భైంసాలో ఇంటర్నెట్ బంద్
ABN , First Publish Date - 2022-11-30T03:54:59+05:30 IST
నిర్మల్ జిల్లా భైంసాలో మంగళవారం నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ సందర్భంగా పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
144 సెక్షన్ విధింపు, వాహనాల అడ్డగింత
బీజేపీ సభ నేపథ్యంలో పోలీసుల చర్యలు
అయినా భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
నిర్మల్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా భైంసాలో మంగళవారం నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ సందర్భంగా పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సభ ప్రారంభానికి గంట ముందు నుంచి సభ ముగిసేంత వరకు ఇంటర్నెట్ సేవలను పూర్తి స్థాయిలో ఆపివేశారు. దీంతో టీవీ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అదే సమయంలో బహిరంగ సభ కవరేజీకి వెళ్లిన పాత్రికేయులు సైతం నానా అవస్థలు పడ్డారు. ఎన్నో ఆంక్షలు, ఒతిళ్ల నడుమ మొదలైన బండి సంజయ్ యాత్ర రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభం కావడం కాషాయ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని నింపింది. తొలుత ప్రారంభమైన షెడ్యూల్ ప్రకారం కాకుండా ఒక రోజు ఆలస్యంగా మొదలైన సంజయ్ యాత్రకు నిర్మల్ జిల్లా నుంచే కాకుండా పక్కనే గల ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పార్టీ శ్రేణుల నుంచి కూడా భారీ మద్దతు లభించింది. పోలీసులు 144 సెక్షన్‌ను విధించి, వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసినా.. నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బహిరంగ సభ సక్సెస్ కావడంతో పార్టీ వర్గాల్లో కొత్త జోష్ కనిపించింది. బహిరంగ సభ ముగిసిన అనంతరం వందలాది మంది కార్యకర్తలు బండి సంజయ్ పాదయాత్రను భజాభజంత్రీలు, డిజే సౌండ్‌ల నడుమ కొనసాగించారు.