నాణ్యతను బట్టి విక్రయించారు. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంతోపాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో దీపావళి పూజాసామగ్రి, పువ్వులు, టపాసులు, దొంతులు, బొమ్మల అమ్మకాలు ఆదివారం జోరుగా సాగాయి.