MLA Rohit Reddy: పైలట్‌కు పిలుపు
ABN , First Publish Date - 2022-12-17T03:02:37+05:30 IST
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలంగాణలో తన దూకుడును కొనసాగిస్తోంది. వ్యాపార లావాదేవీల్లో నల్లధనం చెలామణి కేసులో తాండూరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నాయిక రకుల్ ప్రీత్‌సింగ్‌కు నోటీసులు జారీ చేసింది.
19న విచారణకు రావాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ఈడీ ఆదేశం
అదే రోజు రావాలంటూ రకుల్‌కూ నోటీసు
డ్రగ్స్ కేసులో నటికి మూడోసారి తాఖీదు
ఈడీ ఎదుట హాజరవుతానన్న రోహిత్
ఎమ్మెల్యేకు నల్లధనం ఆరోపణలతోనే..
2015 నుంచి లెక్కలు సమర్పించాలి
బ్యాంకు లావాదేవీలు, పాస్‌పోర్టు ఇవ్వాలి
రోహిత్‌రెడ్డికి నోటీసులో ఈడీ నిర్దేశం
నేడు సీఎం కేసీఆర్‌తో రోహిత్ భేటీ!
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలంగాణలో తన దూకుడును కొనసాగిస్తోంది. వ్యాపార లావాదేవీల్లో నల్లధనం చెలామణి కేసులో తాండూరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నాయిక రకుల్ ప్రీత్‌సింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఇద్దరినీ డిసెంబరు 19న సోమవారం హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. పైలట్ రోహిత్‌రెడ్డి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వమే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఆదేశించిందని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించిన నేపథ్యంలో ఈడీ నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోపక్క టాలీవుడ్ డ్రగ్స్ కేసును తెలంగాణ సర్కారు తొక్కి పెట్టిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈడీ తన కోణంలో ఈ కేసును తవ్వి సినీరంగ సెలబ్రిటీలకు నోటీసులిచ్చి, విచారించింది. అందులో భాగంగానే తాజాగా రకుల్ ప్రీత్‌సింగ్‌కు మూడోసారి నోటీసులు ఇచ్చారు.
ఐటీ లెక్కలతో రావాలి
ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిని 2015 నుంచి తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఈడీ ఆదేశించింది. విచారణకు వచ్చేటప్పుడు తన, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యాపారాలు, ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఆధార్ వెంట తీసుకుని రావాలని ఈడీ తన నోటీసులో పేర్కొంది. ఈడీ నుంచి నోటీస్ అందినట్లు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ధ్రువీకరించారు. నోటీ్‌సలు విచిత్రంగా ఉన్నాయని, ఏ కేసులో విచారణకు పిలుస్తున్నదీ పేర్కొనలేదని చెప్పారు. ఈడీ నోటీ్‌సపై న్యాయవాదిని సంప్రదిస్తానని, 19న ఈడీ విచారణకు హాజరై అడిగిన సమాచారం ఇస్తానని స్పష్టం చేశారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తనపై ఎలాంటి నేరారోపణ లేదని, బీజేపీ నాయకుల ఒత్తిడి మేరకే తనకు నోటీసులు జారీ చేశారని అన్నారు. బెంగళూరు డ్రగ్స్ తనకు సంబంధం అంటగడుతూ ప్రచారం చేస్తున్నారని, నిజానికి ఈ కేసు మూడేళ్లుగా నడుస్తున్నా తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసు రాలేదని చెప్పారు. కర్ణాటక పోలీసులు తనను ఎప్పుడూ విచారణకు పిలవలేదని, ఎఫ్‌ఐఆర్‌లోనూ తన పేరు లేదని గుర్తు చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రమేయం ఉందని, ఈడీ విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని ఇటీవల బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల్లోనే పైలెట్‌కు వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఈడీ నోటీసులు అందడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి ఇప్పటి వరకు రోహిత్‌రెడ్డి వ్యాపారా లావాదేవీలు, ఆదాయ వనరులపై ఈడీ విచారణ జరపనున్నట్లు సమాచారం. సాధారణంగా ఈడీ ఎవరికైనా నోటీ్‌సలు జారీ చేస్తే ఏ కేసులో విచారణకు పిలుస్తున్నామనేది స్పష్టంగా పేర్కొంటుంది. గత కొంతకాలంగా ఈడీ జారీ చేస్తున్న నోటీసులో క్యూఆర్ కోడ్ కూడా ఉపయోగిస్తోంది. క్యూఆర్ కోడ్ ఉపయోగించి కూడా ఏ కేసులో ఈడీ నోటీసులు పంపిందనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
రెండుసార్లు రానందుకే రకుల్‌కు..
2017 జూలైలో ఎక్సైజ్ పోలీ్‌సలు మాదకద్రవ్యాల చట్టం కింద టాలీవుడ్ డ్రగ్స్ వాడకంపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశారు. అది ముందుకు సాగలేదు. రాష్ట్ర ప్రభుత్వమే టాలీవుడ్ ఒత్తిడికి తలొగ్గి కేసును తొక్కిపట్టిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఈడీ... నల్లధనం చెలామణి కోణంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసును విచారించడం మొదలెట్టింది. గత సంవత్సరం ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు పలువురు సినీ ప్రముఖుల్ని విచారించింది. రకుల్ ప్రీత్‌కు గత సంవత్సరం సెప్టెంబరు 6న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మొదటిసారి నోటీసులు ఇచ్చింది. ముందే ఖరారైన షెడ్యూల్స్ వల్ల ఆ రోజు విచారణకు హాజరుకాలేనని రకుల్ బదులిచ్చారు. దీంతో అదే నెల 3న విచారణకు రావాలని రెండోసారి పిలిచారు. ఆమె విచారణకు హాజరైన కాసేపటికే అత్యవసర పని ఉందని అధికారులకు చెప్పి వారి అనుమతితో విచారణ మధ్యలో వెళ్లిపోయారు. ఇప్పుడు తాజాగా మరోసారి నోటీసులు వచ్చాయి. గత సంవత్సరం సెప్టెంబరులో నల్లధనం చెలామణి కోణంలో విచారణ చేపట్టిన ఈడీ ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, ముమైత్ ఖాన్, దగ్గుబాటి రానా ఈడీ విచారణ ఎదుర్కొన్న వారిలో ఉన్నారు.
నేడు సీఎంతో రోహిత్ భేటీ
సీఎం కేసీఆర్‌తో రోహిత్‌రెడ్డి శనివారం భేటీ అవుతున్నారు. మనీలాండరింగ్‌పై ఈడీ నోటీ్‌సలు అందుకున్న పైలెట్ ఇదే అంశంపై సీఎంతో మాట్లాడనున్నారు. సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనూ రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పని చేశారు. ముగ్గురు నిందితులు అరెస్టు అయిన తర్వాత కొద్ది రోజులపాటు ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత ఎప్పటికప్పుడు ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి, ఆయన సూచనల మేరకు వ్యవహరించారు.