Munugode: బాధ, దుఃఖంతో తొలిసారి ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నా: కేసీఆర్

ABN , First Publish Date - 2022-11-03T20:42:26+05:30 IST

గతంలో ఎన్నడూ లేనివిధంగా మునుగోడు ఉప ఎన్నికలో పోలింగ్‌ శాతం భారీగా పెరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ (Exit polls) అన్ని టీఆర్‌ఎస్ అనుకూలంగా వచ్చాయి.

Munugode: బాధ, దుఃఖంతో తొలిసారి ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నా: కేసీఆర్
kcr

హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేనివిధంగా మునుగోడు ఉప ఎన్నికలో పోలింగ్‌ శాతం భారీగా పెరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ (Exit polls) అన్ని టీఆర్‌ఎస్ అనుకూలంగా వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election) ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ (CM KCR) మీడియా సమావేశం నిర్వహించారు. చాలా బాధాకరం, దుఃఖంతో తొలిసారి ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నానని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య హత్య జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హంతకులు స్వైరవిహారం చేస్తున్నారని, ఊహకు కూడా అందని విధంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. దేశాన్ని బీజేపీ సర్కార్ అన్ని రంగాల్లో నాశనం చేసిందని మండిపడ్డారు. నిరుద్యోగం, రూపాయి పతనం, పేదరికం వంటివి జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మునుగోడులో బీజేపీవి వెకిలిచేష్టలని కొట్టిపారేశారు. ఎన్నికల్లో ఎవరి ప్రయత్నం వాళ్లు చేసినా.. ప్రజాతీర్పును అందరూ గౌరవించాలన్నారు. ప్రతిపక్షాలు చెబితే సరే అనాలి.. లేదంటే ఎలక్షన్ కమిషన్ విఫలమా? అని ప్రశ్నించారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశామని గుర్తుచేశారు. బీజేపీలా దుర్మార్గంగా, దిగజారి ఎప్పుడూ వ్యవహరించలేదని కేసీఆర్‌ తెలిపారు.

‘‘న్యాయవ్యవస్థ, ఈసీ, మీడియా అంటే బీజేపీకి గౌరవం లేదు. ప్రజల కోసం పోరాడేవాళ్లు జైల్లో ఉన్నా గెలిచారు. బెంగాల్‌లో టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని.. సాక్షాత్తు ప్రధానినే చెప్పడం గతంలో ఎప్పుడైనా ఉందా?... ప్రధాని మోదీ తీరును ఖండించకపోతే అందరం పోతాం. ఎవరికి వారు నాకెందుకులే అనుకుంటే అందరం నష్టపోతాం. దేశం ఒక్కసారి దెబ్బతింటే వందేళ్లు వెనక్కి పోతాం. తెలంగాణలో ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారంటున్నారు. ఏం చూసుకుని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చింది. తెలంగాణ, ఢిల్లీ, ఏపీ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. బీజేపీ కొనుగోలు బాగోతం 3 గంటల వీడియో మా దగ్గర ఉంది. ప్రజల సౌకర్యం కోసం 60 నిమిషాలకు కుదించాం. తుషార్ అనే కీలక వ్యక్తితో బీజేపీకి సంబంధం ఉంది’’ అని కేసీఆర్ ఆరోపించారు.

Updated Date - 2022-11-03T20:42:28+05:30 IST