Karimnagar: మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో సీబీఐ సోదాలు
ABN , First Publish Date - 2022-11-30T14:29:56+05:30 IST
కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) నివాసంలో సీబీఐ (CBI) అధికారులు సోదాలు చేస్తున్నారు.
కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) నివాసంలో సీబీఐ (CBI) అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రి నివాసంతోపాటు ఆయన సోదరులు, బంధువుల ఇళ్లల్లో సోదాలు
నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈడీ (ED), ఐటీ (IT) అధికారులు మంత్రి గంగుల ఇంట్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరోసారి అధికారులు మంత్రి గంగుల ఆయన సోదరులు, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేయడం కలకలంరేపుతోంది. గ్రానైట్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి మంత్రి సోదరుడిని ఇప్పటికే ఈడీ అధికారులు హైదరాబాద్‌లో విచారించారు. ఈ నేపథ్యంలో అధికారులు మరోసారి గంగుల కమలాకర్ నివాసం, ఆయన సోదరుల ఇంటికి రావడం రాజకీయంగా కలకలం రేగుతోంది. అధికారులు మూడు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు.
కాగా ఢిల్లీలో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో మంత్రి గంగుల కమలాకర్‌కు విచారణకు సంబంధించిన సమన్లు ఇచ్చేందుకు ఆయన ఇంటికి సీబీఐ బృందం వెళ్ళింది. నకిలీ సీబీఐ అధికారి మంత్రి కమలాకర్‌తో టచ్‌లో ఉన్నట్లు సీబీఐ నిర్ధారించింది. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ చాలా కాలంగా పలువురు రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరిపి.. ఈడీలో చాలా మంది సీనియర్ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకున్నారు.
ఇటీవల గంగుల కమలాకర్‌కు చెందిన గ్రానైట్ సంస్థలపై ఈడి సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈడీ సోదాల నుంచి ఉపశమనం పొందేలా చూస్తానంటూ గంగుల కమలాకర్‌కు నకిలీ సీబీఐ శ్రీనివాస్ హామీ ఇచ్చినట్టు సమాచారం. అందుకు ప్రతిగా కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలియవచ్చింది. ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో నకిలీ సీబీఐ ఆఫీసర్ శ్రీనివాసుని సీబీఐ అదుపులోకి తీసుకుంది. నోటీసులు అందుకున్న గంగుల కమలాకర్, ఆయనతో పాటు నోటీసులు అందుకున్న రాజ్యసభ ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర గురువారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ పేర్కొంది. దీంతో మంత్రి గంగుల, ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర రేపు ఢిల్లీ వెళ్ళనున్నట్టు సమాచారం.