దొంగ జీవోలు జారీ చేసిన కేసీఆర్ సర్కార్: విజయశాంతి
ABN , First Publish Date - 2022-10-31T23:42:46+05:30 IST
కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తెలంగాణ మొత్తాన్నీ దోచుకుంటోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. సోమవారం సోషల్ మీడియాలో రాములమ్మ ఓ పోస్ట్ చేశారు.
హైదరాబాద్: కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తెలంగాణ మొత్తాన్నీ దోచుకుంటోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. సోమవారం సోషల్ మీడియాలో రాములమ్మ ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్టును యథావిధిగా పోస్ట్ చేస్తున్నాం‘‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి తాండవం చేస్తోంది. ఇదంతా బయట పడకుండా ఉండడానికే తాజాగా రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టకుండా కేసీఆర్ సర్కార్ రహస్య ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకోసం రెండు నెలల కిందటే జీవో నెం.51ని జారీ చేసినప్పటికీ ఇన్నాళ్లూ బయటపెట్టలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ... బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ జీవో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు రావడంతోనే సీబీఐ విచారణకు ‘నో’ చెప్తూ కేసీఆర్ ప్రభుత్వం జీవో 51ని ఇచ్చింది. ఆగస్టు 30న ఈ జీవో విడుదలైంది. కవిత మెడకు లిక్కర్ స్కాం ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఆందోళనతోనే రాష్ట్రంలోకి సీబీఐ అడుగుపెట్టకుండా కేసీఆర్ సర్కార్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అక్రమాలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు దర్యాప్తు సంస్థలకు ఇటీవల పలు ఫిర్యాదులు అందాయి. వాటిపైన కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణకు దిగే అవకాశముందని గుర్తించే సీబీఐకి అనుమతి రద్దు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులిచ్చింది. ఇది చాలదా, తప్పు ఎవరు చేశారో ప్రజలకు అర్థం కావడానికి... మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వారంతా మీకు తగిన సమాధానం చెప్పక మానరు’’ అని టీఆర్ఎస్ సర్కారుపై విజయశాంతి మండిపడ్డారు.